బొత్స ఇలాకా -వైసీపీలో అసంతృప్తి సెగలు

వైసీపీకి ఉత్తరాంధ్రలో అతి పెద్ద దిక్కుగా అటు అధినాయకత్వంతో పాటు, ఇటు తనకు తానుగా ప్రకటించుకున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యవహారశైలి పార్టీని తరచూ  కష్టాల పాలు చేస్తోందన్నది గత రెండున్నర ఏళ్ల పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా బొత్స సొంత ఇలాకా అయిన విజయనగరం జిల్లా పార్టీలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు ఏకంగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీకి  గుడ్‌బై చెప్పేంతవరకూ దారి తీశాయి.  ఆయన అధినాయకత్వం బుజ్జగింపులతో శాంతించినా జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. ఆయన స్ధానంలో బొత్స వీర విధేయునికి పట్టాభిషేకం కూడా జరిగిపోయింది.అసంతృప్తితోనే పార్టీలో ఉన్న కోలగట్ల రానున్న రోజులలో పార్టీకి  దూరమైనా ఆశ్చర్యపోనవసరంలేదన్నది సొంత పార్టీలోని వారే చెబుతున్నారు. 

విజయనగరం జిల్లాలో  కోలగట్లకు తనదైన రాజకీయం ఉంది, తనకంటూ ఓ బలమైన వర్గమూ ఉంది. ఆయన లాంటి వారు అనేకమంది వైసీపీలో ఇంకా అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. వీరందరికి పార్టీ నేత బొత్స పోకడలు అసలు నచ్చడంలేదంటున్నారు. మరి, పార్టీ కంటే తానే ఎక్కువగా భావిస్తున్న బొత్స విజయనగరం జిల్లాపై ఉడుం పట్టు  బిగించారు. రానున్న రోజులలో ఉత్తరాంధ్రలోనూ ఆయన హవా బలంగా చాటుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌ బొత్సకు ఇస్తున్న అధిక ప్రాధాన్యతను బొత్స తనకు అనుకూలంగా మార్చుకుంటూ మూడు జిల్లాలలోనూ తన అనుచర వర్గంతోనే నడిపించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో బొత్స వైఖరి మింగుడు పడని వారంతా వేరే దారులు వెతుకుతున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి రాజకీయంగా తీవ్ర నష్టాన్నే కలిగిస్తాయని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. 

చోద్యం చూస్తున్న  అధినాయకత్వం...

వైసీపీ ఆవిర్భవించి దాదాపుగా ఆరేళ్లు పూర్తి కావస్తోంది. ఈ మధ్యలో పలు ఉప ఎన్నికలలో పాటు, సార్వత్రిక ఎన్నికలలోనూ కదం తొక్కిన  అనుభవం ఆ పార్టీకి ఉంది. వైసీపీ ఏర్పాటైన  తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలు ఆ పార్టీ వైపుగా అడుగులు వేశాయి. ఉప ఎన్నికలలో సిక్కోలు నుంచి ధర్మాన కృష్ణదాస్‌ భారీ మెజారిటితో గెలిచినా, విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి గొల్ల బాబూరావు విజయం సాధించినా దాని వెనుక ఈ ప్రాంత ప్రజానీకం అమితమైన ఆదరణ ఉందన్నది వాస్తవం. అప్పటికి అధికార కాంగ్రెస్‌ విధానాలతో జనం విసిగి వేసారిపోవడం, అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ పాలనను కూడా చూసి ఉండడంతో కొత్తగా పుట్టుకొచ్చిన వైసీపీ వైపుగా ఈ మూడు జిల్లాలూ నిలిచాయి. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాలలో పార్టీని పటిష్టం చేసుకోలేకపోవడం, విభజన జరిగిన తరువాత తిరిగి టీడీపీకి ఊపిరి రావడంతో గత సార్వత్రిక ఎన్నికలలో మొత్తం 34 అసెంబ్లీకి తొమ్మిది మాత్రమే వైసీపీకి దక్కాయి. పరాజయం తరువాత కూడా వైసీపీ అధినాయకత్వం వైఖరిలో ఏ మాత్రం మార్పు కానరాకపోవడంతో పాటు, ఇప్పటికీ ఓ పార్టీగా క్షేత్ర స్ధాయిలో పటిష్టం చేసుకోకపోవడంతో ఈ జిల్లాలలో ఫ్యాన్‌ గాలి బలంగా వీచేందుకు తగిన వాతావరణం లేకుండా పోతోంది. 

