ఎవర్రా బాబూ వీళ్లంతా..?

సినిమా లెక్కల గురించి తెలియకుండానే ఎవడు పడితే వాడు మాట్లాడేయడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. ఫస్ట్ డే ఇంత వచ్చింది, తరువాతి రోజు ఇంతవచ్చింది..టోటల్ గా ఇంత, ఫైనల్ గా అంత అంటూ. నిజానికి ఈ కలెక్షన్లలో సవాలక్ష మతలబులు వుంటాయని కానీ, వాటి లెక్కలు వేరు అని కానీ, సాధారణంగా అవి అంత సులువుగా అంతు పట్టవని కానీ తెలియదు చాలా మందికి. జనతా గ్యారేజ్ కు తొలి రోజు 20.49 కోట్లు వస్తే రెండోరోజు అయిదు కోట్ల చిల్లరే వచ్చిందని, కలెక్షన్లు పావు శాతానికి పడిపోయాయని కూడా అనేంత, రాసేంత అజ్ఞానం కనిపిస్తోంది.

మన తెలుగు సినిమా లెక్కలు వేరేగా వుంటాయి. సినిమా విడుదలకు ముందుగానే ప్రతి డిస్ట్రిబ్యూటర్ వారి పరిథిలోని థియేటర్ల నుంచి అడ్వాన్స్ లు వసూలు చేస్తారు. పెద్ద సినిమాలు తమ థియేటర్ లో పడాలని చాలా మంది కోరుకుంటారు. అందుకని వన్ వీక్ కలెక్షన్లు ఏ రేంజ్ లో వుండొచ్చో, వారి వారి థియేటర్ల సీటింగ్ కెపాసిటీని బట్టి అంచానా వేసి, అందులో ఫిఫ్టీ పర్సంటో, మరెంతో డిస్ట్రిబ్యూటర్ కు అడ్వాన్స్ గా ఇస్తారు. ఇలా వచ్చిన మొత్తాలకు తను కొంత జోడించి నిర్మాతకు ఇస్తాడు బయ్యరు.

సినిమా విడుదలయిన తరవాత తొలి రోజు కలెక్షన్లకు ఈ అడ్వాన్స్ మొత్తాలను కలిపి చూపిస్తారు. అంతే కానీ తొలి రోజు మొత్తం ప్రేక్షకుల నుంచి వచ్చిన మొత్తం కాదది. జనతా గ్యారేజ్ సినిమాకు తొలి రోజు 20 కోట్లు వచ్చిందని చెబితే అన్నీ అదే రోజు కలెక్షన్లు అని కావు. అయిదు నుంచి ఏడు కోట్ల మధ్క్ష కలెక్షన్లు మిగిలినవి అడ్వాన్స్ లు లేదా హైర్లు కలిసి వుంటాయి అన్నమాట. మర్నాడు అయిదు కోట్ల చిల్లర వచ్చింది అంటే ఓ పది శాతం తగ్గి వుంటాయి అని. అంతే కానీ మర్నాడు పాతిక శాతానికి పడిపోయాయిని కాదు.

ఏ సినిమాకైనా ఇదే వర్తిస్తుంది. నిజానికి సినిమా మొత్తం కలెక్షన్లు చూపించిన తరువాత అందులోంచి ఈ అడ్వాన్స్ లు తీసేయాలి. కొందరు తీసేసి చెబుతుంటారు. రికార్డుల కోసం కొందరు అలాగే వుంచేస్తారు. అదీ సంగతి. Readmore!

Show comments