టీడీపీ పంపకం: కాంగ్రెస్‌కి 1 ప్లస్‌ 12.?

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకీ, కాంగ్రెస్‌ పార్టీకీ మధ్య 'అవగాహన' దాదాపుగా బయటపడిపోయింది. నిన్నటి రాహుల్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన తర్వాత ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చేసిందని ఇటు టీడీపీ వర్గాల్లోనూ, అటు కాంగ్రెస్‌ వర్గాల్లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చల సారాంశమేంటంటే, 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం కాదు.. రెండు పార్టీలూ ఓ అవగాహనకు రావడం జరుగుతుందనీ, ఈ అవగాహనలో భాగంగా ఓ ఎంపీ టిక్కెట్‌, 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌కి దక్కవచ్చుననీ తెలుస్తోంది.

నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితికి, ఈ 'అవగాహన' ద్వారా దక్కే సీట్లు చాలా చాలా ఎక్కువే. ఒక్క ఎంపీ సీటు, 12 అసెంబ్లీ సీట్లు చంద్రబాబు, కాంగ్రెస్‌కి ఆఫర్‌ చేయడమంటే చిన్న విషయం ఏమీ కాదు. అయితే, ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్‌ వుంది. అదేంటంటే, ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు ఓ నిర్ధారణకు వచ్చారట. 'అవగాహన' ద్వారా వాటిల్లో గెలవడానికి అవకాశాలు మెరుగవుతాయన్నది చంద్రబాబు ఆలోచనగా కన్పిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సీట్ల పంపకం చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. 30 స్థానాల్ని టీడీపీ ఆశిస్తోంటే, 15 నుంచి 20 మధ్యనే టీడీపీకి ఇస్తామని కాంగ్రెస్‌ అంటోంది. ఎంపీ సీట్ల గురించి ఆలోచించవద్దని అంటూనే, ఒక్కటి మాత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని కాంగ్రెస్‌, టీడీపీకి సూచించిందట. దాదాపు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో అవగాహన ద్వారా కాంగ్రెస్‌కి, టీడీపీ ఆఫర్‌ చేసే అవకాశాలున్నాయన్నమాట.

కాగా, ఆ ఒక్క ఎంపీ టిక్కెట్ కూడా.. రాయలసీమ నుంచే కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఆఫర్ చేయనుందట. ఇది అవగాహన మాత్రమేననీ.. అధిష్టానం స్థాయిలో ఈ అవగాహన కుదరనుందనీ, ఇక్కడ పొత్తుల ఊసేలేదని, టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత మీడియాకి ఉప్పందించడం గమనార్హం.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పలు సర్వేల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మెజార్టీ ఓటర్లు మొగ్గుచూపతున్న వైనం, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి మింగుడుపడ్డంలేదు. సర్వేల ఫలితాలే నిజమవుతాయా.? అన్న ఆందోళన చంద్రబాబులో పెరిగిపోతోంది.

సర్వేల ఫలితాల నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకోసం మిగిలిన పాలనా కాలంలో వీలైనంతగా 'సంక్షేమ పథకాల్ని' పెంచేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కన్పిస్తోంది.

Show comments