ఎన్నికలు ముగిసిన తరువాత పీసీసీ మాజీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తన బంధు మిత్ర సపరివారంగా వైసీపీలో చేరడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. నిజానికి బొత్స వంటి బలమైన సామాజికవర్గం అండదండలున్న నేత వైసీపీలో చేరితే పార్టీ కచ్చితంగా పటిష్టం కావాలి, అలాగే, దూకుడుగా రాజకీయం చేస్తూ ఈపాటికి ఉత్తరాంధ్రలో వైసీపీ జెండా రెపరెపలాడాయి. కానీ, పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా  ఉన్నాయి. వైసీపీ ఏర్పాటుకావడంలో కీలకమైన పాత్ర పోషించిన వారంతా కాంగ్రెస్‌ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన నాయకులు కావడం, వారంతా అక్కడ బొత్స బాధితులు కావడం ఈ సందర్బంగా గమనార్హం. బొత్స వైసీపీలో చేరడాన్ని వారంతా జీర్ణించుకోలేకపోయినప్పటికీ అప్పట్లో ఉత్సాహంతో అధినాయకత్వం కండువా కప్పేసింది. దాంతో, నివురు కప్పిన నిప్పులా పార్టీలో అసంతృప్తి రగులుతూనే ఉంది. అది దావానలమై ఎగిసిన వేళ బొబ్బిలి రాజులు వైసీపీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. బొబ్బిలి రాజులకు విజయనగరం జిల్లాలో తగినంత ఆదరణ ఉండడమే కాకుండా, ప్రజలలో  క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. 

వైసీపీతోనే తమ రాజకీయ భవిష్యత్తును పెనవేసుకుని వచ్చిన వారికి బొత్స రావడం ఏ మాత్రం మింగుడుపడలేదు. ఈ విషయంలో అధినాయకత్వం ఎంతగా నచ్చచెప్పినా సరే బొబ్బిలి రాజులు పార్టీలో ఇమడలేకపోయారు. ఫలితంగా సమర్ధులైన నేతలను వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది.  అదే విధంగా కాంగ్రెస్‌లో ఓ మారు ఎమ్మెల్యేగా పనిచేసి ఆ పార్టీలో బొత్సకు ఎదురు నిలిచిన నాయకునిగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి సైతం ఇపుడు ఫ్యాన్‌ నీడన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజానికి బొబ్బిలి రాజులతో పాటే ఆయన కూడా టీడీపీలో చేరిపోవాల్సి ఉన్నా అధినాయకత్వం నచ్చచెప్పిన మీదట అయిష్టంగానే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో జగన్‌ నిర్వహించిన యువభేరీ కార్యక్రమంలో కోలగట్ల వర్గానికి తగినంత మర్యాద దక్కకపోవడం, జగన్‌ సభను బొత్స వర్గం పూర్తిగా హైజాక్‌ చేయడంతో అలిగిన వీరభద్రుడు ఏకంగా పార్టీ నుంచే బయటకు పోవాలనుకున్నారు. 

రెండు రోజుల పాటు నడచిన హై డ్రామా అనంతరం  వైసీపీలో కొనసాగుతానని ప్రకటించినా ఆయన అన్యమనస్కంగానే ఉంటున్నారన్నది అందరికీ తెలిసిన విషయం. ఆయన జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం అందులో భాగమే. అయితే, అధినాయకత్వం మాత్రం రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయనను నియమించి బుజ్జగించే ప్రయత్నం చేసింది. అదే సమయంలో బొత్స అనుచరుడైన మాజీ జిల్లా పరిషత్‌చైర్మన్‌ బెల్లాన చంద్రశేఖర్‌ను జిల్లా అధ్యక్షున్ని చేసింది. ఈ పరిణామాలతో కోలగట్ల వర్గం మరింతగా రగిలిపోతోంది. బెల్లాన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బలవంతంగా హాజరైన కోలగట్ల బొత్సతో తనకు విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. పార్టీ కోసం తాము వాటిని మరచి పనిచేస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా బొత్స వర్గం చేతిలోకి వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు వెళ్లడంతో మరెంతో కాలం కోలగట్ల అందులో కొనసాగలేరన్న మాట వినిపిస్తోంది. ఇక,  ఇదే వరుసలో విజయనగరం జిల్లాలో రాజకీయ కురు వృద్ధుడు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కూడా ఉన్నారు.  బొత్స సత్యనారాయణ సాంబశివరాజుకు ఒకనాటి రాజకీయ శిష్యుడు. ఆ తరువాత కాలంలో గురువు కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివి ఏకంగా ఆయననే దాటేసిపోయిన వైనం అందరికీ తెలిసిందే. ఈ గురుశిష్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

