ముగ్గురూ ఏం సాధిద్దామని?

లై, జయ జానకీ నాయక, నేనే రాజు నేనే మంత్రి ఈ మూడు సినిమాలు మొత్తం మీద 11నే రావాలని ఫిక్స్ అయిపోయాయి. సుమారు 90కోట్ల మేర ఖర్చుతో నిర్మాణమైన సినిమాలు ఈ మూడూ కలిసి. వీటిలో జయ జానకీ నాయక, లై సినిమాలు రెండూ నలభై కోట్లకు పైగా బడ్జెట్ తో తయారైన సినిమాలు. నేనే రాజు నేనే మంత్రి డైరక్టర్, హీరో రెమ్యూనిరేషన్లు కాకుండా జస్ట్ 11కోట్లతో తీసిన సినిమా. 

ఇప్పుడు మూడు సినిమాలు బిగుసుకుపోయి, 11నే వస్తామని అంటున్నాయి. సూపర్ హిట్ అనిపించుకుని, రెండు వారాలకు ఫైగా థియేటర్లలో సోలోగా నిల్చుంటేనే ఫిదా లాంటి సినిమా 30కోట్ల షేర్ చూడగలిగింది. అంత పెద్ద టాక్, అంత పెద్ద హిట్ అనిపించుకున్న సినిమా. 

మరి మూడు సినిమాలు ఒకేసారి పడితే, పరిస్థితి ఏమిటి? ఎవరికి వారు, తమ సినిమా సూపర్ అనుకుంటున్నారు. మూడు భిన్నమైన జోనర్లు. జయజానకీ నాయక అన్నది పక్కా కమర్షియల్ సినిమా. బోయపాటి క్రేజ్, భారీ తనం, రకుల్ ప్రీత్ సింగ్ ఇవన్నీ కలిసి బి సి సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ ఇవ్వడానికి చాన్స్ వుంది. ఇక్కడ మిగిలిన సినిమాలు ఇబ్బంది పడే అవకాశం వుంది.

ఇక లై సినిమా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా. పక్కాగా మల్టీ ఫ్లెక్స్ ల్లో యూత్ ఛాయిస్ దానికే వుంటుంది. పైగా ఓవర్ సీస్ లో కూడా లై లాంటి సినిమాలకు ఆదరణ కచ్చితంగా వుంటుంది. పైగా ఆ స్టయిల్ ఆఫ్ మేకింగ్, నితిన్ గెటప్ అదీ కొత్తగా వుంది. ఇక్కడ జయ జానకీ నాయక కాస్త ఇబ్బంది పడే అవకాశం వుంది.

ఇక నేనే రాజు నేనే మంత్రి. పక్కా పొలిటికల్ డ్రామా. ఓ వడ్డీ వ్యాపారి జీవితం చరిత్ర. వడ్డీ వ్యాపారి రాజకీయాల్లోకి వచ్చి ఎలా ఎదిగాడు, అతని జీవితం చివరకు ఎక్కడకు చేరిందన్నది సినిమా. అంటే గతంలో వచ్చిన ప్రస్థానం టైపు సినిమా అనుకోవాలి. దీంట్లో ఇటీవల జరిగిన తమిళ రాజకీయ సంఘటనలు కూడా చొప్పించారు. మరి జనాలకు ఏ మేరకు ఆసక్తి వుంటుంది అన్నదాన్ని బట్టి ఆదరణ వుంటుంది. అయితే బడ్జెట్ రీత్యా మిగిలిన రెండింటి కన్నా ఇది సేఫ్ ప్రాజెక్టు. ఈ సినిమాకు దర్శకుడిగా తేజ పేరు కన్నా, హీరో గా రానా క్రేజ్ నే ప్లస్ పాయింట్. 

ఇలా మూడు సినిమాలకు ప్లస్ లు, మైనస్ లు సమానంగానే వున్నాయి. అలాంటపుడు మూడు, మూడు వారాలు వచ్చి వుంటే, సేఫ్ గా వుండేవి. కానీ మూడూ కూడా ఒకేసారి వస్తున్నాయి. పైగా ఆ తరువాతి వారం సునీల్ ఉంగరాల రాంబాబు వస్తోంది. సినిమా బాగుంటే ఫ్యామిలీలకు పట్టే జోనర్ అది. పైగా ఆ పై వారం వివేగం, అర్జున్ రెడ్డి, యుద్దం శరణం సినిమాలు వున్నాయి. ఈ మూడూ కూడా కాస్త బజ్ వున్న సినిమాలే. 

అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వారాల్లో ఈ మూడు సినిమాలు థియేటర్లు చాలా వరకు ఖాళీ చేయాలి. సరిపడా థియేటర్లు లేక, రెండు వారాల మించి టైమ్ లేక, జయ జానకీ నాయక కనీసం 50 కోట్లు ఇరు రాష్ట్రాల్లోనూ, లై సినిమా నలభై కోట్లు రెండు రాష్ట్రాల్లోనూ వసూళ్లు సాగించాలి. నేనే రాజు నేనే మంత్రి మాత్రం డైరక్ట్ విడుదల కాబట్టి, ఆల్రెడీ పెట్టుబడి వెనక్కు తెచ్చేసుకుంది కాబట్టి, పెద్దగా టెన్షన్ లేదు. చూడాలి జనం ఏమని తీర్పు ఇస్తారో?

నిన్నటి వరకు నేనే రాజు నేనే మంత్రి 18కి వెళ్తుందన్న టాక్ వినిపించింది. కానీ ఆఖరికి 11 కే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్ గా జయ జనాకీ నాయక 10 కే వస్తుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి ఏం డిసైడ్ అవుతుందో?

Show comments