బాల‌య్య ఫ‌స్ట్ రియాక్ష‌న్‌!

కొత్త జిల్లాల ఏర్పాటుపై టీడీపీ వ్యూహాత్మ‌క మౌనాన్ని పాటిస్తోంది. జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఎలాంటి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో బావ చంద్ర‌బాబు ఊరుకున్నా, బామ్మ‌ర్ది బాల‌య్య మాత్రం త‌న మార్క్ స్పంద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. 

నంద‌మూరి బాల‌కృష్ణ రాయ‌ల‌సీమ‌లోని హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌పై కాస్త ఆల‌స్యంగానైనా ఆయ‌న స్పందించ‌డం ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో రాజ‌కీయం చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న కోరారు. 

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం విశేషం. హిందూపురం ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప్ర‌భుత్వం గౌర‌వించాల‌ని ఆయ‌న కోరారు.

హిందూపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కాద‌ని పుట్ట‌ప‌ర్తి జిల్లా కేంద్రంగా అదే ప‌ట్ట‌ణాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంపై బాల‌య్య ప‌రోక్షంగా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అందుకే జిల్లాల ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్ద‌ని, హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌నేది ఆయ‌న డిమాండ్‌. 

ఏది ఏమైనా కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగ‌తించిన వారిలో టీడీపీకి సంబంధంచి మొద‌టి ఎమ్మెల్యే బాల‌య్యే కావ‌డం విశేషం.

Show comments