ఆర్టీసీ సమ్మెకు జనాలకు పట్టిందా?

ఒక్కోసారి నిజాలు చేదుగా వుంటాయి. సమ్మె అనేది ఏ ఉద్యోగికి అయినా అనివార్యమైన పరిస్థితి. కావాలని ఎవ్వరూ సమ్మెకు దిగరు. పరిస్థితులు అలా తోసుకువస్తాయి. గత కొంత కాలంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె కూడా అలాంటిదే. వివిధ సమస్యలపై ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దానికి వివిధ పక్షాలు మద్దతు పలికాయి. సమ్మె ఉధృతంగా సాగుతోంది. కోర్టులు కలుగచేసుకున్నాయి. డిస్కషన్లు సాగుతున్నాయి.

ఇవన్నీ ఇలావుంచితే ప్రజాజీవనం మీద ఆర్టీసీ సమ్మె ఏ మేరకు ప్రభావం చూపించింది అన్నది చూస్తే, హైదరాబాద్ జంట నగరాల వరకు కొంత మేరకే ప్రభావం చూపించగలిగింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్ పాస్ హోల్టర్ల విషయంలోనే. ఎందుకంటే జంటనగరాల్లో ఏదో విధమైన స్వంత ట్రాన్స్ పోర్టేషన్ వున్నవారే 90శాతానికి పైగా. దీనికితోడు మెట్రో, ఏస్ వ్యాన్ లు, షేర్ ఆటోలు, సెట్విన్ బస్ లు, ఓలా, ఉబర్. అందువల్ల సిటీ పరిథిలో ప్రభావం తక్కువ.

కానీ రూట్ బస్ లు అంటే వివిధ పట్టణాలు, పల్లెలకు వెళ్లే రవాణా మాత్రం కాస్త గట్టిగా దెబ్బతింది. అక్కడ మాత్రం ప్రభావం కాస్త క్లియర్ గా కనిపిస్తోంది. ఈ విషయం అలావుంచితే నిత్యం వివిధ మాధ్యమాల్లో ఇంత హడావుడి జరుగుతోంది ఆర్టీసీ సమ్మె గురించి. దీని గురించి కానీ, సమ్మెలో వున్న ఆర్టీసీ కార్మికుల గురించి కానీ, వారికి జీతాలు అందని పరిస్థితి గురించి కానీ, కామన్ మాన్ కు పట్టిందా? అంటే  అనుమానమే.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు సమ్మె చేసినా, మిగిలిన వారికి పట్టదు. ఆర్టీసీ వ్యవహారం మీద సాధారణ ప్రజల్లో కాస్త కినుక వున్నమాట వాస్తవం. సిటీ పరిథిలో ఆర్టీసీ బస్ లు రఫ్ గా నడపడం, ఆర్టీసీ బస్ ల రఫ్ డ్రయివింగ్ కారణంగా చాలామంది మృత్యువాత పడడం, రద్దీ సమయాల్లో కూడా ఆర్టీసీ బస్ ల డ్రయివింగ్ చాలా ప్రమాధకరంగా వుండడం వంటి కారణాల వల్ల సాధారణ జనాలకు చాలావరకు వాళ్ల మీద అంత సాఫ్ట్ కార్నర్ లేదు. ఇది కాదనలేని వాస్తవం.

వాస్తవానికి ఆర్టీసీ కార్మికుల్లో కూడా సాదా సీదా జనాలు వున్నారు. మంచి సిబ్బంది వున్నారు. కానీ కొందరి వల్ల మిగిలినవారు జనం సానుభూతికి దూరం అవుతున్నారు. నిజానికి సమ్మెకాలంలో కొందరు ఆత్మహత్య చేసుకోవడం, కొందరు గుండెపోటుకు గురికావడం అంటే అంత చిన్న విషయం కాదు. చాలా సానుభూతి పెల్లుబుకాల్సిన విషయం. కానీ మరి సిటీ జనాల గజి బిజీ బతుకులో, పక్కవాడికి ఏమయితే నాకేం అన్న ధోరణి పెరగడమో, లేదా ఆర్టీసీ జనాల మీద సింపతీ కరువు కావడమో, మొత్తానికి రగులుకోవాల్సినంత ఉద్యమ స్ఫూర్తి రగులుకున్నట్లు కనిపించడం అయితేలేదు. 

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే

Show comments