కల్యాణ్ రామ్ ధైర్యం అతడేనా?

ఓవైపు మహేష్ బాబు సినిమా బరిలో ఉంది. మరోవైపు బన్నీ సినిమా పోటీలో నిలిచింది. సంక్రాంతి బరిలో ఇలాంటి రెండు పెద్ద సినిమాల మధ్య తమ సినిమాను రిలీజ్ చేయాలని మరో హీరో అనుకోడు. మరీ ముఖ్యంగా ఆ స్థాయిలో మార్కెట్ లేని హీరోలు అస్సలు ఆలోచించరు. కానీ కల్యాణ్ రామ్ మాత్రం పోటీకి సై అన్నాడు. దీంతో అంతా అవాక్కయ్యారు. బన్నీ, మహేష్ కు పోటీగా కల్యాణ్ రామ్ రంగంలోకి దిగడాన్ని చాలామంది నమ్మలేకపోయారు. కానీ అతడి ధైర్యం వెనక ఓ వ్యక్తి ఉన్నాడు.

కల్యాణ్ రామ్ నటిస్తున్న ఎంతమంచివాడవురా సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మహేష్, బన్నీ రేసులో ఉన్నారని తెలిసి కూడా వీళ్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం దిల్ రాజు. అవును.. ఈ సినిమాను పంపిణీ చేయడానికి దిల్ రాజు ముందుకొచ్చారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాను విడుదల చేస్తానని ఆయన యూనిట్ కు మాటిచ్చారు. అందుకే కల్యాణ్ రామ్ పోటీకి సై అన్నాడు.

దర్శకుడు సతీష్ వేగేశ్నపై దిల్ రాజుకు చిన్న నమ్మకం. అతడు తీసిన శతమానం భవతి సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సతీష్ వేగేశ్న తీసిన మరో సినిమా దిల్ రాజుకు షాక్ ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎంతమంచివాడవురా ప్రాజెక్టుపై మాత్రం ఆయన నమ్మకంతో ఉన్నాడు. మరీముఖ్యంగా ఈ సినిమాను ఆయన ఓట్ రేట్ కు కొనే ఆలోచనలో కూడా ఉన్నాడట.

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ మరో సినిమా పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటుందని గతంలో దిల్ రాజే అన్నారు. అదే నమ్మకంతో ఈసారి సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు కల్యాణ్ రామ్ సినిమాను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. దిల్ రాజుకు ఇలా ఒకేసారి 2 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కొత్తకాదు. కాకపోతే కల్యాణ్ రామ్ సినిమాపై ఆయన ఎందుకంత నమ్మకం పెట్టుకున్నాడనేదే అందరికీ ఆశ్చర్యం.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?