కేంద్రంలో ఊత కర్ర ప్రభుత్వం రావాలి!

కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వస్తే రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. అందుకే ఊత కర్ర ప్రభుత్వం రావాలని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇటీవల విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఉక్కు ఉద్యమ కారులతో మాట్లాడుతూ బీజేపీకి పూర్తి మెజారిటీ రాకూడదని కోరుకున్నారు. అప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. సరిగ్గా ఇప్పుడు అదే మాటను ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అంటున్నారు.

కేంద్రంలో రేపటి రోజున ఏర్పడే ఏ ప్రభుత్వం అయినా వైసీపీ ఎంపీల మద్దతు మీద ఆధారపడి  మాత్రమే అధికారంలోకి రావాలని అంటున్నారు. అలా వస్తేనే తప్ప రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు తీరే అవకాశం లేదని అన్నారు.

తాను పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను అని ఆయన అన్నారు. ఇది తమ స్వార్థం అని కూడా అనుకోవచ్చు అని బొత్స వ్యాఖ్యానించారు. కేంద్రంలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఉందని దీంతో ప్రస్తుతం పనులు ఏది కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదని అన్నారు. ప్రతీ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణం నుంచే ఆలోచిస్తోందని ఆయన బీజేపీ మీద విమర్శలు చేశారు. అందువల్లనే ఇతరుల మద్దతుతో నడిచే సర్కార్ కేంద్రంలో రావాలని ఆయన కోరుకున్నారు.

ప్రస్తుతం ఎన్డీయేలో టీడీపీ జనసేన మాత్రమే ఉన్నాయి. రేపటి రోజున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తక్కువ అయితే కండిషన్లు పెట్టి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు వైసీపీ ఆలోచిస్తోందా అన్న చర్చకు తెర లేస్తోంది. ఏ కండిషన్లు పెట్టినా ఏపీ ప్రయోజనాల కోసం అయితేనే జనాలు హర్షిస్తారు అని అంటున్నారు.

Show comments