ఏపీతో తెలంగాణకు ఎందుకీ పంతం..?

రాష్ట్ర విభజన సమయంలోనే.. అన్నీ సర్దుబాటు అయ్యాయి కానీ, ఏపీఎస్ఆర్టీసీ వ్యవహారం మాత్రం చాన్నాళ్లు నలిగింది. ఆస్తులు, అప్పుల పంపకాల సమయంలో తకరారుని ఏదోరకంగా సర్దుబాటు చేసుకున్నారు కానీ, ఆ తర్వాత కూడా ఏపీఎస్ఆర్టీసీపై తెలంగాణ ఆర్టీసీకి కోపం పోలేదు. ఏపీ బస్సులు తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నాయంటూ గొడవ మొదలైంది. 

లాభాలన్నీ ఏపీకే వెళ్తున్నాయని, తెలంగాణ ఆర్టీసీకి అంతర్ రాష్ట్ర సర్వీసుల వల్ల నష్టం వస్తుందనేది వారి వాదన. పోనీ సమానంగా బస్సు సర్వీసులు నడుపుదాం, కిలోమీటర్ల విషయంలో కూడా సమన్యాయం పాటస్తామంటూ ఏపీ ముందుకొచ్చినా తెలంగాణ వారికి అది గిట్టుబాటు కాలేదు.

ఇప్పుడు కరోనా సీజన్లో తెలంగాణ మరీ గట్టిగా నిలబడింది. అన్ లాక్ సడలింపులతో ఎక్కడికక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు తిరుగుతున్నా.. ఏపీ, తెలంగాణ సర్వీసులు ఇంకా మొదలు కాలేదు. ఏపీ నుంచి తమిళనాడుకి, కర్నాటకకు బస్సులు వెళ్తున్నాయి. తెలంగాణ కూడా కర్నాటక, మహారాష్ట్ర సర్వీసులు ప్రారంభించింది. విచిత్రంగా ఏపీ, తెలంగాణ మధ్య మాత్రం బస్సులు నడవడం లేదు. పలు దఫాలు అధికారుల స్థాయిలో చర్చలు జరిగినా ఫలితం లేదు.

దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు, ట్రావెల్స్ సర్వీసులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వ్యక్తిగత వాహనాలున్నవారి పరిస్థితి పర్వాలేదు కానీ, పేద-మధ్యతరగతి వారు మాత్రం నలిగిపోతున్నారు. ఈ దోపిడీని కట్టడి చేయాలని ఏపీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సర్వీసులు సమంగా నడుపుదాం, కిలోమీటర్ల విషయంలో కూడా నియమాలు పాటిద్దామని ప్రతిపాదించినా తెలంగాణ ఆర్టీసీకి అది రుచించడం లేదు.

ఉదాహరణకు కర్నూలు-హైదరాబాద్ సర్వీసు తీసుకుంటే.. ఆ బస్సు 90శాతం తెలంగాణలో తిరుగుతుంది, కేవలం 10శాతం మాత్రమే ఏపీలో తిరుగుతుంది. రెండు రాష్ట్రాలు ఈ సర్వీసు నడిపితే.. ఏపీకి తెలంగాణ నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ. అదే సమయంలో తెలంగాణకు ఏపీ నుంచి వచ్చే ఆదాయం తక్కువ. గుంటూరు-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ సర్వీసులది కూడా ఇదే సమస్య.

పోనీ కిలోమీటర్ల ప్రకారం నడపాలనుకున్నా.. తెలంగాణ బస్సులు ఏపీలో ఎక్కువగా తిరిగే అకాశమే లేదు. అందుకే ఈ విషయంలో రాజీ కుదరడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడుపుతున్నా ఏపీకి మాత్రం బస్సుల్ని పంపడంలేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ పంతానికి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పెద్దలైనా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే సామరస్య పరిష్కారం సాధ్యమవుతుంది. 

పవన్, బాబు ఒకరికి ఒకరు

అందరూ కలిసి బైటకి పంపేశారు

Show comments