ఎన్టీఆర్ బయోపిక్.. ఇది 4 గంటల సినిమా

ఇప్పుడంటే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగానికి కథానాయకుడు, రెండో భాగానికి మహానాయకుడు అని పేర్లుపెట్టారు. మరి సినిమాను రెండు భాగాలుగా చేయకముందు ఈ బయోపిక్ పరిస్థితేంటి? అప్పుడు మేకర్స్ ఆలోచన విధానం ఎలా ఉంది? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను మీడియాతో షేర్ చేసుకున్నాడు దర్శకుడు క్రిష్.

క్రిష్ చెప్పినదాని ప్రకారం.. రెండు భాగాల ఆలోచన కంటే ముందు ఎన్టీఆర్ బయోపిక్ ను 4 గంటల సినిమాగా తీయాలనుకున్నారు. దానికి రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు. కానీ సినిమా ఎంత బాగున్నప్పటికీ 4 గంటల పాటు ప్రేక్షకుడు థియేటర్లకే పరిమితమవ్వడం చాలా కష్టమైన పని.

రానురాను సినిమా నిడివి తగ్గిపోతున్న ఈ టైమ్ లో 4 గంటల సినిమా అంటే ప్రేక్షకుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకెత్తయితే 4 గంటల నిడివి సినిమా తీస్తే తీసుకోమని మల్టీప్లెక్సు యాజమాన్యాలు కరాఖండిగా చెప్పేశాయి.

ఒక సినిమాకే 4 గంటలు కేటాయిస్తే తమ బిజినెస్ దెబ్బతింటుందని వాళ్ల వివరణ వాళ్లు ఇచ్చారు. ఇలా అన్ని అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఎన్టీఆర్ బయోపిక్ ను 2 భాగాలుగా తీయాలని నిర్ణయించారు. తేజ చేతిలో ప్రాజెక్టు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కాదిది. క్రిష్ చేతిలోకి వచ్చిన తర్వాత మొదటి నిర్ణయం ఇది.

రెండు భాగాలుగా చేయడం వల్ల మేకర్స్ కు మరో వెసులుబాటు దొరికింది. తొలిభాగంలో బాలయ్య డిమాండ్ చేసిన పాటలు, గెటప్స్ అన్నీ పెట్టగలిగారు. అలా 2 గంటల తొలిభాగం కాస్తా, 2గంటల 30 నిమిషాలు అయిందట. బయోపిక్ రెండోభాగం మాత్రం 2 గంటల్లోనే ముగిసే అవకాశం ఉన్నట్టు క్రిష్ వెల్లడించాడు.

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

 
Show comments