పోటీకీ, పార్టీకీ విజయమ్మ దూరమే.!

ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ రంగప్రవేశం చేసిన వైఎస్‌ విజయలక్ష్మి గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. అడపాదడపా జగన్‌తో కలిసి జగన్‌ కోసం మీడియా ముందుకు వస్తున్నారామె. పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.

వైఎస్‌ మరణానంతరం శాసనసభకు పులివెందుల నుంచి ఎంపికైన విజయమ్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ తరఫున పార్టీ వాయిస్‌ని బలంగా విన్పించారు. అయితే, 2014 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయాక, రాజకీయాల్లో కొనసాగడంపై ఆమె ఆశక్తి చూపడంలేదు.

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయలక్ష్మి పోటీచేస్తారనీ, రాజకీయంగా యాక్టివ్‌ అవుతారనీ నిన్న మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయబోనని విజయలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కూడా చేయకపోవచ్చనీ ఆమె చూచాయగా సెలవిచ్చారు. జగన్‌ కోరితే మాత్రం ఆప్పుడు ఆలోచిస్తానని చెప్పారు విజయమ్మ.

వైఎస్‌ విజయమ్మ మాత్రమే కాదు, జగన్‌ సోదరి షర్మిల కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించడం లేదు. పార్టీలోనూ ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు. గతంలో ఆమె వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పాదయాత్ర నిర్వహించిన విషయం విదితమే.

దేశ రాజకీయాల్లోనే అప్పుడు అదొక సంచలనం. అప్పటికీ ఇప్పటికీ ఓ మహిళానేత అంత సుదీర్ఘ పాదయాత్ర చేయడం అనే రికార్డ్‌ షర్మిల పేరునే వుంది. కాగా, అనివార్య పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్ని రాజకీయాలకు పరిచయం చేసిన వైఎస్‌ జగన్‌ ఇకపై వారిని రాజకీయాల్లో ఉంచాలనుకోవడం లేదనీ, కుటుంబ సభ్యులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులూ ఉండకూడదనే ఇలాంటి నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

ఇదిలావుంటే, వైఎస్‌ విజయమ్మ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయితే అది నామమాత్రపు పదవి మాత్రమే. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుండాలనీ, ఎన్నికలకే కాదు.. ప్రచారానికీ దూరంగా వుండాలనీ నిర్ణయం తీసుకున్న విజయమ్మ విషయంలో జగన్‌తో అందరూ ఏకీభవించొచ్చుగాక.

కానీ షర్మిల విషయంలో మాత్రం జగన్‌పై కొంత ఒత్తిడి కనిపిస్తోంది. షర్మిల పోటీచేస్తే అదనపు అడ్వాంటేజ్‌ అవుతుందని, ప్రచారం కోసం ఆమెను వినియోగించాలనీ పార్టీ ముఖ్యనేతలు తమ అధినేతపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. 

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

Show comments