చంద్ర‌బాబుకు ఈ సారి ఆ అవ‌స‌రం రాలేదు!

పొత్తుల పేర్ల‌తో ఏదో ఒక పార్టీతో క‌లిసి పోటీ చేయ‌డం, ఆ త‌ర్వాత ఆ పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌లో కూడా తెలుగుదేశం బీఫారం ఇవ్వ‌డం.. ఇది తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఉన్న ట్రాక్ రికార్డే! బీజేపీని అయితే చంద్ర‌బాబు నాయుడు ఇలా ఆటాడుకున్నారు. అంత‌కు ముందు టీఆర్ఎస్ తో పొత్త‌ప్పుడు కూడా ఇలాంటి చేష్ట‌లే చంద్ర‌బాబు చేశారు! అయితే.. ఈ సారి బీజేపీ, జ‌న‌సేన‌ల పోటీకి కేటాయించిన సీట్ల‌లో ఎక్క‌డా తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థులు పోటీ చేసే సీన్ అయితే లేదు! ఎవ‌రో చోటామోటాలు ఉత్తుత్తి నామినేష‌న్లు వేశారేమో కానీ, తెలుగుదేశం మిత్ర‌ప‌క్షాల‌కు ఇచ్చిన సీట్ల‌లో తెలుగుదేశం రెబ‌ల్స్ అయితే గ‌ట్టివారెవ‌రూ క‌నిపించ‌డం లేదు. దీంతో అలాంటి వారికి చంద్ర‌బాబు బీఫారం ఇచ్చే సీన్ కూడా లేన‌ట్టే!

అయితే.. జ‌న‌సేన‌, బీజేపీల త‌ర‌ఫున మాత్రం మొత్తంగా చంద్ర‌దండే బ‌రిలోకి దిగింది. జ‌న‌సేన పోటీకి అంటూ 21 సీట్ల‌ను కేటాయించినా.. దాదాపు ప‌ది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్లే పోటీలో ఉన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ త‌ర‌ఫున ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్ చార్జిలుగా వ్య‌వ‌హ‌రించిన వారు, జ‌న‌సేన‌కు ఆ సీట్ల‌లో పోటీ చేస్తుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారు ప‌ది మంది వ‌ర‌కూ ఉన్నారు!

పేరుకు జ‌న‌సేన 21 స్థానాల్లో పోటీలో ఉన్నా.. ప‌దిమంది తెలుగుదేశం వాళ్లే ఆ పార్టీ అభ్య‌ర్థులు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కూడా మ‌రో మార్గం కూడా లేక‌పోవ‌డం, చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగా న‌డుచుకోవ‌డం త‌ప్ప ప‌వ‌న్ కు ఇంకో అజెండా లేక‌పోవ‌డం కూడా ఈ ప‌రిస్థితికి కార‌ణం. ఎలాగూ జ‌న‌సేన త‌ర‌ఫున స‌గం స్థానాల్లో పోటీ ఉన్న‌దే తెలుగుదేశం వారు కావ‌డంతో, ఇక ప్ర‌త్యేకంగా వెన్నుపోట్లు పొడ‌వాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుకు లేకుండా పోయింది.

ఇక బీజేపీ త‌ర‌ఫున పోటీలో ఉన్న వారి సంగ‌తి స‌రేస‌రి! అన‌ప‌ర్తి వ్య‌వ‌హారం ఒక్క‌టి చాలు ఈ పొత్తు క‌థ‌లో కామెడీ అర్థం కావ‌డానికి. బీజేపీ పోటీకి ఆ సీటును కేటాయించ‌డంతో రెబ‌ల్ గా బ‌రిలోకి దిగుతానంటూ హ‌డావుడి చేసిన తెలుగుదేశం అభ్య‌ర్థిని రాత్రికి రాత్రి బీజేపీలోకి చేర్చి.. ఆ పార్టీ త‌ర‌ఫున నామినేష‌న్ వేయించారు! బీజేపీకి కేటాయించిన సీట్ల‌లో అయితే చంద్ర‌బాబుకు అత్యంత ఆప్తులే బ‌రిలో ఉన్నారు! బీజేపీ అభ్య‌ర్థుల్లో కూడా తెలుగుదేశం మూలాలు, చంద్ర‌బాబు అతి స‌న్నిహితులే ఉన్నారు.

ఇలా జ‌న‌సేన‌, బీజేపీల పోటీకి వ‌దిలిన ముప్పై ఒక్క అసెంబ్లీ సీట్లు, ఎనిమిది లోక్ స‌భ సీట్ల‌లో స‌గం పైగా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల్సిన వారే పోటీ చేసిన నేప‌థ్యంలో..  ఇక ప్ర‌త్యేకంగా పోటేయాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుకు ఈ సారి త‌ప్పిన‌ట్టుగా ఉంది!

Show comments