ఇప్పుడు ఎవరికి కావాలి ఆ సినిమా?

రసికుడు కాని వాడికి కవిత్వం వినిపించకూడదన్నారు. జనాల పోకడలను బట్టి సినిమాలు ప్లాన్ చేసుకోవాలి. అలా అయితే మంచి సినిమాలు ఎలా వస్తాయి? అని అడగడం సులువే. కానీ సినిమా అంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం. ఈ జనరేషన్ కు నచ్చే జోనర్ ను తీసుకుని కూడా మంచి సినిమాలు అందించవచ్చు. అంతే కానీ, పౌరాణికాలు, చారిత్రాత్మక కథలు అందిస్తామంటే కష్టమే.

క్రిష్ లాంటి డైరక్టర్ బాలయ్య లాంటి హీరో కలిసినా, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను గట్టెక్కించడం చాలా కష్టమయింది. ఇక గుణశేఖర్ రుద్రమదేవి సంగతి తెలిసిందే. రాఘవేంద్రుడు-నాగార్జునల ఓం నమో వెంకటేశాయ పరిస్థితి తెలిసిందే. ఇన్నీ తెలిసి, అనుభవం వుండి కూడా దర్ళకుడు గుణశేఖర్ మరో పౌరాణిక కథను తలకెత్తుకుంటున్నారు.

అలనాటి క్లాసిక్ సినిమా సబ్జెక్ట్ భక్త ప్రహ్లాదను మళ్లీ తీయాలనుకుంటున్నారు. ఆయన స్టయిల్ లో ఆయన స్క్రిప్ట్ ఆయన తయారు చేసుకుంటున్నారు. ఎంత తయారు చేసుకున్నా మూల కథ అదే కదా? మరింక కొత్తదనం ఎక్కడి నుంచి తెస్తారు? గ్రాఫిక్స్, సెట్టింగ్స్ ఇవే కదా? ఇప్పుడు ఆయన కొత్తగా చేయించగలిగినవి. బాపు కూడా ఇలాగే అనుకుని శ్రీరామరాజ్యం తీసారు. అయినా రంజింప చేయలేకపోయారు.

ఎందుకంటే డైరక్టర్ల తప్పు కాదు. కాలం మారిపోయింది. జనాల అభిరుచులు మారుతున్నాయి. పిజ్జా కార్నర్ లు ఎక్కువ కనిపిస్తాయి కానీ, పులిహోర దుకాణాలు కాదు. మరెందుకో గుణశేఖర్ కు ఈ తాపత్రయం.

Show comments