మొత్తానికి విజయశాంతిని వాడేస్తున్నారండోయ్!

కాంగ్రెసు పార్టీలో చేరిన నాటినుంచి ఎక్కడా మీడియాలో కూడా కనిపించకుండా, అజ్ఞాతంలోనే ఉండిపోయిన విజయశాంతికి ఇప్పుడు ఒక్కసారిగా మహర్దశ వచ్చేసింది. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి రకరకాల కమిటీలను ప్రకటించిన కాంగ్రెస్ విజయశాంతికి స్టార్ కాంపెయినర్ హోదాను కట్టబెట్టింది. విజయశాంతి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది. విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ గా.. కేసీఆర్ సర్కారు మీద నిప్పులు చెరగితే.. తమ పార్టీకి లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

గతంలో చాన్నాళ్లపాటూ తెరాసలో కూడా పనిచేసి, ఉద్యమ సమయంలో అనేక పదవులు కూడా అనుభవించిన విజయశాంతి.. తర్వాత పార్టీనుంచి తప్పుకున్నారు. ఒకప్పట్లో లేడీ అమితాబ్ గా, ఫైర్ బ్రాండ్ మహిళామణిగా ముద్రపడిన విజయశాంతి సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న తరువాత.. ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీకోసం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని అప్పట్లో ప్రకటించారు కూడా! అంతే ఆ ఒక్కరోజు తప్ప.. మళ్లీ విజయశాంతి వార్తల్లో కూడా కనిపించలేదు. ఇన్నాళ్లకు ఆమెను పార్టీ సరైన రీతిలో వాడుకునేలా గట్టి పదవినే కట్టబెట్టింది.

అంతోఇంతో తెలంగాణలకు ప్రజలకు తెలిసిన నాయకురాలు అయిన విజయశాంతిని ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వాడుకుంటుందా? లేదా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోందంటూ గ్రేటాంధ్ర ఇదివరలోనే ఓ కథనాన్ని అందించింది. ఆ చర్చను నిజం చేస్తూ.. ఆమెకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చారు.

అయితే విజయశాంతిని కీలకమైన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతారా లేదా అనేది మాత్రం తేలడంలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో  దించితే.. ఒక స్థానానికి పరిమితం అయిపోతుందని.. అలాకాకుండా.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆమె ఫైర్ బ్రాండ్ విమర్శల్ని రాష్ట్రమంతా ప్రచారానికి వాడుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments