'ఒక్కసారే' జరిగితే కొత్త చరిత్ర...!

ఏ వ్యవస్థలోనైనా కాలనుగుణంగా మార్పులు జరుగుతుంటాయి. కొత్త తరాలు కొత్త ఆలోచనలు చేస్తాయి. 'ఇదెలా సాధ్యం?' అనుకున్నవి కూడా జరిగిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో అనేకమున్నాయి. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మన ఇరుగు పొరుగు దేశాల్లో అనేకసార్లు ప్రజాస్వామ్యం చావుదెబ్బ తిని సైనిక నియంతృత్వం రాజ్యమేలింది. కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యమే లేదు. ఎన్నికలూ లేవు. కాని మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికలు మొదలుకొని పంచాయతీ ఎన్నికల వరకూ జరుగుతూనే ఉన్నాయి. 

గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉప ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో రిగ్గింగు, గొడవలు జరుగుతున్నా, ధనం ప్రవాహం విపరీతంగా ఉన్నా, డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్నా ప్రజాస్వామ్యం మాత్రం ఇప్పటికీ పదిలంగా ఉంది. ఈ లక్షణాన్నే ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిపోతున్న మాట వాస్తవమే. వ్యవస్థలో అనేక లోపాలున్నాయి. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థతో విసిగిపోయిన కొందరు నాయకులు, మేధావులు మనకు అధ్యక్ష తరహా పాలన కావాలంటున్నారు. అమెరికాలో మాదిరిగా అధ్యక్షుడిని నేరుగా ప్రజలే ఎన్నుకోవాలంటున్నారు. 

ఎన్నికల విధానంలోనూ అనేక మార్పులు రావాలంటున్నారు. ప్రజాప్రతినిధులను 'రీకాల్‌' చేసే అవకాశం ఉండాలంటున్నారు. మన ఎన్నికల విధానంలో వచ్చిన అతి పెద్ద మార్పు బ్యాలెట్‌ పత్రాల స్థానంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ప్రవేశపెట్టడం. ఈ యంత్రాల్లో 'నోటా' ఆప్షన్‌ ప్రవేశపెట్టడంతో ఏ పార్టీకీ లేదా అభ్యర్థికి ఓటు వేయకుండా ఉండే అవకాశం వచ్చింది. ఈ యంత్రాల్లోనూ అవకతవకలు జరగున్నాయనే ఆరోపణలు వస్తుండటంతో ఓటరు ఏ పార్టీకి లేదా అభ్యర్థికి ఓటు వేశాడో తెలుసుకునేలా ఏటీఎం రసీదులా వచ్చే ఏర్పాటూ చేశారు. ఇలా అనేక రకాల మార్పులను అంగీకరిస్తూ వస్తున్నాం. 

మన దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో తెలిసిన విషయమే.  పార్లమెంటు గడువు అయిపోగానే దానికి, రాష్ట్రాల అసెంబ్లీల గడువు అయిపోగానే వాటికీ జరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ఏర్పడితే పార్లమెంటుకుగాని, అసెంబ్లీలకుగాని మధ్యంతర ఎన్నికలూ జరగొచ్చు. అంటే ఏడాది పొడుగునా ఎక్కడో ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇవిగాక ఉప ఎన్నికలు అదనం. ఇదంతా చికాకుగా ఉందనే అభిప్రాయం కలుగుతోంది. అందుకే దేశ వ్యాప్తంగా ఒక్కసారే (పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి) ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. 

ఒక్కసారే ఎన్నికల నిర్వహణ కారణంగా ఖర్చు కలిసివస్తుందని, ఐదేళ్ల వరకూ దేశంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించే బెడద ఉండదని, ఇతరత్రా ప్రయోజనాలున్నాయని కొందరు రాజకీయ నాయకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సివుంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చుగాని అసాధ్యం కాదని చెప్పొచ్చు. తాజాగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీమ్‌ జైదీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమేనని ప్రకటించి ప్రభుత్వాలని, పార్టీలను ఆలోచనలో పడేశారు.  ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సి ఉంటుంది. 

పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ కేంద్ర న్యాయ శాఖకు, ఈ అంశాన్ని పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీకి  సిఫార్సు చేసినట్లు జైదీ చెప్పారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం చాలా పెద్ద, విస్తృతమైన ప్రక్రియ కాబట్టి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సివుంటుంది. భారీగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు అవసరమవుతాయి. ఎన్నికల నిర్వహణ సిబ్బంది కూడా చాలా ఎక్కువమంది అవసరమవుతారు. ఇందుకోసం తాత్కాలిక ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోవల్సి ఉంటుంది. ఒకేసారి ఎన్నికలపై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ, పార్టీల మధ్య సంప్రదింపులు జరగాలి. ఏకాభిప్రాయం కుదరాలి. ఎన్నికల కమిషన్‌ ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పార్టీలు, ప్రభుత్వాలు చర్చలు జరపడమే మంచిది. 

Show comments