మళ్లీ అదేమాట: బాబును వెనకేసుకొచ్చిన రేవంత్

చంద్రబాబు రాకతోనే కూటమి సర్వనాశనం అయింది. ఫలితాలు వెలువడుతున్న మరుక్షణం నుంచి వినిపిస్తున్న మాట ఇదే. తాను మునిగి, కూటమిని నిండా ముంచాడంటూ చంద్రబాబుపై ఇప్పటికే విమర్శలు ప్రారంభమయ్యాయి. టీడీపీ-కాంగ్రెస్ అక్రమ సంబంధాన్ని ప్రజలు తిప్పికొట్టారంటూ వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

కానీ అదేపార్టీలో ఉంటూ, టీడీపీకి కొమ్ముకాస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన రేవంత్, కూటమి ఓటమికి చంద్రబాబుని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేయడం సరికాదంటున్నాడు. అలా అని ఓటమికి కారణాలేంటనేది గట్టిగా చెప్పడంలేదు.

"ఫలితాలపై చంద్రబాబునే బాధ్యుడ్ని చేయడం సరికాదు. పార్టీ నాయకులతో కూర్చొని ఫలితాలపై పూర్తిస్థాయి విశ్లేషణ చేస్తాం. ఎన్నికల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా, టీఆర్ఎస్ ఏమైనా గోల్ మాల్ చేసిందా అనేది చర్చిస్తాం."

కూటమి ఓటమిపై రేవంత్ రియాక్షన్ ఇది. ఫలితాలు చూస్తే రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందన్న రేవంత్.... రిజల్ట్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య ఉంటుందని, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందని ఓ కామన్ డైలాగ్ పడేశారు.

"నేను క్షేత్రస్థాయిలో ఉంటాను. ప్రజలతో మరింత మమేకమైపోతాను. ప్రజా సమస్యల్ని ఎత్తిచూపుతాను. ఓడిపోతే కుంగిపోవడం మా పార్టీ రక్తంలో లేదు. గెలుపోటములు ఒకేలా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తాం. ఏదేమైనా కేసీఆర్ ఈ గెలుపును రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇచ్చిన లైసెన్స్ గా భావించకూడదు. కుటుంబ పెత్తనానికి, ఆధిపత్యానికి పట్టంకట్టినట్టు భావించొద్దు."

రెండోసారి అధికారంలోకి రాబోతున్న కేసీఆర్, ఇప్పటికైనా అమరవీరుల త్యాగాన్ని గుర్తించాలని, ఉద్యమకారులపై కేసులు ఎత్తేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండాసురేఖ, జానారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి లాంటి నేతలంతా ఓటమి పాలయ్యారు.

Show comments