మాటలు బాగున్నాయి.. చేతల సంగతేంటి పవన్?

175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, అత్యధిక స్థానాల్ని కొత్త ముఖాలకు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రకటన అయితే బాగానే ఉంది కానీ, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే క్రమంలో మాత్రం పవన్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. ఓవైపు కొత్తవాళ్లకు సీట్లు ఇస్తామని ప్రకటిస్తూనే, మరోవైపు అదే నోటితో వలసల్లో భాగంగా చాలామంది సీనియర్లు వస్తారని, వాళ్లందరికీ ప్రాధాన్యం ఇస్తామని పవన్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తన పార్టీలోకి వలసలు పెరుగుతాయని, అలా వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుల్ని పోటీలో దింపి ఎన్నికల్లో నెగ్గుకొద్దామనేది పవన్ ఆలోచన. అందుకే పార్టీ ఇన్ చార్జ్ ల విషయంలో, అభ్యర్థుల ప్రకటనలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ కనీసం నియోజకవర్గ ఇన్ చార్జ్ లను కూడా ప్రకటించకపోతే 175 స్థానాల్లో పోటీ చేస్తామన్న పవన్ మాటను నమ్మేదెలా..?

మరోవైపు 60శాతం సీట్లను కొత్త వాళ్లకే కేటాయిస్తామంటూ జనసేనాని చేసిన ప్రకటన వెనక ఓ భారీ ఎత్తుగడ కనిపిస్తోంది. పేరుకు వీళ్లు కొత్త ముఖాలే అయినప్పటికీ, వీళ్ల వెనక బలమైన ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ లేదా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండబోతోంది. ఈ మేరకు నియోజకవర్గ స్థాయిలో అంతర్గత సర్వే పూర్తిచేశారు పవన్.

పవన్ లెక్కప్రకారం చూసుకుంటే దాదాపు 90కి పైగా స్థానాల్ని కొత్త వాళ్లకు కేటాయించాల్సి వస్తుంది. వీళ్లలో కనీసం 40 మంది పైన చెప్పుకున్న బాపతు అభ్యర్థులు ఉండబోతున్నారు. ఓవైపు వలస నేతలు, మరోవైపు డబ్బు సంచులతో వచ్చే ఔత్సాహికులు, ఇంకోవైపు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే కొత్త ముఖాలు.. వీళ్లందరికీ చోటిచ్చిన తర్వాత అప్పుడు అసలైన కొత్త ముఖాలకు అవకాశం దక్కబోతోందన్నమాట.

ఇలా చూసుకుంటే పార్టీ టిక్కెట్ కోసం ఆశపెట్టుకున్న చాలామంది ఆశలు గల్లంతవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.  పార్టీ నిర్మాణం అంటూ యాత్రలు చేసి జనాల్లో జనసేన అంటే ఇప్పటికే ఓ ఇమేజ్ సృష్టించారు పవన్. జనసేనాని అభిమానులంతా జనసైనికులుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు.

పార్టీ టికెట్ వస్తుందన్న భరోసారో చాలామంది నియోజకవర్గాల్లో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లందర్నీ పవన్ ఆదుకుంటారా.. టిక్కెట్లు కేటాయించగలరా? చంద్రబాబు, జగన్ లాంటి నేతలకే కాదు, ఇప్పుడు పవన్ లాంటి నేతలకు కూడా టిక్కెట్ల కేటాయింపు తలనొప్పిగా మారిందన్నమాట.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments