తెలంగాణ ఫలితాలు.. రెడ్లదే హవా..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజేతల్లో కుల సమీకరణాలు ఇలా ఉన్నాయి. ప్రధాన పార్టీల తరఫున పోటీచేసిన వాళ్లలో ఏ కులం వారు ఎక్కువ మంది ఉన్నారో.. విజేతల్లో కూడా వారి ఆధిపత్యమే కొనసాగుతూ ఉంది. తెలంగాణ అసెంబ్లీకి అత్యధిక స్థాయిలో ఎన్నికయ్యారు రెడ్డి కులస్తులు.

గెలిచిన వారిలో ముప్పై తొమ్మిది మంది రెడ్లు ఉన్నారు. వీరిలో మెజారిటీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారే. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున దాదాపు నలభై మంది రెడ్లకు టికెట్లు లభించాయి. వారిలో ఓడిపోయిన వాళ్లు తక్కువే. కాంగ్రెస్ పార్టీ తరఫున హేమాహేమీ రెడ్లు ఓటమి పాలు కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీచేసిన రెడ్లు మాత్రం విజయం సాధించారు.

ఇక తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యా పరంగా రెండోస్థానాన్ని సంపాదించింది వెలమ కులం. వీరు పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వీరు కూడా తెరాస తరఫున అధికం. కాంగ్రెస్ తరఫున కూడా ఒకరిద్దరు ఎన్నికయినట్టున్నారు. మూన్నూరు కాపులు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.

కమ్మ ఎమ్మెల్యేలు ఐదుమంది ఎన్నికయ్యారు. రిజర్వర్డ్ సీట్లలో తొమ్మిది మంది మాదిగలు, తొమ్మిది మంది మాలలు ఎమ్మెల్యేలు అయ్యారు. ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తక్కువే. ఎంఐఎం తరఫున ఏడు మంది ముస్లిం ఎమ్మెల్యేలు పోనూ.. తెరాస తరఫున ఒక ముస్లిం ఎమ్మెల్యే నెగ్గాడు. ఓవరాల్ గా వీరి సంఖ్య ఎనిమిది మాత్రమే.

లంబాడాలు ఏడు మంది, ఆదివాసీలు ఐదు మంది ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో నెగ్గారు. గౌడ్ లు నలుగురు, యాదవులు ఐదు మంది గెలిచి నిలిచారు. బ్రహ్మణులు ఇద్దరు, వైశ్యులు ఒక్కరు, ఇతర కులస్తులు ఆరు మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 

Show comments