ఇదే పొలిటికల్‌ సైన్సంటే...!

కొంతమందిని ఏం చదువుకున్నారు? అని అడిగితే 'పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేశా' అంటారు. కొందరు 'రాజకీయ శాస్త్రంలో డాక్టరేట్‌ చేశా' అంటారు. కొందరు పొలిటికల్‌ సైన్స్‌ లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా పనిచేస్తుంటారు. వీరికి రాజ్యాంగం, చట్టసభలు, ఎన్నికలు, రాజ్యం, దాని స్వభావం... వగైరా విషయాలు తెలుస్తాయేమోగాని నిజమైన పొలిటికల్‌ తెలుస్తుందా? వీరు చదువుకునేదంతా థియరీ.

ఇదంతా ప్రాక్టికల్‌ రాజకీయ శాస్త్రం కాదు. అసలు సిసలు రాజకీయ శాస్త్రమంతా పుస్తకాల్లో ఉండదు. రాజకీయ నాయకులు, పాలకులు చేసే రాజకీయాల్లో ఉంది. ఇంతకూ అసలైన పొలిటికల్‌ సైన్స్‌ అంటే ఏమిటి? పొత్తులు పెట్టుకోవడం, చిత్తు చేసుకొని విడిపోవడం. 'దిసీజ్‌ది రిథమ్‌ ఆఫ్‌ లైఫ్‌' అని ఓ సినిమాలో పాడినట్లుగా రాజకీయాల్లో రిథమ్‌ ఇదే. ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలో, ఎప్పుడు చిత్తు చేసుకోవాలో తెలుసుకోవడమే రాజకీయం.

మన దేశంలో రాజకీయాలు 'పొత్తు-చిత్తు' అనే సూత్రం మీదనే నడుస్తున్నాయి. ఈ సూత్రానికి ప్రాదిపదిక 'రాజకీయాల్లో శాశ్వత శత్రువుల ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు' అనేది. ఇందుకు ఉండాల్సింది ఏమిటి? సిగ్గు, శరం, లజ్జ, మానాభిమానాలు లేకపోవడం. రాజకీయాల పేరుతో కార్యకర్తలు కొట్టుకొని చస్తారుగాని నాయకులు కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. బిహార్‌ను చూస్తున్నాం కదా.

ఒకప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ శత్రువులు. అప్పుడు నితీష్‌ పార్టీ, బీజేపీ మిత్రులు. రెండు పార్టీలు కలిసి సర్కారును నడిపాయి. తరువాత రెండు పార్టీలూ విడిపోయాయి. శత్రువులైన లాలూ, నితీష్‌ కలిసి (కాంగ్రెసు కూడా) బీజేపీని ఓడించారు. ప్రతిపక్షాల ఐక్యతకు బీజం పడిందన్నారు. మళ్లీ లాలూ, నితీష్‌ కొట్టుకున్నారు. ఓడించిన బీజేపీనే మళ్లీ అక్కున చేర్చుకున్నారు.

అటల్‌ బిహారీ హయాంలో చంద్రబాబునాయుడు ఎన్‌డీఏలో భాగస్వామి. అప్పట్లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఈయన శత్రువులా చూశారు. ఆ తరువాత జన్మలో బీజేపీని దగ్గరకు రానివ్వనన్నారు. కాని అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. శత్రువులా చూసిన మోదీని ప్రధాని అయ్యేసరికి సలాములు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందో, పెటాకులవుతుందో తెలియదు.

ఒకప్పుడు కమ్యూనిస్టులతో కలిసి పనిచేసిన టీడీపీ ఆ తరువాత టూరిజం తప్ప కమ్యూనిజం లేదని సూత్రీకరించింది. కాంగ్రెసుకు, కమ్యూనిస్టులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాని పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించడం కోసం కమ్యూనిస్టులు, కాంగ్రెసు చేతులు కలిపారు. తమిళనాడులో కాంగ్రెసు పార్టీ డీఎంకేతో, అన్నాడీఎంకేతో మార్చి మార్చి పొత్తు పెట్టుకున్న సందర్భాలున్నాయి. భిన్న ధ్రువాలైన టీడీపీ, టీఆర్‌ఎస్‌, సీపీఎం మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి.

ఇలాంటి రకరకాల పొత్తులు దేశం నిండా అనేకసార్లు ఏర్పడ్డాయి. ఇది చాలా పెద్ద చరిత్ర. అత్యవసర పరిస్థితి తరువాత ఇందిరా గాంధీని మట్టికరిపించేందుకు విభిన్నమైన పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడటం, త్వరలోనే అది విఫలం కావడం తెలిసిందే. ఆ తరువాతే జనసంఘ్‌ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అధికార పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడటం, అది విఫలం కావడం జరుగుతూనే ఉంది.

తాజాగా బీహార్‌లో మహాకూటమి (జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెసు) ప్రభుత్వం మటాషైపోయి ఎన్‌డీఏ సర్కారు ఏర్పడింది. బిహార్లో మహాకూటమి అధికారంలోకి వచ్చాక వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎన్‌డీఏకు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పడుతుందని బీజేపీ వ్యతిరేకులు అంచనా వేశారు.

ప్రతిపక్ష కూటమి తరపున ప్రధాని పదవికి అర్హులైనవారి పేర్లూ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అందులో నితీష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. నీతి నిజాయితీ. పరిపాలన దక్షత ఉన్న నితీష్‌, బీజేపీ మోదీకి సరైన ప్రత్యర్థి అనుకున్నారు. ఇప్పుడు ఆయనే మోదీతో చేతులు కలపడంతో కథ మారిపోయింది.

బిహార్‌ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశాక నితీష్‌ మళ్లీ ఆ పార్టీతో చేతులు కలిపి నైతిక విలువలను తుంగలో తొక్కారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంలో నైతిక విలువలు పాటించడం రాజకీయ నాయకులకు సాధ్యం కాదు. ముఖ్యంగా అధికారాన్ని దక్కించుకునే విషయంలో వారు నైతిక విలువల గురించి ఆలోచించరు. ఆ కాలం పోయింది.

Show comments