బూతుల ప్రసంగాలు బాబోయ్‌...!

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రసంగాలు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు మాట్లాడిన సభల్లో ప్రతిపక్షాలను ప్రత్యేకించి టీడీపీని, కాంగ్రెసును యమ తిట్లు తిట్టారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బూతులతో దుయ్యాబట్టారు. 'థూ... మీ బతుకు చెడ, బట్టేబాజ్‌, అడ్డమైన దొంగ, దుర్మార్గుడు, ఓ అంటే కేసు, ఉచ్చ పోస్తే కేసు, ఒకటికి, రెంటికీ పోవాలన్నా ఢిల్లీ పర్మిషన్‌ కావాలి'... ఇలా చంద్రబాబును, టీడీపీని ఉద్దేశించి తిట్టిన తిట్లలో ఇవి కొన్ని.

నిజామాబాద్‌ సభలో చంద్రబాబుపై అడ్డంగా విరుచుకుపడిన తీరుకు తెలంగాణలోని పార్టీలేకాదు, ఆంధ్రాలోని నేతలు సైతం ఆశ్చర్యపోయారు. ఆంధ్రా మంత్రులు కేసీఆర్‌ భాషలోనే ఆయన్ని తిట్టారు. వారు కూడా అత్యంత పరుష పదజాలం ఉపయోగించారు. తెలంగాణ కాంగ్రెసు, టీడీపీ నేతలు కేసీఆర్‌ ప్రసంగాలపై మండిపడ్డారు. ఆయనపై చడామడా విమర్శలు చేశారు. చివరకు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

కేసీఆర్‌ ప్రసంగాలు ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించేలా ఉన్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌ ప్రసంగాలను పరిశీలించి అభ్యంతరకరంగా ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ సభలో చంద్రబాబును తిట్టిన తీరుపై ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు నాయకులు. కేసీఆర్‌ ప్రసంగాల్లోని బూతులను కూడా ప్రత్యేకంగా నివేదించారు. ఆకట్టుకునేలా ప్రసంగించడంలో దిట్ట అయిన ముఖ్యమంత్రి ఎన్నో సామెతలను అలవోకగా చెబుతుంటారు.

అంతటి పరిజ్ఞానం ఉన్న ఆయనకు నోరు అదుపులో పెట్టుకోరు. తాను ఇంకా ఉద్యమ నాయకుడిననే అనుకుంటున్నట్లుంది. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు నోరు పెట్టుకొని బతికేశారు. ప్రతిరోజూ దబాయింపులు, బెదిరింపులే. ఎవ్వరినైనా సరే నోటికి ఎంతొస్తే అంత మాట అన్నారు. పైగా 'మా తెలంగాణలో ఇట్లనే మాట్లడతరు' అని దాన్ని మొత్తం తెలంగాణ ప్రజలకు ఆపాదించారు. సరే... ఉద్యమంలో ప్రజలను ఉత్సాహపరిచేందుకు లేదా వారిలో ఆవేశం కలిగించేందుకు ఏదో అన్నారులే అనుకుంటే  తరువాత కూడా ధోరణి మారలేదు.

ఉద్యమ సమయంలో కొన్నిసార్లు తాను అనుచితంగా మాట్లాడానని, అప్పుడు పరిస్థితి అటువంటిదని, అవి మనసులో పెట్టుకోవద్దని తెలంగాణ ప్రకటన తరువాత అనునయ ధోరణిలో చెప్పారు. ఆయన మాటల బారిన పడిన సీమాంధ్రులుగాని, మరొకరుగాని అదంతా మర్చిపోయారు.

ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ బూతుల ప్రసంగాలు మొదలుపెట్టారు. అయితే ఇదంతా ఆయన తెలియకుండా ఆవేశంలో చేస్తున్నది కాదు. వ్యూహం ప్రకారమే చంద్రబాబును తిట్టారు. మహా కూటమిని దుర్భాషలాడారు. మహాకూటమి పట్ల ఓటర్లు ఆకర్షితులు కాకూడదనే ఆయన ప్లాన్‌లో భాగంగానే పరుష పదజాలంతో ప్రసంగిస్తున్నారు.

Show comments