గంటాకు భీమిలిలో గండాలెన్నో?

ఎట్టకేలకు టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలీ టికెట్ ని ఆ పార్టీ హై కమాండ్ కేటాయించింది. దాంతో చాలా కాలంగా ఉగ్గపట్టి చూస్తున్న గంటా అనుచరులు అభిమానులలో సందడి వాతావరణం నెలకొంది. అంతా గంటాను కలసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. గంటా ఎమ్మెల్యేగా గెలిచినంతగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఈసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గంటా మరోమారు మంత్రి అవడం ఖాయమని కూడా జోస్యం చెబుతున్నారు. కాబోయే మినిస్టర్ అని కూడా గంటా అనుచరులు నినదిస్తున్నారు. భీమిలీలో గంటా పోటీ చేసి 2014లో 37 వేల పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అయిదేళ్ల గ్యాప్ తరువాత మరోసారి ఆయన అక్కడ నుంచి పోటీకి దిగుతున్నారు. గంటా సెంటిమెంట్ ప్రకారం ఒకసారి పోటీ చేసిన సీటులో మళ్లీ చేయరు. కానీ భీమిలీకి మాత్రం రెండవసారి వచ్చారు. ఇది సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది కూడా అంతా తర్కించుకుంటున్నారు.

గంటాకు టికెట్ ఇవ్వడం మీద టీడీపీ ఆశావహులలో అసంతృప్తి కనిపిస్తోంది. మాజీ ఎంపీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది. అలాగే బీసీ నేత ఒకరు టికెట్ ఆశించారు. జనసేన నుంచి పంచకర్ల సందీప్ తనకే టికెట్ అనుకున్నారు.

ఇపుడు వీరంతా గంటాకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గంటా గ్రాఫ్ గతంలో కంటే తగ్గింది అని వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. గతంలో అయిదేళ్ళుగా ఆయన మంత్రిగా ఉంటూ చేసింది ఏమీ లేదని ఇపుడు మళ్లీ పోటీ చేస్తే గెలిపించరు అని అంటున్నారు.

అవంతి శ్రీనివాసరావు గంటా ప్రత్యర్ధిగా ఉన్నారు. ఆయన భీమిలీ నుంచి రెండు సార్లు గెలిచి గంటా మీద రెండు ఆకులు ఎక్కువ చదివాను అంటున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, మూడేళ్ళు మంత్రిగా చేశారు. ఆయన కూడా ఓటమి ఎరగని నాయకుడే. అయితే ఒకే సీటుని నమ్ముకున్న నేతగా జనంలో గుర్తింపు ఉంది.

భీమిలీలో కాపుల ఓట్లు 75 వేల దాకా ఉన్నాయి. దానితో పాటుగా ఇతర సామాజిక వర్గాల ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. విశాఖ జిల్లాలో మూడు లక్షలు పై దాటిన ఓటర్లు ఉన్న ఏకైక అసెంబ్లీ సీటు భీమిలీ. ఇక్కడ గంటా అవంతిల మధ్య రాజకీయ సమరం గట్టిగానే సాగుతుంది అని అంటున్నారు. ఎవరూ తక్కువ కాదు, ఫలితం అనూహ్యంగానే రావచ్చు అంటున్నారు.

Show comments