విజ‌య‌మ్మ‌తో అవినాష్ భేటీ...ఏమై వుంటుంది?

వైఎస్ విజ‌య‌మ్మ‌తో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి భేటీ కావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో ఇవాళ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు సీబీఐ విచార‌ణ ఎదుర్కోడానికి కొన్ని గంట‌ల ముందు ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వివేకా హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి మొద‌టిసారిగా సీబీఐ విచార‌ణ ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా సీబీఐకి ఆయ‌న లేఖ కూడా రాశారు. విచార‌ణ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు. అలాగే ఆడియో, వీడియో రికార్డ్ జ‌రగాల‌ని, త‌న విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని లేఖ‌లో ఆయ‌న కోరడం గ‌మ‌నార్హం. వివేకా హ‌త్య‌పై విచార‌ణ మొద‌లు త‌న‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించేలా కొన్ని మీడియా సంస్థ‌లు త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేస్తున్నాయ‌ని వాపోయారు.

ఇదే సంద‌ర్భంలో హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్‌లో విజ‌య‌మ్మ‌ను అవినాష్‌రెడ్డి ఎందుకు క‌లిసి వుంటార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. వివేకా కేసులో ప్ర‌ధానంగా నిందితుడిగా త‌న కేంద్రంగా ప్ర‌చారం సాగుతుండ‌డం, సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ప‌రిస్థితుల‌పై పెద్ద‌మ్మ అయిన విజ‌య‌మ్మ‌కు వివ‌ర‌ణ ఇవ్వ‌డానికే అవినాష్ వెళ్లి వుంటార‌ని స‌మాచారం. వివేకా హ‌త్య కేసు విచార‌ణ జ‌రుపుతున్న సీబీఐకి జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌క‌పోగా, అడ్డు త‌గులుతోంద‌ని డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

విచార‌ణ‌ను తెలంగాణ‌కు సుప్రీంకోర్టు మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైద‌రాబాద్‌లో అవినాష్‌రెడ్డి విచార‌ణ ఎదుర్కోనున్నారు. అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించ‌డంపై వైసీపీ శ్రేణుల్లో టెన్ష‌న్ నెల‌కుంది. చివ‌రికి ఈ కేసు ఏ మ‌లుపు తిరుగుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది. 

Show comments