హే మళ్లీ ఏసేశాడు.. పవన్ చాతుర్మాస దీక్ష

ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆ బాధతో 11 రోజుల పాటు అన్నం తినలేదని చెప్పి గతంలో ట్రోలింగ్ కి గురయ్యారు పవన్ కల్యాణ్. "ఒకటికాదు, రెండుకాదు, 11రోజులు నేను భోజనం మానేశా.. ఇప్పటి వరకూ మీకా విషయం చెప్పలేదు".. అంటూ ఓ బహిరంగ సభలో పవన్ చెప్పిన డైలాగులు ఇప్పటికీ మీమ్స్ లో కనిపిస్తుంటాయి. 11 రోజులు భోజనం మానేశా అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్లు కూడా ఉన్నాయంటే.. అప్పట్లో పవన్ ని ఏ రేంజ్ లో ఆడుకున్నారో అర్థమవుతుంది. మళ్లీ ఇప్పుడు పవన్ నుంచి ఇంకో చమక్కు బైటకొచ్చింది.

ఏకాదశి సందర్భంగా పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష ప్రారంభించారట. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, దాన్ని ఎవరూ కాదనరు. అయితే పవన్ కల్యాణ్ దీక్షఎందుకోసం చేస్తున్నారనే విషయమే మరోసారి టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారింది. తెలుగు ప్రజల ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు కాంక్షిస్తూ పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష ప్రారంభించారని పార్టీ తరపున ప్రకటన విడుదలైంది. ఇంతకంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా?

కరోనా టైమ్ లో కనీసం బైటకొచ్చి నేరుగా సహాయక చర్యల్లో పాల్గొనలేని పవన్ కల్యాణ్ నాలుగు నెలల పాటు తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం దీక్ష చేస్తారట. చాతుర్మాస దీక్షలో పవన్ ఏంచేస్తారో, దానివల్ల తెలుగు ప్రజలకు ఎలాంటి మేలు కలుగుతుందో కూడా వివరిస్తే ఇంకా బాగుండేదంటూ అప్పుడే ట్రోలింగ్ లు మొదలయ్యాయి.

గతంలో 11 రోజుల నిరాహార దీక్ష లాంటిదేనా ఈ చాతుర్మాస దీక్ష అని కూడా కామెంట్లు పడుతున్నాయి. అసలిప్పటికిప్పుడు పవన్ కల్యాణ్ కి దీక్షలతో ఏంపని వచ్చింది. ఉపవాస దీక్షలతో హైలెట్ కావడం ఇప్పటి వరకూ ప్రధాని మోడీకే చెల్లింది. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇలా సెంటిమెంట్లు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఓ వర్గం మండిపడుతోంది. 

చాతుర్మాస దీక్ష వ్యవహారాన్ని బైటపెట్టడంతో అనుకోకుండా 11రోజుల ఉపవాసం కామెడీ కూడా అందరికీ గుర్తొస్తోంది. అలా అనుకోకుండా మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు జనసేనాని. నిజంగా ఈ దీక్ష ఐడియా పవన్ కల్యాణ్ దేనా లేక కొత్త మిత్రుడు బీజేపీ సూచన మేరకు పవన్ దీక్ష బాట పట్టారా అనేది తేలాల్సి ఉంది.

కొత్త హీరోలని తొక్కేయ్యడం తప్పేమీకాదు

ఇకనుంచి డాక్టరే ప్రతి ఇంటికీ వస్తాడు

Show comments