కోడెలవారి కథలు.. వినలేకపోతున్నాం బాబోయ్‌.!

ఐదేళ్ళ తెలుగుదేశం పార్టీ పాలనలో అత్యధికంగా విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే, ఠక్కున వచ్చే సమాధానం స్పీకర్‌గా పనిచేసిన టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ అనే. సీనియర్‌ పొలిటీషియన్‌ అన్న గుర్తింపు తప్ప, ఆ హుందాతనం ఆయనెప్పుడూ కాపాడుకోలేకపోయారు.

అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని సరిగ్గా మాట్లాడనివ్వకపోవడంలో కావొచ్చు, పార్టీ ఫిరాయింపుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించడంలో కావొచ్చు కోడెల తీరు అత్యంత వివాదాస్పదంగా మారిన మాట వాస్తవం. 

అన్నిటికీ మించి, స్పీకర్‌గా తన స్థాయిని ఏనాడో కోడెల శివప్రసాద్‌ మర్చిపోయారు. ఫక్తు టీడీపీ నేతగా మాత్రమే ఆయన వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చేవారు కోడెల శివప్రసాద్‌.

తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి సైతం పార్టీ ఫిరాయింపుల విషయంలో అధికార పార్టీ చెప్పినట్లే నడుచుకున్నా, ఇతర విషయాల్లో హుందాగానే వ్యవహరించారు. కోడెలలో ఆ హుందాతనమే కన్పించలేదు. 

కోడెల శివప్రసాద్‌ వ్యవహార శైలి సంగతి పక్కన పెడితే, ఆయన కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లాలో గడచిన ఐదేళ్ళలో సృష్టించిన రాజకీయ అలజడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఆ కారణంగానే చంద్రబాబు, కోడెల శివప్రసాద్‌కి ఇంకోసారి పోటీ చేసే అవకాశమిచ్చేందుకు చివరి నిమిషం వరకూ తటపటాయించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అంతలా కోడెల, గుంటూరు జిల్లాలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. 

ఎన్నికల పోలింగ్‌ రోజున కోడెల శివప్రసాద్‌, తన నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌కి వెళ్ళి చేసిన యాగీ, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు.. ఆ వ్యవహారం మొత్తాన్నీ నాటకీయంగా ఆయన నడిపించిన వైనం.. వెరసి, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. 

కోడెల మాత్రం, తప్పంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదేనంటున్నారు. 'వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి ఎలా అవుతారో చూస్తాను' అంటూ సవాల్‌ విసిరేస్తున్నారు. ఓటరు తీర్పు ఆల్రెడీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో నిక్షిప్తమైపోయిందన్న విషయాన్ని కోడెల మర్చిపోతే ఎలా.? చంద్రబాబే, కోడెలకు టిక్కెట్‌ ఇవ్వడానికి ఆలోచించారంటే, కోడెల రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

స్పీకర్‌ పదవికి మచ్చ తెచ్చారంటూ తీవ్రాతి తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంటున్న కోడెల ఎన్నికల పోలింగ్‌ తర్వాత చెప్పే కథల్ని తెలుగు తమ్ముళ్ళు సైతం ఎంటర్‌టైన్‌ చేసే పరిస్థితి లేదన్న విషయం పాపం.. ఆయనకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.!