జగన్ కు చెడ్డ పేరు: పథకాలపై దృష్టిపెట్టని మంత్రులు

అధికారం చేపట్టిన 2 నెలల లోపే రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు సీఎం జగన్. కొత్త పథకాలను పట్టాలెక్కిస్తున్నారు, మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఈ కాస్త సంధి కాలంలోనే కొన్ని కార్యక్రమాలు జగన్ సర్కార్ కి ఇబ్బంది తెచ్చేలా ఉన్నాయి, ప్రతిపక్షాల చేతిలో ఆయుధాలుగా మారాయి. వీటిలో ఒకటి ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటి వరకూ స్కూల్ పిల్లల లాగే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. అయితే జగన్ ప్రవేశ పెట్టిన కొత్త పథకం "జగనన్న విద్యాదీవెన" ద్వారా వీరందరికీ ఏటా 20 వేల రూపాయలు అందిస్తారు. అంటే ఇప్పుడున్న స్కాలర్ షిప్ స్థానంలో 20 వేల రూపాయల లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ పథకం తెచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనానికి విరామం ప్రకటించారు. దీంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు సహజంగానే రోడ్డెక్కారు.

బీజేపీ, టీడీపీ అనుకూల విద్యార్థి సంఘాల మద్దతుతో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. విద్యార్థులకు లభిస్తున్న ప్రయోజనాలను వివరించి, మధ్యాహ్న భోజనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అయితే మంత్రులు ఎక్కడా సమర్థంగా వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. అదే ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా, టీడీపీకి ఆయుధంగా మారింది.

ఈ విషయంలో ఒక్క ఎంపీ విజయ సాయిరెడ్డి మాత్రమే స్పందించారు. అది కూడా ట్విట్టర్ లో సమాధానమిచ్చారు. చంద్రబాబు చేయిస్తోన్న విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. విజయసాయి బాటలో మిగతా మంత్రులు కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వ ఆలోచనను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. విద్యార్థుల దృష్టిలో చెడ్డపేరు వస్తుంది.

ఇక రెండోది అమ్మఒడి పథకం. ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ పాఠశాలలకూ వర్తింపచేస్తామన్నారు సరే, మరి తొలి బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రంలోని నిరుపేద  కుటుంబాలన్నిటికీ సరిపోతాయా? తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలుంటే ఒకరికి మాత్రమే అమ్మఒడి లబ్ది అందుతుంది. రెండోవారికి ఏంచేయాలి? ఇలాంటి సవాలక్ష సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. వీటన్నిటినీ అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు అక్కడక్కడా విద్యార్థి సంఘాలతో నిరసనలు చేయిస్తున్నారు. అమ్మఒడిని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపచేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇది ప్రైవేట్ పాఠశాలలకు లబ్ధి చేకూరుస్తుందని విమర్శిస్తున్నారు.

దీనిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించి, అపోహలు తొలగించాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. ఇదే కాదు.. నూతన ఇసుక విధానం, రేషన్ డీలర్ల ఉపాధి.. లాంటి చాలా బర్నింగ్ ఇష్యూలపై ఎందుకో మంత్రులు సరిగా స్పందించడం లేదు. సకాలంలో స్పందించకపోతే.. అటు వైపు పచ్చమీడియా ఎప్పుడెప్పుడా అని కాచుకు కూర్చుంది. ప్రభుత్వంపై బురద జల్లడానికి సిద్ధంగా ఉంది. ఈ అంశాలకు ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా ప్రాధాన్యం ఇస్తోంది.

ఈ విషయంలో జగన్ ను నిందించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన అన్ని విషయాల్ని పట్టించుకోలేకపోవచ్చు. ఇలాంటప్పుడే మంత్రులు ముందుకు రావాలి. శాఖలతో సంబంధం లేకుండా అంతా కలిసికట్టుగా టీడీపీ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. దురదృష్టవశాత్తూ వైసీపీ మంత్రుల్లో ఈ చొరవ లోపించింది. అదే ఇప్పుడు టీడీపీకి వరమైంది.

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం