ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 06

ఎన్టీయార్‌ గురించిన మరిన్ని ఉదంతాలు చెపుతున్నాను. ఎన్టీయార్‌ సినీనిర్మాతగా మారిన తర్వాత ఆదర్శాలతో తీసిన ''పిచ్చి పుల్లయ్య'' (1953), ''తోడుదొంగలు'' (1954)విమర్శకుల ప్రశంసలు పొందినా వాణిజ్యపరంగా ఫ్లాప్‌ కావడంతో ''జయసింహ'' నుంచి బాట మార్చారు. ఆ తర్వాత రియలిస్టిక్‌ సినిమాల జోలికి పోలేదు. హైదరాబాదు మూవీస్‌ పి.గంగాధరరావు గారు ''కీలుబొమ్మలు'' (1965) అనే ఆఫ్‌బీట్‌ సినిమా తీస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాంస్యనంది పొందింది, ఐర్లండ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆ సందర్భంగా ఏర్పరచిన అభినందన సభలో మాట్లాడుతూ గుమ్మడిగారు ''గంగాధరరావు గార్ని ఆదర్శంగా తీసుకుని మన నిర్మాతలు యిలాటి సినిమాలు తీయవచ్చు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రామారావు గారు..'' అని మాట్లాడడంతో ఎన్టీయార్‌కి మండింది. ''నిన్నగాక మొన్న ''తోడుదొంగలు'' తీశాం. చేయి కాలింది. ఈ గుమ్మడిగారు మేమింకా నష్టపోవాలని కోరుకుంటునట్టున్నారు. కావాలంటే వారి డబ్బుతో వారు తీసుకోవచ్చు, మమ్మల్నెందుకు గోతిలో నెట్టడం?'' అని చెరిగేశారు.

గుమ్మడి ఏదో వివరణ యివ్వబోయారు కానీ, ఎన్టీయార్‌ వినిపించుకోలేదు. నిజానికి గుమ్మడి కొత్త తరహా సినిమాలు రావాలంటూ యిలాటి సలహాలు వ్యాసాల రూపంగా కూడా రాసేవారు. కానీ ఆయన ఎంత డబ్బు సంపాదించినా, ఏనాడూ నిర్మాతగా మారలేదు. మంచి సినిమా అనుకున్నదానికి కూడా ఫైనాన్స్‌ చేయలేదు. అది ఎన్టీయార్‌ మనసులో వుండి వుంటుంది. ఈ విషయాన్ని రచయిత త్రిపురనేని మహారథి తన ''ముచ్చట్లు''లో రాశారు. నిజానికి ''తోడుదొంగలు''లో ఎన్టీయార్‌ గుమ్మడికి తనతో దాదాపు సమానమైన వేషం యిచ్చారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే పోనుపోను వారి మధ్య మనస్ఫర్ధలు వచ్చాయి. ముఖ్యంగా చిత్రపరిశ్రమను హైదరాబాదుకి తరలించే విషయంలో ఎయన్నార్‌, ఎన్టీయార్‌ల మధ్య వచ్చిన గొడవలో యీయన యిరుక్కున్నాడు.

హైదరాబాదుకి మకాం మార్చాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహాయంతో తెలుగు పరిశ్రమను సాధ్యమైనంత వరకు తరలించాలని ఎయన్నార్‌ నిశ్చయించుకున్నారు. తనతో సినిమా తీసే నిర్మాతలందరూ హైదరాబాదులోనే సినిమాలను నిర్మించాలని పట్టుబట్ట సాగారు. అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమకు పెద్దలుగా ఎయన్నార్‌, ఎన్టీయార్‌ ఉన్నారు. అందువలన తనను సంప్రదించి, ఆ పై యీ ప్రకటన చేసి ఉండాల్సిందని ఎన్టీయార్‌ ఫీలయ్యారు. 'అంతకు ముందు నిధుల సేకరణకు బయలుదేరుతూ తనొక్కడే బయలుదేరాడు కదా, నన్నేమైనా సంప్రదించాడా? కలిసి రమ్మన్నాడా?' అనే అభిప్రాయంలో ఎయన్నార్‌ ఉన్నారు. ఆయన లాజిక్‌ కరక్టే అయినా ఎన్టీయార్‌కు రుచించలేదు. అందువలన పరిశ్రమ తెలుగుసీమకు తరలడానికి వీల్లేదు, మద్రాసులోనే ఉండాలి, నా నిర్మాతలందరూ యిక్కడే తీయాలి అని ఆయన పట్టుదల. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి (పదవీకాలం 1964-1971) కాగా ఆయన స్నేహితుడు చెన్నారెడ్డి రెవెన్యూ మంత్రిగా (పదవీకాలం 1962-1967) ఉన్నారు.

ఈ విధంగా పరిశ్రమ ఎయన్నార్‌-ఎన్టీయార్‌ వర్గాలుగా అంటే హైదరాబాదు-మద్రాసు వర్గాలుగా విడిపోయింది. ఇద్దరి సినిమాల్లో వేసే కారెక్టరు నటీనటులకు అటూయిటూ తిరగవలసిన అవస్థ దాపురించింది. ఎయన్నార్‌, ఎన్టీయార్‌ల మధ్య స్నేహం ఉన్న రోజులూ వున్నాయి, ప్రత్యర్థులుగా మారి కలహించిన రోజులూ ఉన్నాయి. కలహం అంటే బయటపడి, మాటామాటా అనుకోవడం లేదు. అభిమాన సంఘాల ద్వారా పోరాటం సాగుతూ ఉండేది. అందువలన ఏ చిన్న గొడవైనా సరే, పెద్దదిగా మారేది. ఈ క్యాంపులో పని చేస్తూ ఉండగా, ఆ క్యాంపు గురించి అడిగేవారు. చెప్తే ఓ తంటా, చెప్పకపోతే మరో తంటా. చిన్నవాళ్లే కాదు, గుమ్మడి లాటి సీనియర్లూ యిరుకున పడేవారు.

గుమ్మడి యిద్దరితోనూ చాలా సినిమాల్లో నటించినా, పర్శనాలిటీ దృష్ట్యా ఎయన్నార్‌ పక్కన ఎక్కువగా నటించేవారు, ఎన్టీయార్‌ పక్కన రంగారావు నటించేవారు. ఎయన్నార్‌తో వరుసగా సినిమాలు తీసే అన్నపూర్ణ, జగపతి, పిఎపి, పద్మశ్రీ వంటి సంస్థలు హైదరాబాదులో సినిమాలు తీయటం చేత నెలలో యిరవై రోజులు యీయన హైదరాబాదులో ఉండేవారు. ఒక రోజు సారథీ స్టూడియోలో గుమ్మడి ఎయన్నార్‌గారితో షూటింగులో ఉండగా చెన్నారెడ్డి స్టూడియోకి వచ్చి తెలుగు పరిశ్రమ యిక్కడకు తరలి రావడానికి ఏం చేస్తే మంచిదని ఎయన్నార్‌ను అడిగారు. మద్రాసులో ప్రభుత్వం స్టూడియోలు కట్టుకోవడానికి కారుచౌకగా వందల ఎకరాలు యిచ్చింది కాబట్టే అక్కడ స్టూడియోలు వెలిశాయని, యిక్కడ కూడా బంజారా హిల్స్‌, జూబిలీ హిల్స్‌ ప్రాంతంలో ఉన్న (యిప్పటి కెబియార్‌ పార్కు) 300 ఎకరాల స్థలం యిస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పడుతుందని ఎయన్నార్‌ అన్నారు. చెన్నారెడ్డి ఎయన్నార్‌ని, గుమ్మడిని తీసుకెళ్లి ఆ స్థలాన్ని చూపించారు.

ఆ షెడ్యూలు పూర్తయి గుమ్మడి ఎన్టీయార్‌ కాంబినేషన్‌లో వేస్తున్న ఓ సినిమా షూటింగుకై మద్రాసు వెళ్లారు. మేకప్‌ రూంలో యథాలాపంగా మాట్లాడుతూ ఎన్టీయార్‌ 'ఏమిటి హైదరాబాదు విశేషాలు?' అని అడిగితే గుమ్మడి జరిగినది చెప్పారు. వెంటనే ఎన్టీయార్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ''నా ప్రమేయం లేకుండా మీరంతా హైదరాబాదులో సినీ పరిశ్రమను అభివృద్ధి పరచగలరా?'' అంటూ అత్యంత పరుషపదాలతో వీళ్లందరినీ కలిపి తిట్టనారంభించారు. అలాటి మాటలు అప్పటివరకు ఆయన నోట వినని గుమ్మడి నిర్ఘాంతపోయి ఏదో వివరణ యివ్వబోగా, 'మీరింక మాట్లాడవద్దు' అని గద్దించారు. షూటింగు సమయంలో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.

అప్పటివరకు తన కెంతో ఆత్మీయుడిగా ఉన్న ఎన్టీయార్‌ యింత కఠినంగా మారడంపై గుమ్మడి తర్కించుకున్నారు. 'హైదరాబాదులో తనకు వ్యతిరేకంగా జరిగే 'కుట్రలూ, కుతంత్రాలూ' తెలిసి కూడా తను ఆత్మీయుడిగా భావించిన గుమ్మడి చెప్పలేదని ఎన్టీయార్‌ ఫీలై ఉంటారని అనుకున్నారు. మరుసటి రోజే హైదరాబాదు రావలసి వచ్చింది. ఎయన్నార్‌తో షూటింగు. ఆయనా ''ఏమిటి మద్రాసు విశేషాలు?'' అని అడిగారు. ''రెండు రోజులు రామారావుగారూ నేనూ కలిసి పనిచేశాం'' అన్నారు గుమ్మడి. ''చెప్పారు కారేం! నన్ను ఏ మోతాదులో తిడుతున్నారు?'' అని అడిగారు ఎయన్నార్‌.

గుమ్మడి మెల్లగా ''ఆయన చాలా బాధపడుతున్నమాట నిజం. మీరు ఆయనను సంప్రదించకుండా, ఆయన ప్రమేయం లేకుండా యిదంతా చేస్తున్నారనే భావం ఆయనలో వుంది.'' అని చెప్పబోగా, ఎయన్నార్‌ ''మీరు లౌక్యంగా, సానుకూల పద్ధతిలో మాట్లాడుతున్నారు. నాకు అసలు విషయాలు తెలుసులెండి. పరిశ్రమ పరంగా ఆయన అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాడు, మరి నన్నెప్పుడూ సంప్రదించలేదే!'' అన్నారు. గుమ్మడి దగ్గర దానికి సమాధానం లేదు. మద్రాసు తిరిగి వచ్చాక ఏకాంతంలో కలిసి విషయాలు వివరంగా చెప్దామని చూసినా, ఎన్టీయార్‌ అందుకు అవకాశం యివ్వలేదు. గుమ్మడిని శత్రువుగానే చూశారు. అప్పటివరకు ఆయనింట్లో జరిగే ప్రతి శుభకార్యానికి వచ్చే ఎన్టీయార్‌ గుమ్మడి కుమార్తె పెళ్లికి రాలేదు.

ఇంతలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి  మద్రాసు వస్తే తెలుగు నిర్మాతల పక్షాన విజయా గార్డెన్స్‌లో ఆయనతో సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో ఎన్టీయార్‌ తరఫు నిర్మాతలు కొందరు ఒక వినతిపత్రం యిచ్చారు. దానిలో 'ఇక్కడ నాగేశ్వరరావు అనే వ్యక్తి, తెలుగు-తమిళ విభేదాలు వెదజల్లి, హైదరాబాదు పారిపోయాడు. మీరు ఆయన మాటలు వినవద్దు' అని దాని సారాంశం. ఇది విన్న గుమ్మడి 'ఒక వ్యక్తి పేరు పెట్టి నిందలు వేస్తూ ఒక ముఖ్యమంత్రికి మెమోరాండం యివ్వడం అసమంజసం' అని నిరసించారు. అది ఎన్టీయార్‌కు తెలిసి, గుమ్మడిపై మరింత కోపం తెచ్చుకున్నారు. నాలుగైదు సంవత్సరాల పాటు దూరంగా ఉంచారు.

ఈ మధ్యకాలంలో ఎయన్నార్‌, ఎన్టీయార్‌ ఏదో ఒక సందర్భంలో కలిసి మంచిచెడ్డా మాట్లాడుకోవడం, తామిరువరి మధ్య మాటలు అటూయిటూ మోసి, తమ మధ్య అగాధం సృష్టించిందెవరో తెలుసుకోవడం జరిగింది. కలిసి పనిచేయడానికి నిశ్చయించుకున్నారు. వాతావరణం చల్లబడడంతో మధ్యలో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీయార్‌కు గుమ్మడిపై కోపం తగ్గి తన సొంత సినిమాలో అతిథి పాత్రకు గుమ్మడిని పిలిచారు. ఆయన సంతోషంగా వెళ్లి వేశారు. ఇవన్నీ గుమ్మడి తన ఆత్మకథ ''తీపి గురుతులు-చేదు జ్ఞాపకాలు''లో విపులంగా రాశారు.

ఈ ఉదంతం వలన తెలిసేదేమిటంటే ఎయన్నార్‌పై పంతంతో తెలుగు చిత్రసీమ హైదరాబాదుకు రాకుండా ఎన్టీయార్‌ చాలాకాలం అడ్డుకున్నారు. కానీ ఆ విషయంలో చివరకు ఎయన్నార్‌దే పై చేయి అయింది.   అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు. కొద్దికొద్దిగా పరిశ్రమ హైదరాబాదుకు తరలి వచ్చింది. చివరకు ఎన్టీయార్‌ కూడా హైదరాబాదు వచ్చి స్టూడియో కట్టవలసి వచ్చింది, యిక్కడ సినిమాలు తీయవలసి వచ్చింది. కొద్దికాలానికి ఆయనే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయి తక్కినవారిని కూడా తరలి రమ్మనమని పిలవవలసి వచ్చింది. ఒకప్పుడు దక్షిణాది సినిమాలన్నీ మద్రాసులోనే తయారయ్యేవి.

క్రమేపీ కన్నడ, మలయాళ సినిమాలు కూడా స్వరాష్ట్రాలకు తరలాయి. ఆ తరలింపు కారణంగా విభేదాలు రాలేదు. కానీ తెలుగు పరిశ్రమ విషయంలో మాత్రమే రెండు క్యాంపులుగా విడిపోయి, కలహించుకోవడం జరిగింది. కారణం యిద్దరు హీరోల మధ్య పంతాలు, పట్టింపులు!

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 05

Show comments