తెలంగాణ బరిలో శివసేన, ఎన్సీపీ!

తెలంగాణ రాజకీయంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలే కాదు.. కొన్ని పక్కరాష్ట్రాల పార్టీలు కూడా జెండాలు ఎగరేస్తూ ఉంటాయి. రెబల్స్ రాజకీయం ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో చరిత్రలో ఇదివరకూ ఏవేవో పార్టీలు విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి. వాటికంటూ ఇక్కడ పెద్దగా క్యాడర్ కానీ, ఉనికి కానీ ఉండదు. అయితే ఆ పార్టీల గుర్తుల మీద కొంతమంది విజయం సాధించిన చరిత్ర ఉంది. ఇలాంటి వారు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు.

తెలుగు రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదని సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల తరఫున తెలంగాణలో గతంలో నెగ్గిన వారున్నారు. ఒకానొక దశలో డీకే అరుణ కూడా సమాజ్ వాదీ పార్టీ తరఫున నెగ్గిన వ్యక్తే. లక్నో నుంచి ఆమె బీఫారం తెచ్చుకుని తెలంగాణలో ఎస్పీ తరఫున నెగ్గారు. అనంతరం కాంగ్రెస్ లో చేరిపోయారనుకోండి.

గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఎస్పీ గుర్తు మీద, బీఎస్పీ బీఫారాలతో తెలంగాణలో కొంతమంది విజయాలను నమోదు చేయగలిగారు. అలాగని మాయావతి వచ్చి వారిని గెలిపించలేదు. ఎన్నికల తర్వాత వాళ్లు తెరాస వైపు వెళ్లిపోయారు. ఇలాంటి రాజకీయం ఇప్పుడూ సాగుతోంది.

అందుకే ఇప్పుడు తెలంగాణలో శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీల తరఫున గట్టిగానే నామినేషన్లు పడ్డాయి. ఇలా పోటీచేసిన వాళ్లంతా సదరు పార్టీల్లో పనిచేసిన వారు కాదు. కాంగ్రెస్ తరఫు నుంచినో, తెరాస తరఫు నుంచినో గట్టిగా టికెట్లను ఆశించారు. అవి దక్కలేదు. దీంతో రెబల్స్ గా రంగంలోకి దిగారు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే పరిమితులు ఎక్కువ అవుతాయి.

అందుకే వీళ్లు శివసేన, ఎన్సీపీ, బీఎస్పీల బీఫారాలను సంపాదించారు. దీంతో ఆ పార్టీలు తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచినట్టుగా అవుతుంది. అయితే వాటి అధినాయకత్వాలకు మాత్రం ఈ ఎన్నికలతో సంబంధం ఏమీ ఉండదు. మరి బీఫారాలను అమ్ముకుంటారో ఏమో!

ఆసక్తిదాయకంగా 'పోల్‌ తెలంగాణ'... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments