పవన్ : పోటీలేదు.. ప్రెస్ నోట్ మాత్రమే...!

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి.. హీరో పవన్ కల్యాణ్ ఏం డిసైడ్ చేశారు. ఏ విషయం గురించి అయినా సరే.. గడియకో రకంగా మాట్లాడుతూ ఉండే పవన్ కల్యాణ్.. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయడం గురించి కూడా ఇప్పటికే అనేక రకాలుగా మాటలు మార్చారు. తాజాగా ‘‘2019లో అయితే 23 అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలకు పోటీచేసి ఉండేవాళ్లం’’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏతావతా తాజా మాటలను బట్టి తెలుస్తున్నదేంటంటే.. ఆయన తెలంగాణలో ప్రస్తుతానికి పోటీచేయబోయేది ఉండదు. కేవలం కొందరు అభ్యర్థులకు అనుకూలంగా ప్రెస్ నోట్ మాత్రం విడుదల చేయవచ్చు.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఏర్పడిన తొలినాళ్లలోనే.. పవన్ కూడా రంగంలోకి దిగుతారనే అభిప్రాయం ప్రజలకు ఏర్పడింది. అప్పటికే జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లుగా సీపీఎం చాలా బలంగా ప్రకటించింది. దానికి తగ్గట్లుగా అప్పుడే ఆయన ఏపీలో యాత్రకు విరామం ఇచ్చి హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నారు. సీపీఎం నాయకులు పలు ప్రకటనలతో పాటూ జనసేన కీలక నాయకులతో భేటీకావడం కూడా జరిగింది. అయినా పవన్ కల్యాణ్ వారికి ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆ ఎపిసోడ్ ముగించారు.

అయితే తర్వాత ఆయనకు సొంత పార్టీలోని తెలంగాణ నేతలనుంచి బాగా ఒత్తిడి ఎదురైంది. కొన్ని స్థానాల్లో అయినా పార్టీ తరఫున బరిలోకి దిగాలని వారు ఆయనను కోరారు. గతనెల 16వ తేదీన తెలంగాణలో పోటీగురించి నిర్ణయం తీసుకోవడానికి పార్టీ కేడర్ తో ఓ సమావేశం పెట్టుకున్నారు. కొందరినైనా ఆయన పోటీచేయిస్తారని వారు ఆశించారు. అయితే ఆ సమావేశమే జరగలేదు. తిత్లీ తుపాను ఆయనకు కలిసి వచ్చింది. అక్కడి యాత్రల పేరుతో.. తెలంగాణ పార్టీని పక్కన పెట్టేశారు.

ఎన్నికల్లో పోటీచేయాల్సిందేనని ఇప్పటికీ పార్టీ వారు కొందరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారిని స్వతంత్రులుగా పోటీచేయమని చెబుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తనమద్దతు వారికి ఉన్నదని పవన్ కల్యాణ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయవచ్చు. అక్కడితో ఆయన వారిని గాలికి వదిలేసే అవకాశమే ఎక్కువ. స్వయంగా వచ్చి ప్రచారం చేసేంత సీన్ లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. తన దృష్టి ఏపీ రాజకీయాల మీద మాత్రమే ప్రస్తుతానికి ఉన్నదని పవన్ కల్యాణ్ అంటున్నారు.

కాకపోతే కొన్ని కులసంఘాల అభ్యర్థులు మద్దతు కోరుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో పవన్ కల్యాణ్ తనకు ఏపీ రాజకీయాల్లో ఉపయోగపడగల కుల సంఘాల వారికి మద్దతు ప్రకటిస్తూ ప్రెస్ నోట్ మాత్రం విడుదల చేస్తారని, స్వయంగా తమ పార్టీ తరఫున పోటీచేయడం గానీ, ప్రచారానికి వెళ్లడం గానీ ఉండదని అంచనాలు సాగుతున్నాయి.

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments