‘అంతా సీక్రెట్’ ధోరణి కొంప ముంచుతుందా?

తెలంగాణలో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టంగా, బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? లేదా, ప్రత్యర్థి పార్టీ భారాసను నామ రూపాల్లేకుండా చేసే కసరత్తులో ఉన్నారా? అనేది ఇదమిత్థంగా తేల్చి చెప్పడం కష్టం.

మొత్తానికి గులాబీ ఎమ్మెల్యేలు వీలైనంత మందిని కాంగ్రెసులోకి తీసుకు వచ్చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాత్రం కనిపిస్తూనే ఉంది. భారాస ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే వ్యవహారాలను చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుండడం అనేది ఇప్పుడు పార్టీకే చేటు చేసేలా మారుతోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

ఇప్పటికి అయిదుగురు భారాస ఎమ్మెల్యేలు కాగ్రెసులో చేరారు. ఇలాంటి ప్రతి చేరిక సమయంలోనూ చెదురుమదురుగా పార్టీలో అసంతృప్తులు వ్యక్తం కావడం అనేది చాలా సహజం. తొలి మూడు చేరికల కంటె, పోచారం చేరినప్పుడు అటు కాంగ్రెస్ వారు, ఇటు భారాస వారు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కానీ.. మొత్తం ఆ నలుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ రేవంత్ పార్టీ శ్రేణులకు ఎలాగోలా సర్దిచెప్పగలిగారు. కానీ.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకున్న విషయంలో అసంతృప్తిని బుజ్జగించడం అంత సులువుగా సాధ్యమయ్యేలా లేదు.

జగిత్యాల స్థానం నుంచి 2023 లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పదవిలోనే ఉన్నారు. అయితే ఆయనను ఓడించిన సంజయ్ కుమార్ ను పార్టీలోకి తీసుకోవడం ఆయనకు జీర్ణం కావడం లేదు. పైపెచ్చు.. తనకు కనీసం సమాచారం కూడా లేకుండా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం అనేది ఆయనకు మింగుడుపడడం లేదు. అలిగిన జీవన్ రెడ్డి తాను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని.. ఏ పార్టీలోనూ చేరనని రాజకీయాలకు దూరంగా ఉంటానని అంటున్నారు. ఆయనను బుజ్జగించడానికి శ్రీధర్ బాబు వంటి మంత్రులు ప్రయత్నిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. Readmore!

భారాస ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న విషయం బయటకు పొక్కితే కేసీఆర్ అండ్ కో వారిని బుజ్జగించేస్తున్నారనే భయంతోనే.. అతి సీక్రెసీ పాటిస్తున్నారు. సొంత పార్టీ నేతలకు అస్సలు చెప్పడం లేదు. ఒకరిద్దరు బేరం మాట్లాడి.. డైరక్టుగా సీఎం దగ్గరకు తీసుకువచ్చి పార్టీ కండువా కప్పేస్తున్నారు. పార్టీలో కీలక నాయకులకు కూడా చేరిక తర్వాతే తెలుస్తోంది.

అయితే ఇలాంటి సీక్రెసీ పట్ల జీవన్ రెడ్డి సీరియస్ అయినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సీక్రెసీ రాజకీయాలు పార్టీని ఏ దరికి తీసుకువెళతాయో చూడాలి.

Show comments