రోగ్ ను ఎత్తడం కష్టం బాసూ

ఒక్కోసారి చేసిన తప్పులు అంతకు అంతై ఒకేసారి ఇబ్బంది పెడుతుంటాయి. దర్శకుడు పూరిజగన్నాధ్ లేటెస్ట్ మూవీ రోగ్ సంగతి ఇలాగే వుంది. దాన్ని తెలుగులో మార్కెట్ చేయడానికి కిందా మీదా అవుతున్నారు. టెంపర్ తరువాత ఇంత వరకు పూరిజగన్నాధ్ స్కోర్ చేసింది లేదు. ఎంత హడావుడి చేసినా, విడుదల తరువాత విషయం బయటపడిపోవడం అన్నది కామన్ అయిపోయింది.

అందుకే రోగ్ గురించి పూరిజగన్నాధ్ ఎంత కిందా మీదా పడుతున్నా కూడా రావాల్సిన బజ్ రావడం లేదు. ఆఖరికి ఈ సినిమా విడుదలకు ముందే బాలయ్య బాబు సినిమాకు కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. అలాగే భారీగా బెంగళూరులో అడియో ఫంక్షన్ చేయిస్తున్నారు. 

అయితే ఇండస్డ్రీ ఇన్ సైడ్ వర్గాల గుసగుసల సారాంశం వేరుగా వుంది. రోగ్ సినిమాకు రిపేర్లు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నించారని, ఆఖరికి ఎప్పటికైనా విడుదల చేయాల్సిందే కదా అని ఇప్పుడు రెడీ చేస్తున్నారన్నది ఆ గుసగుసల సారాంశం. ఇలాంటి గుసగుసల వల్ల రోగ్ కు ఏమాత్రం క్రేజ్ వస్తుందా అనుకున్నది కూడా తగ్గుతోంది.

Show comments