తెలంగాణ ఎన్నికలు.. సినిమా వాళ్లు గప్ చుప్!

తెలంగాణ రాజకీయ నేతల సరసన తరచూ కనిపించేవాళ్లు సినిమా వాళ్లు. రాజకీయ నేతలతో సన్నిహితంగా మెలగడం సినిమా వాళ్లకు తెలుగునాట కొత్త ఏమీ కాదు. తెలుగు రాజకీయాలకూ, సినిమా వాళ్లకు ఉన్న అభినాభావ సంబంధం ఎంతో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా సినిమా వాళ్లు హైదరాబాద్ కే పరిమితం కావడం, సినిమా వాళ్ల ప్రయోజనాలకు కేసీఆర్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం గత నాలుగున్నరేళ్లలో జరిగింది.

తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రత్యేకరాష్ట్రం వస్తే సినిమా వాళ్లను తరిమేస్తాం అన్నట్టుగా తెలంగాణ వాదులు మాట్లాడారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాకా మాత్రం వారి తీరు పూర్తిగా మారిపోయింది. ఇక తెలంగాణ ప్రభుత్వంతో సినిమా వాళ్లు చాలా సాన్నిహిత్యాన్నే నెరిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్ కు పిలుపును ఇచ్చినా సినిమా వాళ్లు స్పందిస్తూ వచ్చారు.

చెత్త ఊడ్చడం, చెట్లు నాటడం వంటి కార్యక్రమాల్లో అయితే యాథశక్తిని హీరోలు, హీరోయిన్లు చాలా కష్టమే పడ్డారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో వేదికలను పంచుకోవడంలో కూడా తెలుగు సినిమా వాళ్లు ముందున్నారనే సంగతి చెప్పనక్కర్లేదు.

స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్ లతో మొదలుకుని.. సినీ ప్రముఖ నిర్మాతలు, గ్లామరస్ హీరోయిన్లు..ఇలా వీళ్లంతా కేటీఆర్ సరసన కనిపించడానికి తెగ ఉత్సాహం చూపించినవాళ్లే. ఇప్పుడు కేసీఆర్ పాలనను విమర్శిస్తూ, కేటీఆర్ మీద తొడకొట్టిన బాలయ్య కూడా.. కేసీఆర్ ప్రాపకం కోసం చాలా వేషాలే వేశాడనేది తెలిసిన సంగతే.

ఇదంతా నాలుగున్నరేళ్లలో జరిగిన సంగతి. తీరా ఎన్నికల సమయంలో మాత్రం తెలుగు సినీతారలు చడీచప్పుడు చేయకపోవడం విశేషం. హీరోలు కానీ, హీరోయిన్లు, కానీ నిర్మాతలు కానీ.. కేసీఆర్ ను వీరుడు శూరుడు అని ఇన్నాళ్లూ ప్రశంచించిన వాళ్లు కానీ.. ఎన్నికల సమయంలో రిస్క్ తీసుకోలేదు.

ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇక తెలుగు సినిమా వాళ్లకు స్వకుల పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎవరూ పెద్దగా రంగంలోకి దిగకపోవడం గమనార్హం. ఇక్కడ సినిమా వాళ్ల భయం సుస్పష్టం. అటు తెలుగుదేశంపార్టీ తరఫున రంగంలోకి దిగాలని ఉన్నా దిగలేరు. ఎందుకంటే.. మళ్లీ తెరాస వస్తే కేసీఆర్ ఏం చేస్తాడో అనే భయం.

అలాగని తెరాస తరఫున రంగంలోకి దిగి ప్రచారం చేయడానికి కుల రాజ్యాంగాలు ఒప్పుకోవు! అందుకే ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ అన్నట్టుగా కామ్ ఉండిపోయారు. ఆఖరికి కూకట్ పల్లి సుహాసిని విషయంలో మాత్రం కొందరు ఆపుకోలేక మద్దతు ప్రకటించారు.

బాలయ్యకు అంటే తప్పింది కాదు! విజయ్ దేవరకొండ మాత్రం తన ఓటు తెరాసకే అని గట్టిగానే చెప్పుకున్నాడు. 

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments