ఎమ్బీయస్: అమరావతిపై ఉండవల్లి వాదన

అమరావతి ఉద్యమ వార్షికోత్సవ సందర్భంగా నేను రాసిన వ్యాసం చదివి అమరావతిపై ఉండవల్లి వీడియో చూశారా అని కొందరు పాఠకులు అడిగారు. ఆయనలాగే మనమూ ఆలోచించాలని లేదు, మనకు తోచనవి ఆయనకు తోచవచ్చు, ఆయనకు తోచినవి మనకు తోచకపోవచ్చు. ఆయన అభిప్రాయం ఆయనది, నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది. 

అవతలివాళ్ల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని మన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆయన ఏం చెప్పారా అని విన్నాను. అమరావతిలో రాజధాని పెట్టడాన్ని, దాన్ని పెద్ద నగరంగా ప్లాన్ చేయడాన్ని తాను గతంలో వ్యతిరేకించానని గుర్తు చేశారు. దాన్ని భ్రమరావతి అని తొలుతగా అన్నది బహుశా తనే అన్నారు.

అంటూనే ‘అమరావతి సెలక్షన్ తప్పు, మార్చడం యింకా పెద్ద తప్పు’ అంటున్నారు ఉండవల్లి. ఒకసారి నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని యిప్పుడు మార్చకూడదంటున్నారా ఆయన? అప్పట్లో అమరావతికి అభ్యంతరం చెప్పిన పార్టీలన్నీ యిప్పుడు మద్దతు పలుకుతున్నాయని కూడా ఉండవల్లి అన్నారు. వారితో పాటు ఆయనా అదే అంటున్నారు. 

కారణం ఏమిటి? ‘అమరావతి వలన పర్యావరణం నాశనం అవుతుంది, మూడు పంటలు పండించే భూములు నాశనమవుతాయి, రైతులు ఉపాధి కోల్పోతారు, అలాటి పంటభూముల్లో పెద్ద భవంతులు కడితే నిర్మాణవ్యయం చాలా ఎక్కువౌతుంది, అన్నీ ఒకే చోట పెడితే మరో హైదరాబాదు అవుతుంది, ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయి...’ యిత్యాది కారణాలన్నీ గాలికి ఎగిరిపోయాయా?

రాజధానిగా అమరావతి నిర్ణయానికి వైసిపి అప్పట్లో అభ్యంతరం చెప్పలేదన్న సంగతిపై చాలాసేపే మాట్లాడారు ఉండవల్లి. అభ్యంతరం పెట్టి వుంటే ‘హైదరాబాదు నుంచి రాజధాని తరలిరావడం నీకు యిష్టం లేదు, ఎందుకంటే నీకు అక్కడ ఆస్తులున్నాయి’ అంటారని దడిసి వుండవచ్చు అన్నారు. 

ఎప్పటికో అప్పటికి రాజధాని కట్టుకోవాలని అందరికీ తెలుసు. ఎటొచ్చీ తరలింపు టైమింగు మీదనే పేచీ వచ్చింది. అన్ని హంగులతో రాజధాని నిర్మాణం పూర్తయ్యాక వచ్చి వుంటే సరిపోయేది. ఓటు, నోటు కేసు వల్ల బాబు హైదరాబాదుపై హక్కులు వదులుకుని వచ్చేయడం వేరే అంశం. రాజధాని ఎక్కడుండాలి అనేదే చర్చనీయాంశం. జగన్‌కు దొనకొండలో భూములున్నాయి కాబట్టి అక్కడే పెట్టమంటాడని పెద్ద ప్రచారం సాగింది. అమరావతి సరైన చోటు కాదన్న ప్రతివారికీ దొనకొండలో భూములున్నాయని అంది మీడియా.

సరే, అమరావతిలోనే పెట్టాలనుకున్నా, ప్రభుత్వ భూముల్లో పెట్టకుండా, లాండ్ పూలింగంటూ ప్రత్యేక విధానం పెట్టి రైతుల భూములెందుకు తీసుకున్నారన్నదే ప్రధానమైన ప్రశ్న. జగన్ అడ్డు చెప్పి వుంటే రైతులు భూములు యింత విరివిగా యిచ్చి వుండేవారు కాదని ఉండవల్లి భావన. ఆ రెండు జిల్లాలలోనూ అన్‌పాప్యులర్ కావడం రాజకీయంగా ప్రమాదకరం కాబట్టి, జగన్ వ్యక్తిగతంగా నోరు విప్పక పోయి వుండవచ్చు కానీ, వైసిపి స్థానిక నాయకులందరూ భూములివ్వవద్దనే ప్రచారం చేశారు. 

సాక్షి కూడా లాండ్ పూలింగ్ విధానాన్ని ఎండగడుతూనే వచ్చింది. కొన్ని గ్రామాలవాళ్లు ప్రతిఘటించడం, వారి కుప్పలు తగలబడడం, వారిపై ప్రభుత్వం కేసులు పెట్టడం, దరిమిలా విత్‌డ్రా చేయడం, అన్నీ జరిగాయని మర్చిపోకూడదు. ఆనాడు భూములిచ్చిన వారిలో చాలామంది స్వచ్ఛందంగా యిచ్చారనే అనాలి. మామూలుగా ఐతే . కాంపెన్సేషన్‌ మొత్తమంతా ఒకేసారి యిచ్చేయండి, వేరే చోట భూమలు కొనుక్కుంటాం అనాలి. కానీ వాళ్లు  లాండ్ పూలింగులో వున్న రిస్కు తెలుసుకునే ముందుకు వచ్చారు. 

బాబుపై వారికి ఉన్న అపారమైన నమ్మకం అలాటిది. నిజానికి మోదీ డబ్బులివ్వకుండా ఏడిపిస్తాడని, డిజైన్ల పేరుతోనే బాబు ఏళ్లూ, పూళ్లూ గడిపేస్తారని ఎవరు మాత్రం అనుకున్నారు? మూడు నాలుగేళ్లలో ఒరిజినల్ ప్లానులో ఐదో వంతైనా పూర్తి చేసే అవకాశం వుంది. సింగపూరు, మలేసియా, చైనా, జపాన్ అంటూ.. ప్రపంచంలో ఆ నగరంలా చేస్తా, యీ నగరాన్ని తలపిస్తా అంటూ బాబు కాలయాపన చేస్తారని ఎవరనుకున్నారు? ఆలస్యం చేస్తే జగన్ వచ్చి ఆపేస్తాడేమోనన్న శంక బాబుకి కానీ, ఆయనను నమ్ముకుని భూములిచ్చినవారికి కానీ, వారి నుంచి కొనుక్కున్నవారికి కానీ లేదు. 

జగన్ ఎలాగూ జైలుకి పోతాడు, పార్టీ మూతపడుతుంది, యిప్పటికే అనేమంది ఎమ్మెల్యేలనూ, ఎంపీలను మనవైపు లాగేశాం. ఏమీ చేయలేక దిగాలుపడి వున్నాడు. హీనపక్షం 15 ఏళ్ల టిడిపిదే రాజ్యం అనుకున్నారు. నిజానికి రాజధాని ప్రకటన వచ్చేనాటికి జగన్ పరిస్థితి అదే. అతను అమరావతిలో రాజధానిని ఎదిరించినా ‘సరేలే, నీ బోడి అభిప్రాయం ఎవరికి కావాలి’ అనుకుని నవ్వుకుని వూరుకునేవారు. టిడిపి ఏ మాత్రం బాగా పాలించినా 2019లో జగన్‌కు సీట్లు పెరిగేవి తప్ప అధికారంలోకి వచ్చేవాడు కాదు. 

అంతేకాదు, బాబు చెప్పినదానిలో 20 శాతం పూర్తి చేసినా జగన్‌ రాజధాని తరలించే సాహసం చేసేవాడు కాదు. ఇప్పుడు కూడా రాజధానిని తరలిస్తున్నానని గట్టిగా అనడం లేదు. అదే రాజధాని అంటూ దాని సైజు తగ్గించేస్తున్నాడు. పెద్ద పెద్ద నగరాలుగా కట్టిన అనేక రాజధానులు ఎలా ఘోస్ట్ సిటీలుగా మారాయో ఉండవల్లి పుస్తకరూపంగా చెప్పానని అన్నారు. మరి అలాటప్పుడు దాని సైజు తగ్గించడం తప్పెలా అవుతుంది? వికేంద్రీకరణ తప్పని అనడానికి ఉండవల్లి కూడా సాహసించటం లేదు. అయితే చల్లగా, చడీచప్పుడు లేకుండా డైల్యూట్ చేశాయాలట. 

ఒక్కో విభాగాన్ని ఒక్కో జిల్లాకు తరలించేయాలట. ఇప్పుడు జగన్ చేస్తానంటున్నది అదేగా! తేడా అల్లా జగన్ చెప్పి చేద్దామని చూస్తున్నాడు, చడీచప్పుడు లేకుండా చేయాలని ఉండవల్లి సలహా! ఎంత చిన్న అంశాన్నయినా పెద్దది చేసి, మీడియాకు ఎక్కించి, కోర్టుల ద్వారా అడ్డుకుంటున్న టిడిపి, రాజధానిని చల్లగా డైల్యూట్ చేస్తూ వుంటే చూస్తూ ఊరుకుంటుందా? వైజాగ్‌లో గెస్ట్‌హౌస్ కడతానన్నా దానిపై చచ్చేటంత చర్చ జరుగుతోంది. అలాటప్పడు ఉండవల్లి సలహా ఏ మేరకు ఆచరణీయం?

10 వేల కోట్లు ఖర్చు పెట్టి కొన్ని బిల్డింగులు ఎలాగూ కట్టేశారు కదా, వాటిని వేస్టు చేయకుండా అక్కడే రాజధాని కంటిన్యూ చేసేయవచ్చు అంటున్నారు ఉండవల్లి. ఆ బిల్డింగులు ఎక్కడికి పోతాయి? నవనగరాలనూ రాష్ట్రమంతా పంచేయమని ఉండవల్లే అంటున్నారు కదా. గుంటూరు జిల్లాకు కూడా ఓ నగరం వస్తుంది. దానికి ఆ బిల్డింగులు ఉపయోగపడతాయి. వృథా అయ్యే ప్రశ్నే రాదు. ఉండవల్లి ఇండస్ట్రియల్ సిటీని రాయలసీమకు తరలించాలని సలహా యిచ్చారు. 

ఆయన సలహా మేరకు నగరాలన్నీ తరలించి వేస్తే ఆ భూములకు వాళ్లాశించిన ధర పలుకుతుందా? మీకు బాబు మాటిచ్చిన బ్రహ్మాండ నగర సముదాయం కడతానని భూములిచ్చిన రైతులకు చెప్పి, ఆందోళన మాన్పించి, ఆ తర్వాత ఒక్కో నగరం తరలిస్తూ పోతే అప్పుడు రైతులను ఊరుకోబెట్టడం సాధ్యమా? పోనీ ఉండవల్లి వెళ్లి రైతులకు, అమరావతి పెట్టుబడిదారులకు రాజధాని యిక్కడే కానీ బిల్డింగులుండవు అని నచ్చచెప్పగలరా?

వేరెవరో ఎందుకు ఉండవల్లి తన యింటర్వ్యూలో చెప్పిన తన ఎన్నారై బంధువైనా ఒప్పుకుంటారా? ‘అక్కడ పెట్టుబడి పెట్టిన మా ఎన్నారై బంధువొకరు అమరావతి కేసు చేపట్టమని నన్ను అడిగారు. అలాటివాళ్లు జబర్దస్త్ పార్టీలు 80, 90 మంది దాకా వున్నారు.’ అన్నారు ఉండవల్లి. అంటే వాళ్లు రైతులు కాదు, పెట్టుబడిదారులు మాత్రమే. భూములిచ్చినవారిలో వెల్‌టుడు పీపుల్ వున్నారు కాబట్టి, ఖరీదైన లాయర్లు పెట్టుకుని కోర్టుల్లో కేసు నడుపుతున్నారని ఉండవల్లే అన్నారు. రైతుల నుంచి హెచ్చుధరకు భూములు కొన్నవారు కూడా మోతుబరులే అని చేర్చాల్సింది.

‘వాళ్లేమీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టరు. కోర్టు కాంపెన్సేషన్ యివ్వమని ప్రభుత్వానికి చెప్తుంది. 50 వేల (34 వేలు కాదా?) ఎకరాల భూమి అంటున్నారు కాబట్టి చివరకు ప్రభుత్వం ఏ 50 వేల కోట్లో పరిహారంగా యివ్వాల్సి వుంటుంది’ అంటారీయన. అది వింటే ఆ మేరకు రైతులకు, ప్రభుత్వానికి మధ్య రాసుకున్న అగ్రిమెంటు పకడ్బందీగా వుందని మనం అనుకుంటాం. కానీ ఉండవల్లి దానిపై కమిట్ కావటం లేదు. ‘నేను ఆ అగ్రిమెంటు చదవలేదు.’ అని తప్పుకున్నారు. ఇది అన్యాయమంటాను నేను. 

ఎక్కడో బర్మా రాజధానిలో ఏం జరిగిందో కూడా అధ్యయనం చేయగలిగిన ఉండవల్లి, ప్రాక్టీసు చేయకపోయినా న్యాయశాస్త్తం చదువుకున్నాయన, ప్రభుత్వం రహస్యంగా దాచేసిన విషయాలను కూడా ఆర్‌టిఐ ద్వారానో, మరో రకంగానో తీగలాగి, ఎక్కడెక్కడి నుంచో తవ్వి బయటకు పడేయగల ఉండవల్లి, వేలాది రైతుల వద్ద బాహాటంగా ఉన్న డాక్యుమెంటును చదవడానికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చించలేరా?

గతంలో జెపి కూడా మార్గదర్శి విషయంలో యిదే వాదన వినిపించారు. మార్గదర్శి వంటి నాన్-బ్యాంకింగ్ కంపెనీ డిపాజిట్లు సేకరించకూడదని ఉండవల్లి కేసు పెట్టినపుడు, మార్గదర్శి చేసినదాంట్లో తప్పు లేదని జెపి వాదించారు. ‘అదేమిటి? ఫలానా చట్టం ప్రకారం..’ అని ఉండవల్లి చెప్పబోతే ‘ఆర్థిక విషయాల్లో నాకంత పట్టు లేదు’ అంటూ జెపి చర్చలోంచి తప్పుకున్నారు. ఆస్ట్రేలియాలో మునిసిపల్ ఎన్నికల గురించి, అమ్‌స్టర్‌డామ్‌లో మురుగునీటి వ్యవస్థ గురించి కూడా మాట్లాడగల వ్యక్తి, కావాలనుకుంటే ఓ రోజో, రెండు రోజులో కూర్చుని దీని సంగతి తెలుసుకోలేరా? అనుకున్నాను.

ఇప్పుడు ఉండవల్లి కూడా ధైర్యముంటే రైతులతో ‘ఆ అగ్రిమెంటు ప్రకారం మీకు వచ్చేది యింతే! ఏదోలా రాజీ పడితే మంచిది’ అని రైతులకు చెప్పాలి, లేదా ఊరుకోవాలి. భారీగా ఎకరానికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం వస్తుందని ఆశ పెట్టి ఊరించడం తప్పు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది యీ రోజుల్లో. రైతులకు యిప్పటికే ఆశలు కల్పించి, ఆశాభంగం కల్పించారు. బయటివాళ్లు కూడా వాళ్లతో ఆడుకోవడం మానేయాలి.

ఉండవల్లి మాటల్లో యింకో విషయం కూడా బయటపడింది. పేరుకి రైతులు అన్నా, వాళ్ల వెనకాల ఖరీదైన కోర్టు కేసులు నడుపుతున్నది పెట్టుబడిదారులే! వాళ్లు రైతులకు కేటాయించిన భూముల్ని కొని వుండవచ్చు. లేదా చుట్టుపక్కల ఉన్న భూములను కొని వుండవచ్చు. రైతులకు మంచి ధరలకు ఆల్‌రెడీ డబ్బులు ముట్టేశాయి. పైగా ప్రభుత్వం యిచ్చే పెన్షన్ వస్తోంది. వాళ్లకు చింత లేదు. అమ్మకుండా వుంచేసుకున్న రైతులకు, అమ్ముకున్న రైతుల దగ్గర్నుంచి కొన్నవాళ్లకే టెన్షన్. వాళ్లందరికీ సెక్రటేరియట్ మాత్రమే కడతామంటే తృప్తి వుండదు. నవనగరాలూ కట్టాల్సిందే.

చంద్రబాబు మాటల్లో అమరావతి అంటే దేవతలు నివసించే నగరం. (తక్కిన నగరాల్లో ఉండేది రాక్షసులా? కెసియార్ మాటలను బాబు బలపరుస్తున్నట్లుంది) అక్కడ అల్లాటప్పాగాళ్లకు జాగా వుండదు. అందుకే పేదలకు స్థలాలు ఎలాట్ చేస్తే కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు అమరావతివాదులు. వాళ్ల పిటిషన్‌లో చూపించిన కారణం ఏమిటంటే – దీనివలన డెమోగ్రాఫిక్ యిమ్‌బాలన్స్ కలుగుతుందట. 

దీని అర్థం డిక్షనరీ ప్రకారం చూస్తే - The demographic composition refers to the proportion or number of people who can be identified according to a certain characteristic. The most common demographic categories that small business owners should gather include: Age, Gender, Race, Marital status, Number of children (if any), Occupation, Annual income, Education level, Living status.  

దీనిలో యిక్కడ వయసు, వైవాహిక జీవితం వగైరా తక్కిన పాయింట్లను లెక్కలోకి తీసుకోవలసిన పని లేదు. జాతి అంటే అందరూ తెలుగువాళ్లే. దాన్ని సంకుచితం చేసి జగన్‌లా కులం అనే అర్థం తీసుకున్నా అన్వయించదు. ఎందుకంటే కోటి మంది జనాభా వచ్చి పడతారని బాబు ఊదరగొట్టినపుడు వీళ్లంతా సై అన్నారు కదా. కోటిమంది అంటే నానా కులాలవారూ, నానా ప్రాంతాలవారూ వుంటారుగా. కానీ టిడిపిని యితర కులాలను వ్యతిరేకించే పార్టీగా చిత్రీకరించడానికి జగన్ కులప్రస్తావన తెచ్చారు. 

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దాన్ని ఖండిస్తూ రైతులు వేసిన పిటిషన్లలో డెమోగ్రాఫికల్ ఇంబాలెన్స్ అనే ప్రస్తావనే లేదన్నారు. రైతులు వేసిన దానిలో లేకపోతే ‘రైతుబాంధవులు’ వేసిన పిటిషన్లలో వుండి వుంటుంది. ఎందుకంటే జగన్ ప్రకటన తర్వాత లోకేశ్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పదానికి జగన్ పెడర్థం తీస్తున్నారని ఆరోపించారు తప్ప తమ పిటిషన్లో ఆ పదం లేదని చెప్పలేదు.

ఆ పదం వాడడం జరిగింది. ఏ అర్థంలో వాడారు? పై నున్న నిర్వచనంలో తీసుకోవడానికి మిగిలిననవి, ఆదాయం, జీవనశైలి మాత్రమే! ఇది ధనికులు మాత్రమే వుండవలసిన దేవనగరం. పేదలు కూడా నివసిస్తే దీని కళ తప్పిపోతుంది అని ఆ పిటిషనర్ల భావం అనుకోవాలి.  నిజానికి యీ వాదనా సరైనది కాదు. ఎందుకంటే బాబు కూడా అక్కడ జర్నలిస్టులకు, యితర వర్గాలకూ స్థలాలు కేటాయించారు. 

పేదల కోసం 8 వేల ఇళ్ల నిర్మిస్తామన్నారు. అప్పుడు రాని అభ్యంతరం యిప్పుడెందుకు వస్తోంది అంటే బాబు అలాటి కేటాయింపులు వాస్తవంగా అమలు చేయరన్న ధైర్యం వుందేమో! ఇప్పుడు అందరికంటె ముందు బలహీనవర్గాలే బిచాణా వేస్తే యిక తమ భూములకు విలువ ఏం పెరుగుతుంది? అనే ఆందోళన కలుగుతోందన్నమాట. ఇలాటి పరిస్థితుల్లో ఉండవల్లి చెప్పినట్లు చల్లగా ఒక్కోటి తరలించి దానికి డిమాండు తగ్గించేస్తూ వుంటే కళ్లప్పగించి చూస్తూ ఊరుకుంటారా?

ఉండవల్లి వాదనలో యింకో చిత్రమేమిటంటే, ఒక్కో డిపార్టుమెంటు తరలించేయాలట, కానీ హైకోర్టు మాత్రం తరలించకూడదట. సెక్రటేరియట్, హైకోర్టు కొన్ని రాష్ట్రాలలో వేర్వేరు చోట్ల వున్నాయని ఒప్పుకుంటూనే న్యాయరాజధాని అనే పదం గురించి అభ్యంతరం తెలిపారు. అసలు ఆ పదమే కొత్తగా కాయిన్ అయింది. ‘మాకూ ఓ రాజధాని వుంది’ అని అన్ని ప్రాంతాల వారికీ తోచేందుకు గాను చేసిన పదాల గారడీ అది. 

దాన్ని పక్కకు తీసి మాట్లాడితే హైకోర్టు రాయలసీమకు యివ్వడంలో బేసబబు ఏముందో ఉండవల్లే చెప్పాలి. కావాలంటే బెంచి పెట్టవచ్చు అంటున్నారు. ఆ బెంచీయో, కుర్చీయో అమరావతిలోనే పెట్టుకుని, కోర్టు రాయలసీమకు యివ్వవచ్చుగా! సెక్రటేరియట్‌ను, అసెంబ్లీని వేర్వేరు చోట్ల పెట్టాలనుకుంటే సెక్రటేరియట్‌ను అమరావతికి కేటాయించి అసెంబ్లీని వైజాగ్‌కు తరలించవచ్చని నా అభిప్రాయం. వైజాగ్‌లో యిప్పటికే చాలా వున్నాయి.

జగన్ దీన్ని పెద్ద వివాదంగా ఎందుకు మారుస్తున్నాడో తెలియటం లేదని ఉండవల్లి ఆశ్చర్యపడ్డారు. అన్నీ అమరావతిలో పెట్టి బాబు వివాదం రేపినట్లే, వికేంద్రీకరణ అంటూ జగన్ యింకో అనవసర వివాదం రేపాడని ఉండవల్లి భావన. అది నిజమే కానీ యిక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే బాబు రేపిన వివాదం వలన రాష్ట్రంలో తక్కిన ప్రాంతాలన్నీ అమరావతికి వ్యతిరేకమయ్యాయి. జగన్ రేపిన వివాదం వలన టిడిపి అమరావతికి పరిమితమౌతోంది. నిజానికి జగన్ టిడిపికి వేసిన ఉచ్చు అది. 

టిడిపి తెలివితక్కువగా ఆ ఉచ్చులో పడింది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం కూడా అలాటి ఉచ్చే. టిడిపి దాన్ని వ్యతిరేకించి బావుకున్నది ఏమీ లేదు. మేం కూడా ఇంగ్లీషు చదువుకుని పైకి వద్దామనుకుంటే బాబు సహించలేకపోతున్నాడు అనే భావం పేదల్లో నాటుకుంది. వాళ్ల పిల్లల్ని ఇంగ్లీషు మీడియానికి పంపి, మాకు మాత్రం తెలుగు మీడియం అనడం అన్యాయం కాదా అని వాళ్లు అనుకునే స్థితి వచ్చింది. 96 శాతం మంది పేద తలిదండ్రులు ఇంగ్లీషు మీడియం కావాలన్నారని యిక్కడ గ్రహించాలి.

అలాగే అమరావతి విషయంలో జగన్ టిడిపిని బోనులోకి లాగడం జరిగింది. టిడిపి కానీ, దాని అనుకూల మీడియా కానీ అమరావతి చుట్టూనే తిరుగుతోంది. ఏడాదిగా ఇంత చేసినా ‘అమరావతి కోసం భూములిచ్చిన వారి పోరాటాన్ని వారి సమస్యగానే మిగతా ప్రాంతాల ప్రజలు చూస్తున్నారు’ అని మొన్ననే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే రాశారు. టిడిపి అమరావతి ప్రాంతానికి మాత్రమే సంబంధించిన జిల్లా పార్టీ అయి వుంటే ఫర్వాలేదు కానీ రాష్ట్రమంతా వ్యాపించినది కాబట్టి, మొత్తమందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలి. 

నవనగరాలను 9 జిల్లాలకు పంచేయాలని, వాటిలో తమది కూడా వుండాలని అనుకునే జిల్లాల వారిని కూడా పట్టించుకోవాలి. అమరావతి జపం చేయడం వలన తక్కిన ప్రాంతాలలో తాము ఎంత కోల్పోతున్నామో టిడిపి గ్రహించటం లేదు. రాధాకృష్ణ రైతుల సమస్యగానే... అని ఆపేశారు కానీ మిగతా ప్రాంతాల ప్రజలు దానిని ప్రధానంగా పెట్టుబడిదారుల సమస్యగా చూస్తున్నారనే సంగతి రాయలేదు. ఆ పెట్టుబడిదారులందరూ బాబు కులస్తులని ముద్ర కొట్టడం సరికాదు కానీ బాబు సమర్థకులు, బాబు నిర్మాణసామర్థ్యంపై నమ్మకం వున్నవారు అనడానికి సంశయించ వలసిన పని లేదు. 

ఆ నమ్మకాన్ని దెబ్బ కొట్టడానికే జగన్ సమకట్టాడన్నది నిరాకరించలేని వాస్తవం. బాబు మళ్లీ అధికారంలోకి వచ్చినా, ఫలానాది చేసి చూపిస్తానన్నా జనం నమ్మని పరిస్థితి కల్పిస్తున్నాడు. ఆ పరిస్థితి రాకూడదన్న తాపత్రయంతో టిడిపి కోర్టుల ద్వారా జగన్‌కు అడ్డంకులు సృష్టిస్తోంది. దానివలన జగన్‌కు ఏదైనా నష్టం కలుగుతోందా? ఇమేజి పరంగా కలుగుతోందని చెప్పాలి కానీ రాజకీయపరంగా కలుగుతుందని చెప్పలేము. లీగల్ నైసిటీస్ సాధారణ ప్రజలకు పట్టవు. ఈయనేదో మనకు చేద్దామనుకుంటూంటే, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అనే అభిప్రాయంలో వాళ్లలో కలుగుతూంటుంది. 

కాంగ్రెసంటే జనాలకు మొహం మొత్తిన టైములో ఇందిరా గాంధీ ప్రధాని అయింది. కాంగ్రెసుకు వేరే ప్రతిపక్షం అక్కరలేకుండా తనే ప్రతిపక్షంగా మారి, పాత కాంగ్రెసు వేరు, నా పంథా వేరు అని ప్రజలను నమ్మించడానికి సోషలిస్టు విధానాలు అమలు చేసి, ప్రజలకు నిధులందేట్లా చేసింది. దాంతో కాంగ్రెసులో పాత నాయకులు ఆమెకు రకరకాల అడ్డంకులు కల్పించి, గోల చేశారు. సామాన్యప్రజలు ఇందిరను తమ మనిషిగా భావించి, పాత కాంగ్రెసు నాయకులను అసహ్యించుకున్నారు. 1977లో ఓడిపోయినా మూడేళ్లలోనే మళ్లీ అధికారంలోకి రావడానికి ఇందిరకు యీ యిమేజే దోహదపడింది.

ఎన్టీయార్ విషయంలోనూ అంతే. వస్తూనే ఎన్నో పథకాలు, ఏవేవో పేర్లు. పేదవాడే నా దేవుడంటూ నినాదాలు. ఇందిర అనుయాయులైన కాంగ్రెసు వాళ్లు కోర్టులకు వెళ్లి అడ్డుకునేవారు. ఇలా అయితే రాష్ట్ర ఆర్థికవ్యవస్థ సర్వనాశనమై పోతుందంటూ పత్రికల్లో వ్యాసాలు గుప్పించేవారు, మేధావులు వేదికలపై హెచ్చరించేవారు. కానీ పేదలు వినలేదు. ఈయన మనకోసం ఏదో చేస్తుంటే కాంగ్రెసు సైంధవుడిలా అడ్డుపడుతోంది అనుకుని మళ్లీమళ్లీ గెలిపించారు. ఇప్పుడు జగన్ విధానాలను అడ్డుకుని టిడిపి కూడా యిలాటి పేరే తెచ్చుకుంటోందని నా అభిప్రాయం. 

జగన్ టిడిపిని రెచ్చగొట్టి అమరావతి ఊబిలోకి పడదోశాడని నా పరిశీలన. అమరావతి గురించి టిడిపి మాట్లాడిన కొద్దీ ‘వాళ్ల పెట్టుబడుల గురించే యీ ఆరాటమంతా..’ అనే మాట వినబడుతోంది. నా ఉద్దేశంలో టిడిపి అమరావతి ఉద్యమం నుంచి బయటకు రావాలి. అమరావతి కీర్తనలు ఆపాలి. మా హయాంలో చేయగలిగినది చేశాం, తర్వాతి వాళ్లు వచ్చి మార్చేస్తే మేమేం చేయగలం? అనేసి ఊరుకోవాలి. ఇప్పటికైనా తక్కిన ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. తిరుపతి ఉపయెన్నికలలో నెగ్గాలన్నా రాయలసీమకు అనుకూలంగా మాట్లాడాలి. ‘రాయలసీమ రౌడీయిజం’ వంటి మాటలు మానుకోవాలి. 

అంతిమంగా మూడో వంతు రాజధాని వచ్చినా రాకపోయినా వైజాగ్ పెద్ద సిటీగా ఎదగబోతోంది. అక్కడకి పెట్టుబడులు రావచ్చు, జనాభా, మరోలా చెప్పాలంటే ఓటర్లు, పెరగవచ్చు. వైజాగ్‌కు తరలించడాన్ని ఎదుర్కుంటాం అనే లైను తీసుకుని అక్కడి ఓటర్ల ఆదరణ కోల్పోవడం అవివేకం. ఇక ఉద్యమకారుల మాటకు వస్తే – నా గత వ్యాసం చదివి కొందరు బాబు ఒక్కడే అన్యాయం చేశాడా? జగన్ అన్యాయం చేయలేదా? అని అడిగారు. జగనూ చేశాడు కానీ అధికారంలో యిప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఉద్యమకారులు ఆయనతోనే డీల్ చేయాలని నేను రాశాను. 

ఫ్యాక్టరీ యాజమాన్యం చేతులు మారింది. వర్కర్లకు డిమాండ్లు వున్నాయి. వాళ్ల యూనియన్ ఎవరితో సంప్రదింపులు జరపాలి? కొత్త మేనేజ్‌మెంట్‌తోనే కదా! నిన్ను నమ్మను, పాత మేనేజ్‌మెంట్‌తోనే ఊరేగుతాను అంటే అయితే మీ ఖర్మ అని వదిలేస్తారు కొత్త ఓనర్లు. పాత ఓనరు ఎంత జాలి ఒలకపోసినా ఏమీ చేయలేడు. వాళ్లు ఆశించిన స్థాయిలో కాకపోయినా రైతులకు ఎంతో కొంత దక్కాల్సిందే, అది యివ్వవలసినది ప్రభుత్వమే. వీళ్లు అడగవలసినది ప్రభుత్వాన్నే! ఆ గ్రహింపు ఉద్యమనాయకులకు రావటం లేదనేదే నా బాధ.

టిడిపి, అమరావతి ఉద్యమం విడాకులు తీసుకుని ఎవరి మానాన వారు పోరాడితేనే ఉభయులకూ కుశలమని నా ఉద్దేశం. టిడిపి తక్కిన ప్రాంతాలకూ విస్తరించాలి. లేకపోతే బిజెపి ఆ మేరకు ఖాళీ భర్తీ చేద్దామని చూస్తుంది. దానికి జగన్ పరోక్షసహకారం కూడా వుండవచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండు పార్టీలు, కాంగ్రెసు, టిడిపిలలో ఒకటి సర్వనాశనమై పోయింది. కానీ ఐదేళ్ల అధ్వాన్న పరిపాలన తర్వాత కూడా 2019లో టిడిపికి 39 శాతం ఓటింగు వుంది. బాబు పొరపాటు విధానాలు, లోకేశ్ ఎక్కిరాకపోవడం వలన టిడిపి భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. ఇదే అదనుగా బిజెపి సాయంతో టిడిపిని దివాళా తీయించాలని జగన్ ఆలోచన. భవిష్యత్తు కోసం టిడిపి క్యాడర్ తమతో వచ్చి చేరుతుందని బిజెపి ఆశ.

అమరావతివాదుల విషయానికి వస్తే – బిజెపిపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం తెలివైన పని కాదు. టిడిపి అనుభవం చూశాక, బిజెపి మరీ లోతుగా దిగదు. పైపైన కబుర్లు చెపుతుందంతే. ముఖ్యంగా రాయలసీమలో బిజెపికి ఎదగడానికి ఛాన్సుంది. టిడిపి రాయలసీమలో చాలా పోగొట్టుకోవడం చేత వైసిపికి ఎదురు లేకుండా వుంది. వైసిపి చేసిన తప్పులు ఎత్తి చూపుతూ ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం బిజెపికి రాయలసీమలో బాగా వుంది. అలాటప్పుడు కర్నూలుకి హైకోర్టు కూడా అక్కరలేదు, నవనగరాలూ అమరావతిలోనే పెట్టాలి అనే లైను బిజెపి ఎన్నిటికీ తీసుకోదు. గతంలో కాంగ్రెసు నాయకుల్లా యిప్పటి బిజెపి నాయకులు తలొకరూ తలో మాటా మాట్లాడుతున్నారు.

అందువలన అమరావతివాదులు వైసిపితోనే బేరసారాలు మొదలెడితే మంచిదని నా అభిప్రాయం. ఈలోగా ఉండవల్లి వంటి వాళ్లు వచ్చి కోర్టుకి వెళితే మీకు ఎకరానికి కోటి రూపాయలు వస్తాయని చెప్పిన మాటలు నమ్మి యీ మార్గం మూసేసుకుంటే తిప్పలు తప్పవు. ‘కాస్త ఎగ్రిమెంటు ఓసారి చదివి సాధ్యాసాధ్యాలు చెప్పండి మహానుభావా!’ అని వారు ఉండవల్లిని కోరి వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. 

ఎందుకంటే రాష్ట్రవిభజన అడ్డుకుంటామంటూ ఆయన వేసిన కేసు సుప్రీం కోర్డులో నలుగుతూనే వుంది. పార్లమెంటులో అక్రమం జరిగిందని, విభజన చట్టమే చెల్లదని ఆయన చేస్తున్న వాదనలు కోర్టు వారు ఔననలేదు, కాదన లేదు. ఇవతల రెండు రాష్ట్రాలు విడిపోయి వేటి తంటాలు అవి పడుతున్నాయి. ఇలాటి కోర్టు వ్యవహారాలపై భ్రమలు కల్పించడం మరో భ్రమరావతే అవుతుంది.

ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

Show comments