త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లోనే కాదు.. స్టేజీల మీద కూడా డైలాగులు బాగా పేలుస్తాడు అని వేరే చెప్పనక్కర్లేదు. ఈమాటల మాంత్రికుడు పవన్ కల్యాణ్ గురించి తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ సైట్లలో మార్మోగుతోంది! ''అ..ఆ'' సినిమా సక్సెస్ మీట్‌లో త్రివిక్రమ్ పవన్ గురించి గురించి ఒక మాట చెప్పాడు. అసలు ''అ..ఆ'' సినిమా వేడుకలో పవన్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? అంటే.. అది వస్తుందంతే! నితిన్, త్రివిక్రమ్ లాంటి పవన్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. పవన్ నామస్మరణ జరుగుతూ ఉంటుంది!
మ్యాటరేమిటంటే.. ''సన్నాఫ్ సత్యమూర్తి'' తర్వాత ఎవరితో సినిమా చేయాలో సంధిగ్ధవస్థతో తనుండగా.. తన ధర్మం ఏమిటో పవన్ గుర్తు చేశాడని త్రివిక్రమ్ చెప్పాడు. ''ఇంతకుముందు నితిన్ తోసినిమా చేస్తానన్నారుగా.. తనతో సినిమా చేయడం ధర్మం'' అని పవన్ తనతో చెప్పాడని త్రివిక్రమ్ చెప్పాడు. ఇక్కడ ''ధర్మం'' అనే బరువైన పదం పడే సరికి.. ఇది ఆసక్తికరంగా మారింది.
త్రివిక్రమ్‌కు గీతాసారం భోదించినట్టుగా.. పవన్ కల్యాణ్ ధర్మాధర్మాల గురించి వివరించినట్టున్నాడు. మరి త్రివిక్రమ్ అంతకు ముందు చేసిన ప్రకటనకు అనుగుణంగా పవన్ ధర్మాన్ని బాగానే గుర్తు చేశాడు కానీ.. పవన్ కొన్నిసార్లు తన ధర్మాన్ని ఎందుకు నెరవేర్చలేదు అనేది కొంతమంది ప్రశ్న! పవన్‌తో సినిమా అంటూ వార్తల్లో నలిగిన అనేక మంది చివరకు దాన్ని చేయలేకపోయారు.
దర్శకుడు సంపత్ నంది.. కొన్ని నెలల పాటు పవన్ కోసం వేచి ఉన్నాడు గతంలో. 'బెంగాల్ టైగర్' ప్రారంభానికి ముందు.. పవన్ కోసం కొన్ని నెలల పాటు వేచి చూశాడు ఆ దర్శకుడు. ఆఖరికి తన అసిస్టెంట్లు జీతాలు ఇవ్వలేని దశకు వచ్చి.. తన ఆఫీసును మెయింటెయిన్ చేయలేని దశకు వచ్చే వరకూ కూడా సంపత్‌ను పవన్‌ను హోల్డ్‌లోనే పెట్టాడు. పవన్ మాట మేరకు ''గబ్బర్ సింగ్-2'' కోసం అని కొన్ని నెలలు 'చోటా మేస్త్రీ'' కోసం అని మరికొన్ని నెలలు వేచి చూసిన సంపత్ నంది.. తన దారి తాను చూసుకోవాల్సి వచ్చింది!
చివరకు గబ్బర్ సింగ్ -2 రానే వచ్చింది.. ఇక ఆ సినిమా దర్శకుడు బాబీ ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు! మరి త్రివిక్రమ్ నిర్వర్తించాల్సిన ధర్మాన్ని పవన్ బాగా గుర్తు చేశాడు కానీ.. కనీసం సినిమాల వరకూ అయినా తన ధర్మం విషయంలోనే పవన్‌కు తత్వం బోధపడినట్టుగా లేదు!