ఇటు అప్లికేషన్లు.. అటు పొత్తు చర్చలా!

ఒకవైపు జనసేన పార్టీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్టుగా ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలైంది. మరో మూడు రోజుల్లో దరఖాస్తుల స్వీకరణల గడువు కూడా ముగియనుంది. దాదాపు రెండు వేల అప్లికేషన్లు వస్తున్నట్టుగా జనసేన ప్రకటించింది కూడా.

ఒకవైపు ఈ తతంగం జరుగుతుండగా.. మరోవైపు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్.. ల మధ్యన పొత్తు చర్చలు జరుగుతూ ఉన్నాయనే వార్తలు వస్తూ ఉండటం గమనార్హం. ఈ రెండు పార్టీల మధ్యన పొత్తు గురించి ఇప్పటి వరకూ చాలా ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు కూడా ధ్రువీకరించారు.

అయితే అప్పట్లో పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని ఖండించారు.  అన్ని స్థానాలకూ జనసేన పోటీ అని కూడా ప్రకటించారు. అయితే పొత్తు ఉండవచ్చనే సంశయాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. మార్చి నెలలో ఆ అంశం మీద స్పష్టత వస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరుకే డీల్ సెటిల్ కావొచ్చని వార్తలు వస్తున్నాయి. పాతిక ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు నాయుడు సై అంటున్నారని టాక్. ఇద్దరికీ మధ్యవర్తిగా లింగమనేని ఎలాగూ ఉండనే ఉన్నారు. ఇద్దరికీ సన్నిహితుడిగా మెలుగుతున్న ఆయన.. రహస్య భేటీని కూడా ఏర్పాటు చేశారని, పొత్తుల చర్చలు ఊపు మీద సాగుతున్నాయని.. అభ్యర్థుల ఎంపిక గురించి కూడా జనసేన తరఫున చంద్రబాబు నాయుడే కసరత్తు చేస్తూ ఉన్నాడనే వార్తలు వస్తూ ఉండటం గమనార్హం.