ఆశీస్సులా? కస్సుబస్సులా? తేలేది రేపు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ నిర్వహించే అంతర్రాష్ట్ర స్థాయీ సంఘ సమావేశానికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి ఎటొచ్చీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యం వహించే అవకాశం ఉంది. అలాగే జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కూడా జగన్ సమావేశం అవుతారని వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా.. నిజంగానే మోడీ, షా ద్వయం... జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ ఆశీస్సులు అందిస్తున్నారా? లేదా భాజపా కస్సుబస్సులు నిజమైనవేనా? అనేది సోమవారం తేలుతుంది.

భాజపా- వైకాపా సంబంధాలు ఇప్పుడు రకరకాలుగా ధ్వనిస్తున్నాయి. రాష్ట్రంలో భాజపా నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ మీద ఎడాపెడా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ వారు తప్పుపడుతున్నారు. ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను పలుచన చేసే ప్రయత్నంలో ఉన్నారు. అటు పోలవరం విషయంలోగానీ, రాజధాని అమరావతి విషయంలోగానూ.. భాజపా, జగన్ నిర్ణయాల పట్ల ఏమాత్రం సానుభూతి చూపించడం లేదు. ఎడాపెడా విమర్శలు కురిపిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలోనే.. విజయసాయిరెడ్డి తమ ప్రభుత్వ నిర్ణయాలు ప్రతిదానికీ కేంద్రంలో మోడీ, అమిత్ షాల ఆశీస్సులు ఉన్నాయని ప్రకటించి.. కొత్త అనుమానాలకు బీజం వేశారు. దీనివలన ఈ రెండు పార్టీలను ఇరుకున పెట్టేందుకు తెదేపా వంటి ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారు. అయితే పోలవరం విషయంలో మాత్రం కేంద్రం కఠినంగానే మాట్లాడింది. ‘డబ్బిచ్చేది మేం.. మాకు ప్రతి సంగతీ తెలియాల్సిందే’ అని కేంద్రమంత్రి షెకావత్ అనడాన్ని తేలిగ్గా తీసుకోలేం. పోలవరం అథారిటీ తప్పుపట్టిన వైనాన్ని, వారు కేంద్రానికి సమర్పించిన నివేదికను కూడా తేలిగ్గా తీసుకోలేం.

అలాంటి నేపథ్యంలో స్థాయిసంఘం సమావేశానికి వెళుతున్నప్పటికీ.. షెకావత్ తో కూడా భేటీకి జగన్ ప్లాన్ చేసుకోవడం కీలకాంశమే. అమిత్ షాను కలిస్తే... అమరావతి విషయం కూడా చర్చకు వస్తుంది. కేంద్రం తమ నిర్ణయాల పట్ల ఎలా స్పందిస్తున్నదో జగన్.. సోమవారం సాయంత్రానికి విలేకర్ల సమావేశాల్లో చెప్పాల్సి రావొచ్చు. ఇలాంటి నేపథ్యంలో... కేంద్రం నుంచి జగన్ కు ఆశీస్సులే ఉన్నాయో.. వారి పార్టీ కస్సుబుస్సులే మిగులుతాయో చూడాలి.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?

Show comments