వెంకీ, పవన్.. మీరింతేనా..?

అయితే వెంకటేష్ కాకపోతే పవన్ కల్యాణ్.. వీళ్లింతే, రీమేక్ లతోనే కెరీర్ ను సాగిస్తూ, వాటినే ఊపరి పీల్చుకొంటూ సాగిపోయేలా ఉన్నారు. అదేమంటే, రీమేక్ లు చేయడం తప్పా? అని వీరాభిమానుల ప్రశ్న. చేయడం తప్పు కాదు.. కానీ మరేవీ చేయకుండా వాటినే చేస్తూ ఉండటమే విడ్డూరం. విసుగు ను తెప్పించే వ్యవహారం. ఒకవైపు సినిమాల్లోనేమో ట్రెండ్ ను సెట్ చేస్తామని చెప్పుకొంటూ.. మళ్లీ ట్రెండ్ను  ఫాలో అయిపోవడం ఏమిటో మరి.

‘జాలీ ఎల్ఎల్ బీ -2’ సినిమా రీమేక్ ప్రతిపాదనలో రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి విక్టరీ వెంకటేష్, రెండు పవన్ కల్యాణ్. మొదట వెంకీ ఈ సినిమాను చేయనున్నాడనే వార్తలు రాగా, అబ్బే పవన్ కల్యాణ్ అనే మాట వినిపిస్తోంది. ఈ హీరోల భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నీ రీమేక్ లతోనే సాగుతున్నాయి. మొన్ననే ‘కాటమరాయుడు’ అనే రీమేక్ తో పవన్, ‘గురు’ అనే రీమేక్ తో వెంకీ పలకరించారు. ఇక పవన్ చేతిలో ఇప్పటకే ఒక తమిళ రీమేక్ ఉంది. 

ఇంతలోనే మళ్లీ.. ‘జాలీ ఎల్ఎల్ బీ -2 ’ రీమేక్. పవన్ చేసినా, వెంకటేష్ చేసినా.. వీళ్లకు ఈ రీమేక్ ల పిచ్చేమిటో అనుకోవాల్సి వస్తోంది. ఆ రీమేక్ లతోనైనా సత్తా చాటుతున్నారా అంటే అదీ లేదాయె. వెంకీ రీమేక్ లకు ప్రశంసలు వస్తున్నాయి కానీ, కాసులు రావడం లేదు. పవన్ కు కూడా కాటమరాయుడు రీమేక్ ఒక పరాజయాన్ని మిగిల్చింది. అయినా.. మళ్లీ ఇంకో రీమేక్ అంటున్నారు.

ఇది వరకూ ‘జాలీ ఎల్ఎల్ బీ’ హిందీలో సూపర్ హిట్ కాగా.. ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. అందులో ఉదయనిధి స్టాలిన్ నటించాడు. అలాంటి హీరో లు ఇలాంటి సినిమాలు చేస్తే అదో ముచ్చట. అంతే కానీ.. ట్రెండ్ ను సెట్ చేస్తామనే వాళ్ల భావ దారిద్ర్యం ఏమిటో! Readmore!

Show comments