ర‌ఘురామ అంతే.. కూట‌మిపై ఫైర్‌!

న‌ర‌సాపురం ర‌ఘురామ‌కృష్ణంరాజు అంటే మామూలు వ్య‌క్తి కాదు. ఎవ‌రైతే ఆద‌రిస్తారో, వాళ్ల‌నే తిడుతుంటార‌నే ప్ర‌చారం వుంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ వైసీపీని, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎలా తిట్టారో అంద‌రికీ తెలుసు. వారిని తిట్ట‌డం ఇంత‌టితో ఆగ‌దు. అది వేరే సంగ‌తి.

తాజాగా కూట‌మి పార్టీల‌ను తిట్ట‌డం మొద‌లు పెట్టారు. న‌ర‌సాపురం ఎంపీ బ‌రిలో మ‌రోసారి వుంటాన‌ని ప్ర‌తి వేదిక‌పై నుంచి ఆయ‌న చెబుతూ వ‌చ్చారు. విజ‌య‌న‌గ‌రం ఎంపీ లేదా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఎక్క‌డైనా అసెంబ్లీ సీటును ర‌ఘురామ‌కు ఇచ్చే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న తీవ్రంగా స్పందించారు. అక్క‌డికి వెళ్లాల్సిన అవ‌స‌రం త‌న‌కేంట‌ని ప్ర‌శ్నించారు. న‌ర్సాపురం టికెట్‌ను టీడీపీ త‌న‌కు ఇవ్వాల్సిందే అని ఆయ‌న అన్నారు.

ప‌నిలో ప‌నిగా ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రిపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. పురందేశ్వరి పదవులు అనుభవించి వస్తే బీజేపీలో సీటు ఇచ్చారని మండిప‌డ్డారు. వీర్రాజు కంటే పురందేశ్వరి సీనియరా అని నిగ్గ‌దీశారు. రాజమండ్రి లోక్‌స‌భ టికెట్‌కు అనర్హుడా అని ధ్వ‌జ‌మెత్తారు. రాజమండ్రిలో వీర్రాజు, అనకాపల్లిలో మాధవ్ కు సీటు ఇచ్చి ఉంటే సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని నమ్మే అవకాశం ఉండేదన్నారు.

30 ఏళ్లుగా శ్రీ‌నివాస్ వ‌ర్మ బీజేపీలో ఉన్నార‌నే కార‌ణంతో సీటు ఇస్తే మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు ఇవ్వలేదని బీజేపీ నాయ‌క‌త్వాన్ని నిల‌దీశారు. తొక్క‌లో సోది చెప్పి బీజేపీ త‌న‌కు సీటు ఇవ్వ‌లేద‌న్నారు. న‌ర్సాపురంలోనే సీటు ఇవ్వాల‌ని టీడీపీని డిమాండ్ చేశారు. నిన్ను న‌మ్ముకున్నోడికి సీటు ఇవ్వ‌క‌పోతే ఇక పోల‌వ‌రం ఏం క‌డ‌తావ‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నించ‌రా? అంటూ చంద్ర‌బాబును త‌న స్టైల్‌లో నిల‌దీశారు.
 
నర్సాపురం మిన‌హాయించి ఏ సీటు ఇచ్చినా అవసరం లేదని, తనకు ఆ సీటు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్ప‌ష్టం చేశారు. తన గొంతు కోస్తారని చెప్పినా చంద్రబాబు న‌ర్సాపురం సీటును బీజేపీకే ఇచ్చారని ఆగ్ర‌హించారు. తనకు సీటు ఇవ్వలేక పోతే చంద్రబాబు రేపు పోలవరం కడతారంటే, కేంద్రంతో పోరాటం చేస్తారంటే ఎలా నమ్ముతారంటూ రఘురామ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను మోస‌గించార‌ని కూట‌మి పార్టీల‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. ఎవ‌రు మోసం చేశార‌నే ప్ర‌శ్నకు అంద‌రికీ తెలుస‌న్నారు. కేంద్ర బీజేపీని క‌ళ్లున్న దృత‌రాష్ట్రుడిగా పోల్చడం గ‌మ‌నార్హం.

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ప‌దేళ్ల పాటు యూపీఏ ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు అనుభ‌వించార‌ని, అలాంటి వ్య‌క్తికి ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చార‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు విమ‌ర్శించారు. ఈ సంద‌ర్భంలో మ‌హిళా యాంక‌ర్ ఓకే.. అని ఏదో క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌గా... ర‌ఘురామ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే అస‌లైన పాయింట్ అంటూ రెచ్చిపోయారు. బీజేపీ, జ‌గ‌న్ ఒక‌టి కాన‌ప్పుడు న‌ర‌సాపురంలో టికెట్ ఇవ్వ‌డానికి ఎలాంటి అభ్యంత‌రం వుండ‌కూడ‌ద‌న్నారు.

Show comments