మూవీ రివ్యూ: షాది ముబారక్

చిత్రం: షాది ముబారక్
రేటింగ్:2.5/5
తారాగణం: సాగర్, దృశ్య రఘునాథ్, హేమ, బెనెర్జీ, రాం రెడ్డి, మిర్చి హేమంత్, రాహుల్ రామకృష్ణ, భద్రం తదితరులు
సంగీతం: సునీల్ కాశ్యప్
నిర్మాతలు: శిరీష్- లక్ష్మణ్
దర్శకత్వం: పద్మశ్రీ
విడుదల తేదీ: 5 మార్చ్, 2021

దాదాపు మూడు సంవత్సరాల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా లాక్డౌన్ వల్ల కొంత, ఇతర కారణాల వల్ల ఇంకొంత ఆలస్యమవుతూ ఎట్టకేలకు ఈ రోజు విడుదలయ్యింది. టీజర్ వచ్చే దాక ఈ సినిమా ఒకటుందన్న సంగతి కూడా ఎవరికీ గుర్తులేదు. టీజర్, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ ఇదొక రొమాంటిక్ కామెడీ ఫిలిం అనే ఫీలింగ్ కలిగించాయి. దిల్ రాజు బ్యానర్ మీద వస్తుండడంతో ఇంకాస్త అంచనాలు ఏర్పడ్డాయి.

ఇది పెళ్లిచూపులకి సంబంధించిన కథ అనే ఇండికేషన్ కూడా ట్రైలర్లో కనపడింది. సాధారణంగా పెళ్లిచూపులు చుట్టూ కామెడీ రాసుకోవడానికి స్కోప్ చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో "అహనా పెళ్లంట" నుంచి ఇప్పటి "ఎఫ్-2" వరకు ఈ థీం చుట్టూ రాసుకున్న కథలు, సన్నివేశాలు బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యాయి. . ఇక పెళ్లిచూపులు కాన్సెప్ట్ తోనే మొదలై అదే టైటిల్తో వచ్చిన సినిమా కూడా 'తారా'బలం లేకపోయినా తారాస్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడీ "షాదీ ముబారక్" పరిస్థితేంటో చూద్దాం.

"అష్టాచెమ్మా"లో హీరోయిన్ కి "మహేష్" అనే పేరు మీద అబ్సెషన్ ఉన్నట్టు ఇక్కడ తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) కి ఇంటిపేరు మీద అబ్సెషన్ ఉంటుంది. వినడానికి ఇంపుగా ఉండే ఇంటిపేరుగల అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆమె తల్లిది మ్యాట్రిమోనీ బిజినెస్. తన క్లైంట్ ఒకతను అమెరికా నుంచి వస్తాడు. అతనిపేరు సున్నిపెంట మాధవ్ (సాగర్). ఆ మిస్టర్ సున్నిపెంటకి ఒక్క రోజులో మూడు పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తుందావిడ. కానీ సరిగ్గా అతనొచ్చే సమయానికి ఆవిడకి కాలు బెణకడంతో అబ్బాయిని పెళ్లిచూపులకి తీసుకెళ్లాల్సిన తన పనిని కూతురికి అప్పజెబుతుంది. అలా మిస్టర్ సున్నిపెంటతో ప్రొఫెషనల్ గా మొదలైన తుపాకుల సత్యభామ రిలేషన్ ఒక్క రోజులో ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది మిగతా కథ.

నిజానికి ఇది చాలా ప్రెడిక్టిబుల్ స్టోరీ లైన్. చివరికి ఏమౌతుందనేది మొదట్లోనే తెలిసిపోయే ప్లాట్. ఇలాంటి కథలకి స్క్రీన్ ప్లే, డయలాగ్ తో పాటు ట్యాలెంటెడ్ ఆర్టిస్టులుంటే తప్ప పని జరగదు. ఆ విషయంలో ఈ సినిమా పాస్ అయిందనే చెప్పాలి. సాగర్ ది పూర్తిగా అండర్ ప్లే చేసే క్యారెక్టర్. ఎక్కడా మాస్ మసాలలు, హీరోయిజాల జోలికి పోకుండా ఒక సగటు సామాన్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ టైప్ పాత్రలో నీట్ గా చేసాడు. కథనంలో అగ్రభాగం హీరోయిన్ మీదనే డిపెండ్ అయింది. ఆమె నటన, ఫొటోజెనిక్ ఫేస్ క్యారెక్టర్ కి ప్లస్ అయ్యాయి.  సినిమా అయ్యాక కూడా గుర్తుండే ప్రెసెన్స్ ఈమెది.  అలాగే డ్రైవర్ గా రాహుల్ రమకృష్ణ, హీరో స్నేహితుడిగా భద్రం, పెళ్లికొడుకుగా మిర్చి హేమంత్ కూడా గ్రాఫ్ ఎక్కడా కింద పడకుండా తమ కామెడీతో నిలబెట్టారు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా పాటలు పెద్దగా గుర్తుండేలా లేవు. పైగా అవి ఫ్లో కి అడ్డొచ్చేట్టుగా ఉన్నాయి. సినిమా మొదలైన చాలాసేపటి వరకు ఫ్లో దెబ్బతినకపోవడానికి కారణం ఆ ప్లేసులో పాటలు లేకపోవడం వల్లనే అనిపిస్తుంది తర్వాత వచ్చే పాటలు చూస్తే. ముఖ్యంగా ఇంటర్వెల్ అయిన వెంటనే వచ్చే అక్కర్లేని పబ్ సాంగ్ మూడ్ ని డిస్టర్బ్ చేస్తుంది. కెమెరా పని తనం, ఎడిటింగ్ ఓకే. డయాలాగ్స్ సటిల్ గా బాగున్నాయి. దర్శకత్వ పరంగా ఫస్టాఫ్ బాగా నిలబెట్టినా, సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి తొలి పావుగంట అమాంతం కింద పడ్డట్టయ్యింది. మళ్లీ పుంజుకుని క్రమంగా కొన్ని ట్విస్టులు తిరిగి చివరకి హ్యాపీ ఎండింగ్ దిశగా నడిచింది. అయితే తొలి సగంలో ఉన్న పట్టు రెండో సగంలో తగ్గిందన్నది వాస్తవం.

గతంలో ఇలాంటి సినిమాలు రాలేదా అంటే చాలానే వచ్చాయి. అయితే ఎక్కడా అశ్లీలం లేకుండా కుటుంబసమేతంగా చూడదగ్గ వినోదం ఈ సినిమాలో ఉంది. రియాలిటీలో ఉంటూనే, సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటూనే పెద్దగా విసిగించకుండా కథనం నడిపించిన తీరు బాగుంది. ఈ సినిమాకున్న అతి పెద్ద లోపం ఏంటంటే ట్రెండ్ అవ్వదగ్గ ఒక్క మంచి పాట కూడా లేకపోవడం. అది ఉండుంటే కాస్త ఓపెనింగ్స్ అన్నా బాగుండేవి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే.

అతి తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమాకి ప్రేక్షకాదరణ కూడా లభిస్తే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించవచ్చు. అది మిస్ అయినా టీవీల్లోనూ, ఓటీటీల్లోనూ చూడదగ్గ సినిమాగా మిగిలుంటుంది. మూడొంతుల సినిమా కదలకుండా కూర్చోబెట్టింది కనుక ముప్పావు ముబారక్ చెప్పొచ్చు.

బాటం లైన్: "ముప్పావు" ముబారక్

Show comments