ఫిల్మ్ సిటీ ప్రతిపాదన వుందా?

కొద్ది వారాల క్రితం ఎప్పటి మాదిరిగానే మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి వచ్చారు. వరద బాధితుల సహాయం కోసం చెక్ లను అందించి వచ్చారు. ఆ సమయంలో కేసిఆర్ ఏమన్నారు అన్నది అధికారిక ప్రకటన అయితే రాలేదు.

కానీ ఉన్నట్లుండి సినిమా మీడియా గ్రూపుల్లో, 'ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ' ని రెండు వేల ఎకరాల్లో ప్రభుత్వం నిర్మిస్తుందని, విదేశాల్లోని స్టూడియోలను ఈ విషయంలో అధికారులు పరిశీలిస్తారని, కేసిఆర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అప్పట్లోనే ఇది అధికారిక వార్తలేనా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే అన్ని దినపత్రికలు ఈవార్తలు ప్రచురించడంతో కచ్చితంగా ఇండస్ట్రీ జనాలు హ్యాపీగా ఫీలయ్యారు. 

అయితే మళ్లీ నిన్న అదే వార్త మీద చర్చలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే నిన్న కూడా మరోసారి మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, మరి కొందరు సినిమా పెద్దలతో కలిసి వెళ్లి సిఎమ్ కేసిఆర్ ను కలిసారు.

సినిమా పరిశ్రమకు రాయతీలు, మినహాయింపులు ఇస్తామనీ, ఇవన్ని జిహెచ్ఎంసి ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరుస్తామని సిఎమ్ కేసిఆర్ అన్నారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లో వున్న చిత్ర పరిశ్రమను కాపాడుకుంటామన్నారు. అయితే ఈసారి మాత్రం ఫిలిం సిటీ గురించి అప్ డేట్ లేదు.

బహుశా ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయం వుంటుందని అనుకోవాల్సి వుంటుంది. గతంలో ఫిలిం సిటీ వార్తలు వచ్చినపుడు అవి నిజమైన వార్తలా? కావా?అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసారు.

ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే వార్తల్లో సగం నిజం కానివే వుంటాయనే ఉద్దేశం సర్వత్రా వుంది కనుక. మేనిఫెస్టోలో కనుక ఫిల్మ్ సిటీ ప్రతిపాదన వుంటే ఇండస్ట్రీకి శుభవార్తే. ఇప్పటికే బాలీవుడ్, ఓటిటి యూనిట్ లో తమ ప్రొడక్షన్ కోసం హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు ఫిల్మ్ సిటీ కనుక వస్తే అది ఇంకా అనుకూలం అవుతుంది.

నిమ్మగడ్డకు నిఖార్సైన ప్రశ్న

Show comments