చిచ్చురేపిన టీడీపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌

ఎట్ట‌కేల‌కు టీడీపీ ఫైన‌ల్ లిస్ట్‌ను ప్ర‌క‌టించింది. పెండింగ్‌లో ఉన్న‌ నాలుగు ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. టికెట్ ద‌క్క‌ని ఆశావ‌హులు షాక్‌కు గుర‌య్యారు. టికెట్ ఆశావ‌హుల అనుచ‌రులు టీడీపీ కార్యాల‌యాల్లో విధ్వంసానికి తెగ‌బడ్డారు. అలాగే టీడీపీ జెండాలు, ప్లెక్సీలు, ఇత‌ర‌త్రా ఎన్నిక‌ల సామ‌గ్రికి నిప్పు పెట్టి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధానంగా ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న టీడీపీలో మునుపెన్న‌డూ లేని విధంగా విధ్వంసానికి కార‌ణ‌మైంది. ఇవాళ చీపురుపల్లికి  కళా వెంకట్రావు, భీమిలి - గంటా శ్రీనివాసరావు, పాడేరు - కె. వెంకటరమేశ్‌ నాయుడు, దర్శి - గొట్టిపాటి లక్ష్మి,  రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు - వీరభద్ర గౌడ్‌, గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్, అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌, కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌‌‌లను అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

వీటిలో అనంత‌పురం అర్బ‌న్‌, గుంత‌క‌ల్లు, చీపురుప‌ల్లి, రాజంపేట నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల ఎంపిక వివాదాస్ప‌ద‌మైంది. అనంత‌పురం అర్బ‌న్‌, గుంత‌క‌ల్లులో పార్టీ కార్యాల‌యాల్లో ఇన్‌చార్జ్‌లు ప్ర‌భాక‌ర్ చౌద‌రి, జితేంద‌ర్ గౌడ్ అనుచ‌రులు వీరంగం సృష్టించారు. కార్యాల‌యాల్లోని ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశారు. అలాగే పార్టీకి సంబంధించిన వ‌స్తు సామ‌గ్రికి నిప్పు పెట్టి నిర‌స‌న తెలిపారు.

చంద్ర‌బాబు ప్లెక్సీని చెప్పుతో కొట్టారు. చీపురుప‌ల్లిలో టీడీపీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జున పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. యువ‌త‌కు ప్రోత్స‌హం ఇవ్వ‌కుండా, వృద్ధ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అలాగే రాజంపేట‌లో సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యానికి టికెట్ ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ఇన్‌చార్జ్ బ‌త్యాల చెంగ‌ల్రాయులు అనుచ‌రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. క్లస్టర్ఇంచార్జి, 10 మంది బూత్ కన్వీనర్లు పార్టీకి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో అభ్య‌ర్థుల ఎంపిక తీరుపై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతుండ‌డంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి.

Show comments