మెగాస్టార్‌కి చిర్రెత్తుకొచ్చేస్తోంది

రాజకీయాలకు దూరంగా వుండడం ద్వారా సినిమాలకు టైమ్‌ కేటాయించగలుగుతున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. పూర్తిగా రాజకీయాల్ని చిరంజీవి ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్లే. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో ప్రేక్షుల ముందుకొచ్చేందుకు చిరంజీవి శ్రమిస్తున్న వేళ, పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లో యాక్టివ్‌ అవడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. 

సినిమా వేరు, రాజకీయం వేరు. అయినాసరే, పవన్‌కళ్యాణ్‌ తెలంగాణ గురించి మాట్లాడుతోంటే, ఆ ఎఫెక్ట్‌ తమ సినిమాలపై పడుతుందేమోనన్న టెన్షన్‌ ఇటు చిరంజీవికీ, ఇంకోపక్క పవన్‌కళ్యాణ్‌కీ పెరిగిపోతోందట. చరణ్‌ హీరోగా నటించిన 'ధృవ' సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం విదితమే. చిరంజీవి సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు 'సమైక్యాంధ్రకు జై' అన్న చిరంజీవి, అప్పట్లో తెలంగాణ సెగ ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే, ఆ సెగ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు చిరంజీవి. ఈ టైమ్‌లోనే, తెలంగాణ గురించి పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ కాక రేపుతున్నారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్‌, పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో చిరంజీవి అలాగే చేశారు, ఇప్పుడు పవన్‌ ఇలానే చేస్తున్నారంటూ.. ఓ రకంగా కాస్త వక్రీకరించే పవన్‌పై కేటీఆర్‌ దుమ్మెత్తిపోసిన మాట వాస్తవం. కానీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ మంత్రం జపిస్తే ఇంకేమన్నా వుందా.? వాస్తవాలు అటకెక్కిపోతాయ్‌. ఈ విషయం చిరంజీవికి బాగా తెలుసు. ఆ సెగ తనకూ, తన కుమారుడికి తగిలితే ఏంటన్న భయం చిరంజీవిని వెంటాడుతోందట. 

ఇంకోపక్క, రాజకీయాల్లోనూ ఇప్పుడు చిరంజీవి పేరు విరివిగానే విన్పిస్తోంది. 'మీ అన్నయ్య కేంద్ర మంత్రిగా ఏం చేశాడో నీకు తెలుసు కదా.. ముందు మీ అన్నయ్యను ప్రశ్నించు..' అంటూ చిరంజీవి పేరుని ప్రస్తావిస్తూ పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నిస్తున్నారు పవన్‌ రాజకీయ ప్రత్యర్థులు. అందుకే మరి, చిరంజీవికి చిర్రెత్తుకొచ్చేస్తోంది.

Show comments