ఎన్టీఆర్ బయోపిక్ క్యాన్సిల్?

ఇంకా బయటకు పక్కాగా రాలేదు కానీ ఇది వాస్తవం అని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది. హీరో బాలకృష్ణ తన తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించాలన్న ఆలోచనను విరమించుకున్నారట. ఇప్పట్లో అది మంచి ప్రయత్నం కాదని పలు వర్గాల నుంచి అందిన సూచనల మేరకు బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని, దాంట్లో బాలయ్యే తన తండ్రి పాత్ర పోషించాలని అనుకున్నారు. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దానికి దర్శకత్వం వహించడం కూడా ఖరారు అయింది. ఆ వెంటనే ఆర్జీవీ ఓ ప్రకటన కూడా విడుదల చేసారు. అడవి రాముడు సినిమా బోలెడు సార్లు చూసాను కాబట్టి, తనకే ఎన్టీఆర్ బయోపిక్ తీసే అర్హత వుందని ఆయన ఆ నోట్ లో పేర్కొనడం విశేషం. ఇలా అడవి రాముడే కాదు ఎన్టీఆర్ సినిమాలు అన్నీ పదుల సంఖ్యలో చూసిన వారు తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో వుంటారు. అది వేరే సంగతి.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీస్తారని, ఒకభాగం ముఖ్యమంత్రి అయ్యే వరకు వుంటుందని వార్తలు వినవచ్చాయి. కానీ ఇప్పుడు టోటల్ గా ప్రాజెక్టునే బాలయ్య పక్కన పెట్టేసారని తెలుస్తోంది. ఎన్నికలు రెండేళ్ల లోపు దూరంలో వుండగా ఇలాంటి ప్రయత్నం ఎందుకు అని అనుకున్నారో? లేదా ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని వివాదాస్పద కోణాలు కూడా టచ్ చేయాల్సి వస్తుందని అనుకున్నారో? లేదా రామ్ గోపాల్ వర్మ లాంటి వివాదాస్పద దర్శకుడి చేతిలో ఆ సినిమా పెట్టడం ఎందుకు అని భావించారో? మొత్తం మీద ప్రాజెక్టును అయితే పక్కన పెట్టేసారని వినికిడి. ఏ విషయమూ బాలయ్య బాబు క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు.

Readmore!
Show comments