కామెడీతో ఏదైనా 'చల్‌తా'

తెలుగులో మొన్నీమధ్యనే సుమంత్‌ హీరోగా 'నరుడా డోనరుడా' అనే సినిమా వచ్చి, వెళ్ళిపోయింది. అసలా సినిమాని సుమంత్‌ ఎలా చేశాడు.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఆ సినిమా తెరకెక్కడానికే చాలా టైమ్‌ పట్టింది. ఇలాంటి సినిమా తెలుగులో వర్కవుట్‌ అవుతుందా.! అనే సందేహంతోనే ఎక్కువ టైమ్‌ గడిచిపోయింది. ఎలాగైతేనేం, సినిమా పట్టాలెక్కింది.. విడుదలయ్యింది, ఫ్లాప్‌ అయ్యింది కూడా. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ సినిమా బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'విక్కీడోనర్‌'కి రీమేక్‌. బాలీవుడ్‌లో వర్కవుట్‌ అయిన కాన్సెప్ట్‌, తెలుగులో తేలిపోయింది. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, 'విక్కీడోనర్‌' కాన్సెప్ట్‌నే 'చీ.. యాక్‌..' అనుకుంటోన్న తరుణంలో, 'అంగస్తంభన సమస్య' కాన్సెప్ట్‌తో మరో బాలీవుడ్‌ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా పేరు మాత్రం 'శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌'. టైటిల్‌ అదిరింది, కానీ కాన్సెప్టే ఒకింత జుగుప్సాకరంగా అన్పిస్తోంది. కాన్సెప్ట్‌ ఏదైతేనేం, దానికి 'హ్యూమర్‌' అనే 'స్వీట్‌' కోటింగ్‌ వేసేస్తున్నారు కదా.! 

ఆయుష్మాన్‌ ఖురానా, భూమి పెడ్నేకర్‌ ఈ 'శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌' సినిమాలో ప్రధాన తారాగణం. జుగుప్సాకరమైన కాన్సెప్టే అయినా, డీసెంట్‌ మేనర్‌లో కామెడీ జొప్పించి సినిమా తీశారట. 'అయినా, ఇప్పుడిది సమాజంలో చాలా ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య. దీని గురించి చాలా చాలా చర్చ జరగాలి..' అంటున్నారు దర్శక నిర్మాతలు. ఆర్‌.ఎస్‌. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments