కోడి కత్తి: ఎన్‌ఐఏ దెబ్బకి వణుకుతున్న చంద్రబాబు

మొత్తమ్మీద, మేకపోతు గాంభీర్యం అటకెక్కి, అసలు భయం బయటకొస్తోంది. ఎన్‌ఐఏ విచారణ జోరందుకోవడంతో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వెన్నులో వణుకు షురూ అయ్యింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో హత్యాయత్నం జరిగిన దరిమిలా, ఆ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు విచారణ జరుగుతోందిప్పుడు. ఎన్‌ఐఏ విచారణ అంటే ఆషామాషీగా వుండదు మరి.! 

విశాఖలో విచారణ జరిగింది, నిందితుడ్ని హైద్రాబాద్‌కి తరలించారు. ఏమో, రేపు ఢిల్లీకి తీసుకెళతారేమో. జాతీయ దర్యాప్తు సంస్థల వ్యవహారాలు ఎలా వుంటాయో చంద్రబాబుకి బాగా తెలుసు. ఎందుకంటే, వ్యవస్థల్ని మేనేజ్‌ చేసే క్రమంలో ఆయా వ్యవస్థల పట్ల చంద్రబాబు సంపూర్ణ అవగాహన పెంచుకున్నారు మరి. 

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే.. అదీ కొద్ది గంటల్లోనే డీజీపీ, హోంమంత్రి మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి కూడా, ఈ వ్యవహారాన్ని జస్ట్‌ పబ్లిసిటీ స్టంట్‌ అని తేల్చేశారు. కొన్ని ఆధారాల్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఓ సాధారణ పోలీస్‌ అధికారి చెబితే అది వేరే సంగతి. ఓ టీడీపీ నేత చెబితే ఆ వ్యవహారాన్ని మరోలా చూడొచ్చు. కానీ, డీజీపీ - హోంమంత్రి - ముఖ్యమంత్రి.. వ్యవహారాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడించడమంటే అనుమానాలు రాకుండా ఎలా వుంటుంది.? 

ప్రభుత్వమే కేసుని పక్కదారి పట్టించేలా వ్యవహరించిందన్న అనుమానాలు వైఎస్సార్సీపీ నుంచి వ్యక్తమయ్యాయి. బాధిత వ్యక్తి స్వయానా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌. ఇప్పుడు ఎన్‌ఐఏ, వైఎస్‌ జగన్‌ని కలిసి సమాచారాన్ని సేకరించొచ్చు. ప్రభుత్వాన్ని సైతం కొన్ని ప్రశ్నలకు సమాధానం 'అడిగి' తెలుసుకోవచ్చు. 

అందుకే, చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రమెలా జోక్యం చేసుకుంటుందని నిలదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోపక్క, ఢిల్లీలో చంద్రబాబు అనుకూల బృందం ఈ వ్యవహారమై పావులు కదుపుతోందనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తుండడం గమనార్హమిక్కడ. ఆ 'బృందం' ఎన్‌ఐఏని ప్రభావితం చేయగలదా.? కేంద్రానికి ఇంకోసారి చంద్రబాబు సాగిలా పడ్తారా.? వేచి చూడాల్సిందే.

Show comments