మేం ముందే చెప్పాం: ఉత్తరాంధ్ర తెలుగు తమ్ముళ్ళు

'రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేవని ఏడాది క్రితమే చెప్పాం.. కానీ, ఏం లాభం.? పార్టీ అధినేత ఏమాత్రం పట్టించుకోలేదు, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోలేదు. సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాం. ఇప్పటికే తెలంగాణలో పార్టీ గల్లంతయ్యింది.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు నిజమైతే, ఏడాది లోపే తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది' అంటూ ఉత్తరాంధ్ర తెలుగు తమ్ముళ్ళు లబోదిబోమంటున్నారిప్పుడు. 

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి, ఉత్తరాంధ్రలో పార్టీ ఇంతలా దిగజారిపోవడానికి పలువురు మంత్రులు కీలక భూమిక పోషించారన్నది నిర్వివాదాంశం. మరోపక్క, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఉత్తరాంధ్రని చిన్నచూపు చూశారు. రైల్వేజోన్‌ విషయంలో కావొచ్చు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన కేంద్ర సాయం విషయంలో కావొచ్చు.. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమయ్యిందన్నది నిర్వివాదాంశం. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోగా, చివరి ఏడాదిలో పబ్లిసిటీ స్టంట్‌ కోసం ఎన్డీయే నుంచి బయటకు రావడం, వచ్చాక మొసలి కన్నీరు కార్చడం.. ఇవన్నీ టీడీపీని నిండా ముంచేశాయన్నది ఉత్తరాంధ్ర తెలుగు తమ్ముళ్ళ వాదన. 

పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉత్తరాంధ్ర ముఖ్య నేత, 'పార్టీ ఫిరాయింపుల మీద పెట్టిన శ్రద్ధ, పార్టీ క్యాడర్‌ని బలోపేతం చేయడంలో పెట్టకపోవడంతోనే ఈ దుస్థితి' అని అంటున్నారంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్ర మాత్రమే కాదు, రాయలసీమలో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి టీడీపీకి. ఓ సామాజిక వర్గం కోసం రాజధాని అమరావతిలో నానా హంగామా చేసిన చంద్రబాబుకి, అక్కడా పరిస్థితులు అంత అనుకూలంగా కన్పించడంలేదు. 

మొత్తమ్మీద, ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు వచ్చేశాయి.. 23న అసలు ఫలితాలొచ్చేస్తాయి. నిజానికి, పోలింగ్‌ రోజునే కొందరు 'కాడి' కొంద పడేసిన దరిమిలా, ఫలితాలొచ్చాక.. ఎంత తక్కువ టైమ్‌లో టీడీపీ తెలంగాణలోలా ఆంధ్రప్రదేశ్‌లో అంతర్ధానమవుతుందన్నదే చర్చ తప్ప, ఇంకో చర్చ జరగడంలేదు ఆంధ్రప్రదేశ్‌లో. 

Show comments