కేవలం బొత్స కారణంగానే కాంగ్రెస్‌ నుంచి దూరమై వైసీపీ నీడన చేరిన సాంబశివరాజు సైతం ఇపుడు పార్టీలో పెద్దగా పనిచేయడంలేదు. ఆయన రాజకీయంగా విశ్రాంతి దశలో ఉన్నా ఆయన కుమారుని కోసం ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో సాంబశివరాజు వర్గం ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నా బొత్స ఆధిపత్య వైఖరి మరింతగా శృతి మించితే టీడీపీ గూటికి చేరేందుకు కూడా వెనుకాడరన్న మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఓ మారు  కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుతో సాంబశివరాజు భేటీ కావడం జరిగింది కూడా.  జిల్లాలో సాంబశివరాజుకు కూడా రాజకీయంగా మంచి పట్టు ఉంది. విజయనగరం జిల్లాలో ఈ రకమైన పరిస్థితి ఉంటే పొరుగున ఉన్న శ్రీకాకుళంలోనూ బొత్సకు వ్యతిరేకంగా వైసీపీలో అసంతృప్తులు అనేకమంది కనిపిస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి బొత్స పెత్తందారీ పోకడలపై నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నాడు మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా బొత్స శ్రీకాకుళం జిల్లాలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. అది గిట్టని ధర్మాన ఆయనపై చేయాల్సిన పోరాటమంతా చేశారు.

ధర్మాన కాంగ్రెస్‌ నుంచి వైసీపీలో చేరడానికి బొత్స కూడా ఓ ప్రధాన కారణమని చెబుతారు. ఆ మధ్య ధర్మాన వైసీపీ అధినేత జగన్‌పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేసినా, పార్టీ పట్ల నిరాసక్తతగా ఉంటున్నా వీటన్నిటి వెనుక బొత్సపై ఉన్న వ్యతిరేకతే ఇలా చేయిస్తోందని అంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జగన్‌ పూర్తిగా బొత్స పైనే ఆధారపడడం,  ఈ మూడు జిల్లాల బాధ్యతలను బొత్సకు అప్పగించడం ధర్మాన వర్గానికి కంటగింపుగా ఉంటోంది. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో జగన్‌ గత నవంబర్‌లో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్‌ సభలోనూ బొత్స పూర్తిగా తన హవాను ప్రదర్శించారు. జగన్‌ సైతం బొత్సను వెంటబెట్టుకుని సభాస్ధలికి రావడం, తిరిగి ఆయనతోనే వెళ్లిపోవడంతో పార్టీలో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. విశాఖ జిల్లా విషయానికి వస్తే తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి వారు సైతం బొత్స ఆధిపత్యంలో పనిచేయలేమని వెనక్కు తగ్గుతున్నారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వంటి వారు కూడా బొత్సను చూసి వైసీపీ వైపు  రావడానికి ఇష్టపడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా మూడు జిల్లాలలోని తన అనుచరులతోనే వైసీపీని నింపేయాలనుకుంటున్న మాజీ పీసీసీ చీఫ్‌ వైఖరితో వైసీపీకి బలం ఎంత మేరకు సమకూరిందో తెలియదు కానీ, జరగాల్సిన నష్టం మాత్రం భారీగానే జరుగుతోంది.

ఎత్తులు వేస్తున్న పసుపు శిబిరం....

విభజన ఏపీలో ఏకైక ప్రతిపక్షంలో ఇలా సమన్వయలోపం, నాయకుల మధ్య వర్గ పోరును అధికార టీడీపీ చక్కగా వాడుకుంటోంది. వైసీపీని నిర్వీర్యం చేసేందుకు ఎప్పటికపుడు ఎత్తులు వేస్తున్న తెలుగుదేశం పార్టీకి అయాచిత వరంగా ఆ పార్టీ నేతలే కావల్సినంత సహకారం  అందిస్తున్నారు. పార్టీలో విభేదాలు బాహాటం కావడం, నేతలు ఎవరికి వారు బయటకు వచ్చి మీడియాకు ఎక్కడంతో అసంతృప్తి నేతలను దారికి తెచ్చుకునేందుకు టీడీపీ రాజకీయ తాయిలాలను ఎరగా చూపించి మరీ వచ్చిన వారిని వచ్చినట్లే సైకిలెక్కించేస్తోంది. ఇప్పటికి ఉత్తరాంధ్ర జిల్లాలలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు, పలువురు కీలక నేతలకు  కండువాలను కప్పిన టీడీపీ తాజాగా వెలుగు చూసిన కోలగట్ల వీరభద్రస్వామి ఎపిసోడ్‌తో మరింత జోరు పెంచింది. ఎమ్మెల్సీగా ఉన్న కోలగట్లను చేర్చుకోవడంతో పాటు, విజయనగరం జిల్లాలోని మరింతమంది వైసీపీ నేతలకు కూడా గురి పెడుతోంది. 

అధినాయకత్వానికి క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన లేకపోవడం, పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి గౌరవించకపోవడం వంటి కారణాల వల్ల కీలక నేతలు అయిష్టంగానైనా టీడీపీ దారి చూసుకుంటున్నారు. నిజానికి ప్రత్యర్ధి టీడీపీ పార్టీలో రాజకీయంగా చోటు లేకపోయినా, అధికార పార్టీకి జనంలో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా కూడా నేతలు సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధపడుతున్నారంటే వైసీపీలో వారికి ఎంతటి ఇమడలేని పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోంది. ఇటీవల  విశాఖపట్నం వచ్చిన  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అతి త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముగ్గురు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ అధినాయకత్వం సైకో పోకడలతో వేగలేకే ఆ పార్టీ నేతలు తమ వద్దకు వస్తున్నారంటూ సైటెర్లు వేశారు.  దీంతో, ఆ నేతలు ఎవరై ఉంటారన్న చర్చ వైసీపీలో మొదలైంది

అనుకూలత ఎంత ఉన్నా ఫలితం సున్నా...!

అధికార టీడీపీ విధానాలపై జనంలో వ్యతిరేకత నానాటికీ తీవ్రమవుతోంది. విభజన ఏపీలో రాజకీయ మార్పునకు ప్రయోగ శాలగా చెప్పుకునే ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈసరికే సైకిల్‌ గాలి బాగా తగ్గి ఉండాల్సింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక పర్యాయాలు ప్రతిపక్షాలకు చోటిచ్చి రాజకీయంగా తన ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఉత్తరాంధ్ర ఇపుడు విపక్షాన్ని అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. కానీ, ఆ అవకాశాన్ని వాడుకునేందుకు మాత్రం వైసీపీ తయారుగా లేదన్నది రాజకీయం తెలిసిన వారు అంటున్న మాట. 2016లో జగన్‌ ఉత్తరాంధ్ర జిల్లాలలో పలు మార్లు పర్యటించారు.

 ఆయనకు మూడు జిల్లాలలోనూ సమానమైన ఆదరణ లభించింది. ప్రతీ చోటా యువభేరీలను నిర్వహిస్తే జనం భారీ ఎత్తున హాజరై విజయవంతం చేశారు. విశాఖ కేంద్రంగా జై ఆంధ్రప్రదేశ్‌ సభను కూడా జయప్రదం చేశారు. వైఎస్‌ఆర్‌ అంటే అభిమానంతో పాటు, యువనేతగా జగన్‌ పట్ల కూడా ఉత్తరాంధ్ర ప్రజానీకంలో నమ్మకం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. నిజంగా ఈ పరిస్థితులను చూసినపుడు కచ్చితంగా వైసీపీ బలపడాల్సి ఉంటుంది, టీడీపీతో ఢీ అంటే ఢీ అనాల్సి ఉంటుంది. కానీ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగానే ఫ్యాన్‌ రెక్కలు తిరగలేకపోతున్నాయి.

జగన్‌ చేసే ప్రతీ పర్యటనకూ జనాభిమానాన్ని పెంచుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా పార్టీ నేతలు ఒకొక్కరుగా జారిపోవడం ఏ రకమైన సంకేతాన్ని ఇస్తోందన్నది పార్టీ నేతలే చెప్పాల్సి ఉంటుంది. యువభేరీలు మోగించడం ద్వారా అధికారం దక్కుతుందని భావిస్తున్న అధినాయకత్వం సొంత పార్టీని మరమ్మతు చేసుకోకపోతే పాత ఫలితాలే పునరావృత్తం అవుతాయన్న వాస్తవాన్ని  విస్మరిస్తోంది.   

- పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌, విశాఖపట్నం.

Show comments