రజనీ, పవన్.. సల్మాన్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి!

సూపర్ స్టార్ రజనీకాంత్ లాగానో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాగానో.. సల్మాన్ ఖాన్ ఫిలాసఫీ చెప్పడు. తనేదో గొప్ప వ్యక్తిని అని చెప్పుకోడు. తనకు పెద్ద పెద్ద ఆదర్శాలున్నాయని డప్పేసుకోడు. పెద్ద వాళ్ల పేర్లను చెప్పుకోడు.. వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా.. తన జీవితం తనదన్నట్టుగా గడిపేస్తూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తికే తనను నమ్ముకుని కొందరు బజారున పడే సరికి బాధ అనిపించింది.

ట్యూబ్‌లైట్ సినిమాతో నష్టపోయిన వారికి పరిహారం కట్టించడానికి సల్లూ రెడీ అవుతున్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ట్యూబ్ లైట్ సినిమా ఏ స్థాయిలో బోల్తా పడిందో చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ మార్కెట్ ను చేసుకున్నారు. ఆ వ్యాపారంతో సల్మాన్ కు భారీ మొత్తమే ముట్టింది. ఈ సినిమాకు సల్మాన్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించాడు.

తన సినిమా ప్రి రిలీజ్ మార్కెట్ ను పూర్తిగా క్యాష్ చేసుకున్నాడు. ఇక సినిమా విడుదల అయ్యాకా తొలి షో నుంచినే విమర్శలు తప్పలేదు. సినిమా డిజాస్టర్. ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదు సల్మాన్ సినిమాలకు. విమర్శలు ఎంత కామనో, వసూళ్లు కూడా అంతే కామన్. అయితే ట్యూబ్ లైట్ మాత్రం విమర్శలకే పరిమితం అయ్యింది. సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అయితే దాటింది.

కానీ.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ భారీ నష్టాలు తప్పడం లేదు. ఓవరాల్ గా వంద కోట్ల రూపాయల పై వసూళ్లను సాధించినా ట్యూబ్ లైట్ డిస్ట్రిబ్యూటర్లకు 55కోట్ల వరకూ నష్టమని ట్రేడ్ పండితులు తేల్చారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రీఫండ్ చేయడానికి సల్మాన్ ముందుకు రావడం గమనార్హం. తనే నిర్మాత కాబట్టి.. తనే ప్రీ రిలీజ్ మార్కెట్ ను సొమ్ము చేసుకున్నాను కాబట్టి సల్లూ ఆ డబ్బును డిస్ట్రిబ్యూటర్లకు రీఫండ్ చేస్తున్నాడు.

తద్వారా తనను నమ్మి నష్టపోయిన వారిని ఆదుకుంటున్నాడు. మరి ఆ మధ్య లింగా సినిమా డిస్ట్రిబ్యూటర్లు రోడ్డుకు ఎక్కితే రజనీకాంత్ వాళ్లను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ మధ్య ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ బాధితులు రోడ్డుకు ఎక్కడమే కాదు, ఆఖరికి నిరాహార దీక్ష శిబిరాలు కూడా ఓపెన్ చేశారు.

అయితే పవన్ వారిని పట్టించుకోలేదు. వారికి నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు రాలేదు. మరి తమను నమ్ముకుని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారిపై, వారి నుంచి సొమ్ము తీసుకున్న పవన్, రజనీలు కనీసం జాలి చూపలేదు. వీళ్లు రాజకీయాల్లోకి వచ్చి జనాలను ఉద్ధరిస్తామంటుండటం కొసమెరుపు!

Show comments