ఆయన్ని చూస్తే 'బూతు' భయపడ్తోందా.?

పహ్లాజ్‌ నిహ్లానీ.. సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌. నిర్మాతగా గతంలో పలు సినిమాల్ని నిర్మించిన పహ్లాజ్‌ నిహ్లానీ, ఇప్పుడు సినీ పరిశ్రమకి 'శతృవు'లా తయారయ్యారు. అదీ ఇదీ అని తేడాల్లేవ్‌.. తనకు నచ్చితేనే సినిమా, లేకపోతే అసలు సినిమానే కాదన్నట్టు వ్యవహరిస్తున్నారాయన. కొన్ని సినిమాల విషయంలో అయితే పహ్లాజ్‌ నిహ్లానీ తీరు మరింత షాకింగ్‌గా వుంటోంది. 

ఆ మధ్య 'ఉడ్తా పంజాబ్‌' సినిమా విషయమై పహ్లాజ్‌ నిహ్లానీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. కోర్టుకెళ్ళి సదరు చిత్ర దర్శక నిర్మాతలు 'ప్రత్యేక అనుమతి' తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈలోగా, సినిమా లీక్‌ అయిపోయింది. ఆ లీక్‌ పాపం కూడా పహ్లాజ్‌ నిహ్లానీదేనన్న ఆరోపణలున్నాయి. తాజాగా, 'బాబూమొషాయ్‌ బందూక్‌రాజ్‌' సినిమా విషయంలోనూ పహ్లాజ్‌ నిహ్లానీ తీరు వివాదాస్పదమయ్యింది. అయినాసరే, ఆయన మాత్రం 'నేను మారను' అంటున్నాడు. 

సినిమాకి కత్తెర వేయడం కొత్త కాదు. సెన్సార్‌ బోర్డ్‌ పనే అది. రెండు మూడు 'కట్స్‌' వరకూ పెద్దగా అభ్యంతరాలుండవు. కానీ, పది.. పాతిక.. యాభై.. అంతకు మించిన 'కట్స్‌' వేసేస్తామంటే, అసలు సినిమా ఎందుకు.? సన్నీలియోన్‌ నటించే బూతు సినిమాలకి కటింగ్స్‌ వుండవుగానీ, తమ సినిమాలకెందుకు కటింగ్స్‌.? అన్న విమర్శలు చాలామంది నటీనటులు, దర్శక నిర్మాతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. బూతు సినిమాలకి మాత్రం పహ్లాజ్‌ నిహ్లానీ, 'ఎ' సర్టిఫికెట్‌తో సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇచ్చేసి, 'ఆర్ట్‌' ఫిలింస్‌పైనే వేటు వేస్తుండడం అనుమానాస్పదమే. 

ఇక, తాజాగా బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగన్‌ సైతం పరోక్షంగా పహ్లాన్‌ నిహ్లానీపై అసహనం వ్యక్తం చేశాడు. తమ తాజా చిత్రం 'బాద్‌షాహో' బూతు సినిమా కాదంటూ ఘాటుగా స్పందించాడు. దానిక్కారణం, పహ్లాన్‌ నిహ్లానీకి భయపడి సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించారన్న వార్తలే. ముందస్తు 'కత్తిరింపు' నిజం కావడం వల్లే అజయ్‌దేవగన్‌లో ఈ అసహనం అన్నది బాలీవుడ్‌ సినీ జనాల మాట. మొత్తమ్మీద, పహ్లాజ్‌ నిహ్లానీని చూస్తే బూతు భయపడదు.. కానీ, 'బూతు' పేరు చెప్పి, తనకు నచ్చని సినిమాల్ని మాత్రం ఆయన వేధిస్తుంటాడు. దటీజ్‌ పహ్లాజ్‌ నిహ్లానీ.

Show comments