కేసీఆర్ కు వాళ్లతో చిరాకు పుడుతోందట!

ఒకేసారి నూటా ఐదుమంది అభ్యర్థులను ప్రకటించేసేంత డేర్ ను చూపించినా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు మాత్రం రెబల్స్ పోటు తప్పడంలేదు. అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించేసి చాలాకాలం అయినా.. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఎవరో తేలి కూడా చాలాకాలమే అయినా.. వారిని శాంతిపజేయడం తెరాస అధినేతకు సాధ్యం కావడంలేదు.

ఇప్పటికీ పది నియోజకవర్గాల్లో తెరాసకు గట్టి రెబల్స్ కనిపిస్తున్నారు. వారిలో కొందరు స్వతంత్రులుగా సత్తా చూపుతాం అంటుంటే.. మరి కొందరు మాత్రం వేరే పార్టీల గుర్తుల మీద రంగంలోకి దిగుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ ఉన్నారంటే.. జాబితా చివరి వరకూ ఖరారు కాకపోవడంతో వారి పోటు తప్పడం లేదని అనుకోవచ్చు. అయితే తెరాసలో కూడా అలాంటి వారు కనిపిస్తూ ఉండటంతో.. కేసీఆర్ కు చిరాకు తీవ్ర స్థాయికి చేరుతోందని వార్తలు వస్తున్నాయి.

ఒకటని కాదు... రాజేంద్రనగర్, మహేశ్వరం, కోదాడ, స్టేషన్ ఘన్ పూర్, చెన్నూరు, వరంగల్ తూర్పు, భూపాల పల్లి, రామగుండం.. తదితర నియోజకవర్గాల్లో తెరాసకు రెబల్స్ పోటు గట్టిగానే కనిపిస్తోంది. ఇక్కడ తెరాస టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లు ఇండిపెండెంట్స్ గా రంగంలోకి దిగారు.

మరి కొందరు బీఎల్ఎఫ్ తరఫున, బీఎస్సీ వంటి పార్టీల తరఫున పోటీలో ఉన్నారు. వీరితో చర్చలకు కేటీఆర్ చాలానే కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి తెరాసకు మరిన్ని నియోజకవర్గాల్లో కూడా రెబల్స్ రేగారు.

కానీ.. వారిని బతిమాలి, బుజ్జగించి నామినేషన్ వరకూ రాకుండా చూసుకున్నారు. అలాంటి వారందరూ పోనూ.. ఇంకా పది నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన స్థాయిలో బలమున్న రెబల్స్ పోటీలో ఉండటం విశేషం.

మళ్లీ మనపార్టీనే అధికారంలోకి వస్తుంది.. ఇప్పుడు తప్పుకోండి. అప్పుడు మీకు ప్రాధాన్యత ఉంటుంది.. అనే మాటలతో తెరాస నేతలు రెబల్స్ ను బుజ్జగిస్తున్నారని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా ఎంతమంది తప్పుకుంటారో తెలుస్తుంది.

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments