బాబుపై జాతీయ పార్టీల పెదవి విరుపు అందుకే!

ఏ కాంగ్రెస్ అధిష్టానాన్ని అయితే దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బహిరంగంగా, అనేక రకాలుగా విమర్శిస్తూ వచ్చిందో అదే అధిష్టానం ఇంటిముందు చంద్రబాబు తన మందీ మార్బలాన్ని తీసుకెళ్లి నిలబడ్డాడు. ఏ గాంధీలను కలవడానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వెళ్తుంటే తెలుగుదేశం అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి అవమానం అంటూ చెబుతూ వచ్చిందో అదే గాంధీల ముందు తెలుగుదేశం అధినేత చేతులు కట్టుకు నిలబడ్డాడు. ఇదంతా వ్యూహం అని చంద్రబాబు అనుకున్నాడు. బాబు మాటలను ఆయన ఫాలోయర్లు కూడా నమ్మేశారు. నమ్మక తప్పని స్థితి.

జనాలు ఎలాగూ బాబు పచ్చి అవకాశవాది అనుకుని ఊరుకున్నారనుకోండి. లేకపోతే మొన్నటి వరకూ ఏపీకి రాహుల్ వస్తే విమర్శించిన చంద్రబాబు, మేం ఏడుస్తుంటే చూడటానికి వచ్చాడా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు.. అదే రాహుల్ ను కలిసి.. కాంగ్రెస్ ఏపీని ఇకపై ఉద్ధరించేస్తుంది అని చెబితే నమ్మేయడానికి జనాలేమీ చెవుల్లో పూలు పెట్టుకుని లేరు కదా!

ఇక ఇంతకీ చంద్రబాబు విషయంలో వివిధ పార్టీలు ఏమనుకుంటున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమిలో బాబు ప్రమేయం గురించి వాటి స్పందన ఏమిటి అనే అంశం గురించి ఒక జాతీయ మీడియా సంస్థ ఆసక్తిదాయకమైన విశ్లేషణ చేసింది.

చంద్రబాబు అడుగులను గమనిస్తున్న పార్టీలు బాబు విషయంలో మరీ అంత ఎగ్జయిటింగ్ గా లేవని సదరు మీడియా సంస్థ అభిప్రాయపడింది. అది కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముందు మరీ సాగిలా పడిపోవడం, రాహుల్ ను దేశానికి నాయకుడు అనేంతలా కీర్తించేయడం పట్ల మిగతా పార్టీలు అంత సానుకూలంగా లేవని సమాచారం.

బీజేపీ వ్యతిరేకమే.. అలాగని ఆ పార్టీలు కాంగ్రెస్ ను పూర్తిగా నమ్మలేకపోతున్నాయి, కాంగ్రెస్ మీద ఆధారపడటం లేదు. రాహుల్ ను నాయకుడిగా చూడటంలేదు. నాలుగేళ్ల నుంచి కాంగ్రెస్ తో కలిసే సాగుతున్నా ఆ పార్టీలు కాంగ్రెస్సే పెద్దన్న, కాంగ్రెస్ పార్టీనే కూటమికి చుక్కాని అనే భరోసాకు రావడంలేదు. ప్రత్యేకించి వాళ్లెవరికీ రాహుల్ మీద అంత నమ్మకంలేదు!

అయితే చంద్రబాబు మాత్రం.. మొన్నటివరకూ బీజేపీని ఎలా మోశాడో.. బీజేపీ విషయంలో ఏపీ జనాలకు ఎలాంటి కహానీలు చెప్పాడో..ఇప్పుడు కాంగ్రెస్ గురించి అవే మాటలే చెబుతున్నాడు. గమనించాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే.. బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలు ఎవ్వరూ ఇంతవరకూ రాహుల్ ఇంటికి వెళ్లలేదు.

రాహుల్ ఇంటికి వెళ్లి ఆయనకు పూలబొకేలు ఇచ్చి శాలువాలు వేసేంత స్థాయికి ఎవరూ దిగజారలేదు. రాహుల్ కు అంత సీన్ లేదన్నట్టుగానే.. అన్ని పార్టీలూ ఉన్నాయి. అయితే సాగిలాపడితే ఈ విషయంలో తనకు పోటీలేదన్నట్టుగా బాబు వ్యవహరించేశాడు.

రాహుల్ ను బచ్చాగా చూస్తున్నాయి బీజేపీ వ్యతిరేక పార్టీలు. ఎందుకంటే అతడి ట్రాక్ రికార్డు అలా ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడ అవకాశం చేజారుతుందో అన్నట్టుగా.. ఏ పార్టీ అధినేతా తొక్కని స్థాయిలో రాహుల్ ఇంటికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు.

బాబు మరీ ఇలా జారిపోతుంటే.. ఈయనను కాంగ్రెస్ వ్యతిరేక ట్రూపులోని పార్టీలు సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ మీడియా వర్గం పేర్కొంది. ఈ మీడియా సంస్థ మరెవరిదో కాదు.. బాబుకు అత్యంత సన్నిహితుడు అయిన ముఖేష్ అంబానీ పెట్టుబడులు భారీగా ఉన్న సంస్థ. అదే ఈ విశ్లేషణ చేసింది.

ఆ పార్టీలన్నీ ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంరతం రాహుల్ గురించి, కాంగ్రెస్ గురించి ఒక అభిప్రాయానికి వద్దామని అనుకుంటుంబే.. బాబు మాత్రం మరీ కొత్త బిచ్చగాడులా వ్యవహరించాడని సదరు మీడియా వర్గం అభిప్రాయపడింది.

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్