వీక్ చేసింది ఎవరు? వీక్ ఎవరు?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో ఉన్న మర్మం గురించి, రెండు రోజుల తర్వాత జరుగుతున్న చిన్న సమీక్ష ఇది. తన మనసులో ఉన్న భావనను సూటిగా, స్పష్టంగా బయటకు చెప్పలేకుండా, లౌక్యంగా వెల్లడిస్తూ మూస రాజకీయ నాయకుల ధోరణిలోకే క్రమంగా పవన్ కూడా చేరుకుంటున్నారా? అనే ప్రచారం ప్రజల్లో బలపడుతున్న మాట వాస్తవం. ఒక్క అంశంలో ఆయన చెప్పిన మాటలు ఈ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగానే ఉన్నాయి.

ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించడానికి హీరో పవన్ కల్యాణ్ తన రెండు రోజుల అమూల్యమైన సమయాన్ని కేటాయించి... విశాఖ, అమరావతిల్లో తిరగడం భేటీలు కావడం చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే... సినిమావాళ్లంటేనే.. తమ సమయానికి కాల్షీట్ల రూపంలో విలువ కడుతుంటారు. ఆ లెక్కన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్లను గణిస్తే.. ఆయన ఒకరోజు విలువ పదిలక్షల రూపాయలకు పైమాటగానే ఉంటుంది. ఇలాంటి సమయాన్ని రెండు రోజులు కేటాయించడం చిన్న సంగతికాదు. అందుకు ఆయనకు అభినందనలు చెప్పాల్సిందే.

ఈ రెండు రోజుల ఎపిసోడ్ కు క్లయిమాక్స్ గా పవన్ చిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు వెల్లడించారు. పనిలో పనిగా.. ప్రత్యేకహోదా అంశంపై పోరాటాన్ని గురించి కూడా ప్రస్తావించారు. ప్రత్యేక హోదా అనే అంశాన్ని అందరూ కలిసి వీక్ చేసేశారు.. అని జనాంతికంగా ఒకమాట వాడేశారు. నిజానికి సదరు ప్రెస్ మీట్ ఆ అంశానికి సంబంధించింది కాదు గనుక.. ఎవ్వరూ లోతుల్లోకి వెళ్లలేదు. కానీ నిజానికి ప్రత్యేకహోదా అంశాన్ని వీక్ చేసింది ఎవరు? అని ఆయన తేల్చి చెప్పి ఉండాలి. వారి పట్ల తాను ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నానో కూడా చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే.. ఏపీలో ఉన్న పార్టీల్లో తెలుగుదేశం, వైకాపా మాత్రమే బలంగా ఉన్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని విడవకుండా పట్టుకుని ఇప్పటికీ ప్రతి సందర్భంలోనూ దాని ప్రస్తావన తెస్తూ, పార్లమెంటులో దాన్ని లేవనెత్తుతూ ఏదో ఒక ప్రయత్న చేస్తూనే ఉంది. ఇక కాంగ్రెస్, వామపక్షాలకు రాష్ట్రంలో చెప్పుకోదగ్గ బలం లేకపోయినప్పటికీ.. వారు ఏదో తమవంతు ప్రయత్నంగా పదేపదే ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు అంటూ హడావిడి చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో వామపక్షాల ప్రతినిధులు పవన్ కల్యాణ్ ను కలిసి, పోరాటంలోకి ఆహ్వానించారు కూడా! ఒక్క తెలుగుదేశం, హోదావిషయంలో అసలు వంచనకు పాల్పడిన భారతీయ జనతా పార్టీకి చెందిన వారు తప్ప.. అందరూ హోదా కోసం తాము చేయగలిగినదెల్లా చేశారు.

మరి  అలాంటి నేపథ్యంలో అందరూ కలిసి హోదా కోసం జరిగే ఉద్యమాన్ని వీక్ చేసేశారు అని పవన్ స్టేట్ మెంట్ ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటి? ‘‘జగన్ గట్టిగా అడగలేకపోవడానికి ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి, చంద్రబాబు గట్టిగా అడగలేకపోవడానికి నిధులు రావంటూ ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి..’’ అంటూ పవన్ ఇండైరక్టు వ్యాఖ్యలు చేశారు. కానీ వాస్తవంలో జగన్ విపక్షాల్లో ఉన్న నాయకుడిగా అంతకంటె ఏం పోరాడగలరు. ఒకవేళ జగన్ మీద నమ్మకం లేకపోతే గనుక.. కనీసం కాంగ్రెస్, వామపక్షాల పోరాటాలతో అయినా పవన్ కల్యాణ్ చేయికలిపి హోదా ఉద్యమాన్ని  మరో లెవెల్ కు తీసుకువెళ్లి ఉండొచ్చు కదా.? వారి మీద  కూడా పవన్ కు అనుమానాలు ఉన్నాయా?

హోదా గొప్పదేమీ కాదు.. దానికి మించిన ప్యాకేజీ సాధిస్తున్నాం అంటూ బడాయిలు చెప్పుకుంటూ సాంతం ఈ అంశాన్ని చల్లార్చేసిన పాపం పూర్తిగా తెలుగుదేశానిది. దీన్ని వీక్ చేసేసింది వారు మాత్రమే. అయితే వారి మీద మాత్రమే నింద వేయలేని వీక్ నాయకుడు పవన్ కల్యాణ్. వీక్ చేసిన పాపం వారొక్కరిదీ అయితే, ఆ పాపాన్ని అందరికీ పంచేయడం ద్వారా పవన్ తన వీక్ నెస్ ను తానే బయటపెట్టుకున్నట్లుగా అయింది. 

Show comments